భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికి కొన్ని కుటుంబ బాధ్యతలు, కొన్ని సామాజిక బాధ్యతలుంటాయి. సామాజిక బాధ్యతల్ని పరిపూర్తిగా నెరవేర్చలేకపోయినా....కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చడంలో అలసత్వం చూపిస్తే...కుటుంబం కుంటుపడుతుంది. సమస్యలు చుట్టుముడతాయి. మనఃశ్శాంతి మన దగ్గరికి రావడానికి భయపడుతుంది. బాగా ఆలోచించి చూడు. నువ్వు నెరవేర్చాల్సిన ‘బాధ్యత’ ఏమిటో నీకే అవగతమవుతుంది’’ అన్నాడు అంతా విన్న భాస్కరం మామయ్య.సుబ్బులు బాబాయి రెండో కొడుకు పెళ్లికి బందరొచ్చాను. ఆప్తుడు, సన్నిహితుడు...భాస్కరం మామయ్యని చూడగానే...మనసులో మంచులా ఘనీభవించిన వేదన కరగడం మొదలుపెట్టింది. స్నానాదులు ముగించుకొని, ఇద్దరం మంగినపూడి బీచ్‌కి వచ్చాం.ఎగిసిపడే కడలి తరంగాలు తీరం చేరుకున్నట్టు మదిని మెలిపెడుతున్న బాధ...భాస్కరం మామయ్య ముందుంచేసరికి అంతా విని, మామయ్య అన్న మాటలివి.భాస్కరం మామయ్య ఇన్‌డైరక్టుగా తెలియజెప్పిన ‘బాధ్యత’ ఏమిటో నాకు తెల్సినా, మనసెందుకో ఆ క్షణం నుంచి తేలికపడ్డట్టు అన్పించింది. మామయ్యకి, నాకూ ఆరేళ్లే వయస్సు వ్యత్యాసం.ఇదే సముద్రం సాక్షిగా... మా ఇద్దరి జీవితాల్లో జరిగిన, ఎన్నో ముఖ్య నిర్ణయాలు, మనఃక్లేశాన్ని కల్గించిన సంఘటనలకి ఉపశమనాలు దొరికాయిక్కడ. మా ఇద్దరి అనుబంధ, ఆప్యాయతలకి, సంతోష, దుఃఖాలకి ఈ సముద్రపు ఘోష మాతో పాటు పాలు పంచుకుంటూ, మా ఆత్మీయతకు ఆనవాలుగా అప్పటికీ, ఇప్పటికీ....ఎప్పటికీ....బందరులో పెళ్లి అవగానే బయల్దేరి...మర్నాడుదయం హైదరాబాదొచ్చాను. రాత్రి బస్సులో మనసుని తొలుస్తున్న ఆలోచనలు నా లోచనాలకు విశ్రాంతినివ్వలేదు.

‘‘ఎందుకో తెలీటం లేదు గానీ...కొన్ని రోజులుగా నా మనస్సులోనూ, ఇంట్లోనూ నెమ్మది లేకుండా పోయింది. నా కొడుకు శ్రీధర్‌ ఎంసిఏ చదివాడు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో టిసిఎస్‌ ఉద్యోగం వచ్చి సంవత్సరం దాటుతున్నా అప్పాయింట్‌మెంటు ఆర్డరు చేతికి రాలేదు. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ పడిపోయిందంటున్నారు. ఎప్పుడు వాడికుద్యోగం వస్తుందో అర్థం గాని పరిస్థితి, కూతురు శిరీషకి ఆశించిన కాలేజీలో, కావాలనుకున్న బ్రాంచిలో ఇంజనీరింగ్‌ సీటు దొరకలేదు. భార్య పద్మకి ఈ మధ్యనే యుటెరస్‌ రిమూవల్‌ ఆపరేషన్‌ జరగడం ఒకదాని వెంట మరొకటి ఇంటి సమస్యల ప్రభావం నేను పన్జేస్తున్న ఉద్యోగంపై చూపడం వల్ల...అక్కడా ప్రతి రోజూ చికాకులు.సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే....కాఫీ ఇచ్చి, ‘‘ఏంటండీ! అదోలా ఉన్నారు?’’ అంది పద్మ.‘‘నాన్న....’’‘‘పెళ్లిలో ఎవరైనా....ఏమైనా అన్నారా?’’భాస్కరం మామయ్య అన్న మాటలు చెప్పాను.పద్మ మౌనంగా కాఫీ గ్లాసు తీసుకుని లోపలకెళ్లింది.నాన్న...నాన్న గుర్తు రాగానే...కళ్లల్లో తడి. ‘ఇల్లొదిలి వెళ్లి వారం రోజులవుతోంది. ఎక్కడ ఉన్నాడో! ఏం తింటున్నాడో..’ మనసు మూల్గింది. పడక్కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాను.నేను నోరు జారి ఉండాల్సింది కాదేమో. ఎంతో సహనం, ఓర్పు ఉన్న నాన్న నా చిన్న మాటని అంత సీరియస్‌గా పట్టించుకొని ఇల్లొదిలి వెళతాడనుకోలేదు. ఇలా ఎన్నడూ జరగనూ లేదు.