‘‘తలుపు లోపల్నించీ లాక్‌ చేసావ్‌ కదా!’’ అని బాస్‌ అంటే ‘‘ఊఁ’’ అంది మాధవి.‘‘ఐతే ఇక బట్టలు విప్పు’’ అని బాస్‌ అంటే ‘‘ఛీ- ఇది పట్టపగలు...’’ అంది మాధవి.‘‘పట్ట పగలైతేనేం- గది లోపలున్నది మనమిద్దరమే కదా!’’‘‘ఐనా బయట జనమున్నప్పుడు- కొన్నింటికి సమయాసమయాలుంటాయి’’‘‘కొన్నింటికంటే- నీ ఉద్దేశ్యమేమిటో కానీ- నేను మాత్రం ఫొటోకోసం అడిగాను’’‘‘రాజుగారి భుజంమీద చెయ్యేసిన విదూషకుడు- అదేమంటే రాణిగారనుకున్నాననిసంజాయిషీ ఇచ్చేట్ట. అలాంటి ఫొటోలకి ఏ మోడల్నో పిల్చుకోండి’’‘‘అయ్యో- తప్పుగా అర్థం చేసుకున్నావ్‌. ఇది చూడు’’ అని బాస్‌ అంటూండగా ఏదో ప్యాకెట్‌ విప్పుతున్న చప్పుడు. అంతలోనే, ‘‘అరే- అనార్కలీ డ్ర స్సు. అదీ నాకిష్టమైన ఆకాశం రంగులో...’’ అంటూ ఆమె గొంతులో పట్టరాని ఆనందం.‘‘వేసుకున్నది విప్పు. ఇచ్చింది వేసుకో. నీదో ఫొటో తీసుకుని ధన్యుణ్ణౌతాను’’‘‘ఊఁ ఈ విషయం ముందే చెప్పొచ్చుగా, హడలగొట్టి చంపారు...’’‘‘నాకు నువ్వంటే ఎంత ప్రేమో అంత గౌరవం. అది తెలిసి కూడా నువ్వు అనవసరంగా అనుమానిస్తూంటావ్‌. ఊఁ క్విక్‌. ఇంకో పది నిముషాల్లో నాకు మిస్టర్‌ ప్రకాష్‌తో అపాయింట్‌మెంటుంది...’’క్షణం నిశ్శబ్దం తర్వాత, ‘‘వావ్‌- వాటే బ్యూటీ! నాకు నిన్నిలాగే చూస్తూ ఉండిపోవాలనుంది. 

ఫొటో కాసేపాగి తీసుకుంటాను...’’ అంటూ బాస్‌ అభినందన.‘‘మరి- మిస్టర్‌ ప్రకాష్‌తో అపాయింట్‌మెంట్‌...?’’ ఆమె గొంతులో చిలిపితనం.‘‘ఆ ప్రోబ్లం నీది కాదు, నాది’’ బాస్‌ గొంతులో ఉత్కంఠ తర్వాత మళ్ళీ ఒక్క క్షణం నిశ్శబ్దం.్‌్‌్‌ఇయర్‌ ఫోన్‌ తీసి బల్లమీద పెట్టి భారంగా నిట్టూర్చాను. అవతల బాస్‌ గదిలో- ఆయన పెర్సనల్‌ సెక్రటరీ మాధవిని ఊహించుకుంటే, ‘‘అదృష్టమంటే బాస్‌దే’’ అనిపించింది. వళ్ళు వేడెక్కింది.నేను ఎమ్మే. బాస్‌ బియ్యే. నా ఎత్తు ఐదడుగుల పదంగుళాలు. ఆయన నాకంటే ఆరంగుళాలు పొట్టి. నాది ఒత్తైన క్రాపు. ఆయనది బట్టతల. నాది పసిడి ఛాయ. ఆయనది శ్యామల వర్ణం. సిక్స్‌ ప్యాక్‌ లేకపోయినా టె న్నిస్‌ ప్లేయర్‌ పెర్సనాలిటీ నాది. ఊపిరి బిగబట్టినా ఇంకా ఉన్నాననిపించే బొజ్జ ఆయనది. ఆయన వయసు ముప్ఫైఐదు. నాది ముప్ఫై లోపే. ఆయనెప్పుడో వివాహితుడు. నేనింకా బ్రహ్మచారిని.అదేమిటో మరి- మా ఆఫీసులో పనిచేసే పెళ్ళికాని అమ్మాయిలు నన్ను కన్నెత్తైనా చూడరు. బాస్‌కేమో- పెళ్ళై రెండేళ్లైనా స్ర్కీన్‌ టెస్టుకి ఒకరోజు ముందు ఎలియానాలా ఉండే మాధవిని- పెళ్ళైందన్న గౌరవభావంవల్ల- నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. బాస్‌ ఇలాకా అన్న ప్రచారమున్నా- అందమైన పెర్సనల్‌ సెక్రటరీలపై అలాంటి పుకార్లతో బురద జల్లడం మామూలే అని ఏవగించానే తప్ప ఆమెని అనుమానించలేదు. కానీ ఈరోజు అనుకోకుండా మాధవి గుట్టు రట్టయింది నా దగ్గిర.