‘‘నీతో పాటు డాక్టరమ్మ గదిలోకి వచ్చిన ఆయన మీ ఆయనా?’’ అడిగింది త్రివేణి.‘‘కాదు.. ఆయన మా ఊరి ఆర్‌ఎంపి డాక్టర్‌. మా ఆయన సచ్చిపోయాడు!’’ సమాధానమిచ్చింది ఇరవైయేళ్ల బాలమణి!‘‘అయ్యో.. హాస్పిటల్లో ఉంటున్నావని తాళిబొట్టు, మెట్టెలు...తీసేశావేమో అనుకున్నా. ఏమనుకోకు!’’ అంది త్రివేణి నొచ్చుకుంటూ.మళ్లీ వెంటనే ..‘ఎలా పోయాడు?’ అనడిగింది.‘‘దుబాయ్‌లో బిల్డింగ్‌కట్టే పనికిపొయ్యి బిల్డింగ్‌ మీదినుంచి కిందపడి పానం ఇడ్చిండు. ఏడాదైంది!’’ వివరించింది.‘‘అరెరె..చిన్న వయసే నీది పాపం!’’ జాలిపడ్డది త్రివేణి. పేలవంగా నవ్వి ఊరుకుంది బాలమణి.కాసేపటికి మళ్లీ అడిగింది త్రివేణి.. బాలమణి నిండుగర్భాన్ని చూపిస్తూ ‘‘ఇదే మొదటిసారా!’’‘‘ఇంతకు ముందొక కొడుకు ! ఫిట్స్‌ రోగమొచ్చి పోయిండు. రెండేండ్లయితుంది!’’ ఏ భావం లేకుండానే చెప్పింది బాలమణి.‘‘అయ్యయ్యో.. ఎన్నేళ్ల పిల్లాడు?’’ మళ్లీ జాలి త్రివేణిలో.‘‘మూడేండ్లుండె!’’ నిర్వికారంగానే బాలమణి.‘‘ఇందాక నేనడిగింది ఇట్లా ఇదే మొదటిసారా అని!’’ తన మొదటి ప్రశ్నను జ్ఞప్తికి తెచ్చింది త్రివేణి.‘‘ఊ...!’’తల నిలువుగా ఊపింది బాలమణి.‘‘నాకి ది రెండోసారి. 

మాది గుంటూరు దగ్గర. మీదీ?’’ అడిగింది త్రివేణి.‘‘కరీంనగర్‌ అవుతల!’’ ముభావంగానే చెప్పింది బాలమణి.‘‘కడుపులో బిడ్డను మోస్తున్నందుకు ఎంతిస్తామన్నారేంటి?’’నోటిని బాలమణి చెవి దగ్గరగా ఉంచి అడిగింది త్రివేణి.‘‘మూడు లక్షలిస్తమన్నరు. అడ్వాన్సు కింద లక్షన్నరిస్తే అండ్లనుంచి మా ఆర్‌ఎంపి డాక్టర్‌ యాభైవేలు తీస్కుండు!’’ వివరాలన్నీ చెప్పింది బాలమణి.‘‘నయం నీకు మూడు లక్షలిస్తామన్నారు. నాకైతే లక్షన్నరే! మార్వాడీ వాళ్ల పిండాన్ని మోస్తున్నాను. కోట్ల ఆస్తుందట వాళ్లకు. పీనాసోళ్లు కాకపోతే మరీ లక్షన్నరే ఇస్తారా? బిడ్డల్లేరనే కదా ఇన్నాళ్లు బాధపడింది వాళ్లు!’’ అంటూ నిష్ఠూరమాడి ‘‘అవునూ నువ్వెవరి బిడ్డను మోస్తున్నావ్‌?’’ అడిగింది బాలమణిని.‘‘తెల్వదు.. చెప్పలేదు. మా ఆర్‌ఎంపి డాక్టర్‌తోటి డాక్టరమ్మ అనంగా ఇన్న ఒకసారి...వాళ్లు ఇరాన్‌దేశంల ఉంటరట. మొగుడుపెండ్లాలిద్దరూ డాక్టర్లేనట!’’ అని చెప్పి సొంత వివరంలోకి వెళ్లింది బాలమణి..‘‘ఊర్ల మాకు రెండెకరాల పొలముంది. మా ఆయన దుబాయ్‌కి పోయేటప్పుడు పైసలు అవసరమై మా ఊరి శాలాయనతాన కుదువబెట్టినం. నా కొడుకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా ఆయనే అప్పిచ్చిండు. వడ్డీలేకనే ఐదు లక్షల అప్పయింది. పాపం శాలాయన....నా పెనిమిటి సచ్చిపోయిండని వడ్డీ మాఫీ చేసి అసలు కట్టమన్నడు. అవి కడితే పొలం మాకైతది. కాలం లేక పొలంల కూలీ లేదు. భీవండి పోదామనుకున్న... గప్పుడే మా ఊరి ఆర్‌ఎంపి డాక్టర్‌ ఈడికి తీస్కొచ్చిండు. ఈ విషయం మా ఊర్ల ఎవ్వరికి తెల్వదు. ఈ డాక్టర్‌కి తెలిసినోళ్లతో కలిసి భీవండి పోతున్నా అని మావోల్లకు జెప్పి బస్సెక్కిన. పట్నంల దిగిన. పదినెల్లయితాంది!’’ మనసు భారం దించుకున్న భావనలో బాలమణి.