నెలాఖరు కావడంతో బతకలేని బడిపంతులు ఉద్యోగం చేస్తున్న నాకు, కొంత డబ్బు ఎవరి దగ్గరైనా చేబదులుగా తీసుకోవలసిన అవసరమొచ్చింది. ఈ నెలంతా పెళ్లిళ్ల సీజన్‌ అవడం వలన పెళ్ళిళ్ళకు హాజరవడం, చదివింపులు, ఇంటికి బంధువుల రాకపోకలతో ఖర్చులు పెరిగి నా నెలసరి బడ్జెట్‌ అంతా తల్లక్రిందులైంది.రేపు విజయవాడలో మరో ముఖ్యమైన బంధువుల ఇంట్లో పెండ్లి ఉంది. ఫ్యామిలీతో తప్పక హాజరవ్వాల్సిన పెళ్ళి. కనీసం వెయ్యి రూపాయలైనా కావాలి. ఎవరి దగ్గరన్నా చేబదులు తీసుకుని, ఒకటో తేదీన జీతాలు తీసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే డబ్బులు ఎవరిని అడగాలా అని ఆలోచించగా, వెంటనే నా ఫ్రెండ్‌ రామారావు గుర్తొచ్చాడు. వాడి దగ్గరైతే డబ్బు పుష్కలంగా ఉంటుంది. వెంటనే పని జరిగిపోతుందనుకొని వాడింటికి బయలుదేరాను.రామారావు, నేను ఒకే ఊరివాళ్ళం. చిన్నప్పటినుండి స్నేహితులం. ఒకటో తరగతి నుండి బి.యిడి దాకా కలిసే చదువుకున్నాం. 1994 డి.యస్‌.సిలో ఒకేసారి ఇద్దరం టీచర్లుగా సెలక్టయి ఒకే మండలంలో పని చేస్తున్నాం.రామారావు మహాముదురు. మాటకారి. అవతల మనిషిని ఐదు నిమిషాల్లో తన మాటలతో బుట్టలో పడేస్తాడు. అందుకేనేమో ఇద్దరం ఒకేసారి ఉద్యోగాల్లో చేరినా, నేనేమో అద్దె ఇంట్లోనే కాలం గడుపుతుంటే, వాడు మాత్రం సొంత ఇల్లు కట్టుకొని, హీరోహోండా మీద తిరుగుతూ సెల్‌ఫోన్‌ మెయిన్‌టైన్‌ చేస్తూ యమా జల్సాగా ఉన్నాడు.

అయితే, వాడు చెయ్యని వ్యాపారం లేదు. ప్రవేట్‌ చిట్స్‌ మెయిన్‌టైన్‌ చేస్తుంటాడు. వాడి భార్యపేరు మీద ఎల్లైసీ ఏజన్సీ తీసుకొని పాలసీలు కట్టిస్తుంటాడు. ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో పార్ట్‌నర్‌గా ఉంటున్నాడు. ఈ మధ్యనే ఫైనాన్స్‌ కంపెనీ పెట్టి వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడని తెలిసింది. మరచిపోయా, రెసిడెన్షియల్‌ కార్పోరేట్‌ కాలేజీలకు ఏజంట్‌గా పనిచేస్తూ, కమీషన్‌ మీద విద్యార్థులను చేరుస్తుంటాడు. డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలనూ ఉపయోగించుకుంటూ మనిషి బిజీబిజీగా తిరుగుతుంటాడు. ఇన్నిరకాల వ్యవహారాలతో వీడు స్కూల్‌కి ఎపడు పోతాడో, పిల్లలకు పాఠాలు ఎపడు చెబుతాడో నా కర్థం కాదు.నేను రామారావు ఇంటికెళ్ళేసరికి వాడు ఇంట్లో లేడు. బయటికెళ్ళాడన్నయ్యా అని వాడి భార్య చెప్పింది. వీడు నాకెక్కడ దొరుకుతాడబ్బా! ఇంకెవరినైనా వెతుక్కుందామా అని ఆలోచిస్తూ వెనుతిరుగుతుండగా నా అదృష్టం బాగుండి రామారావు రానే వచ్చాడు.వస్తూనే ‘‘ఏవండోయ్‌! నాయుడుగారూ! ఏంటిలా వచ్చారు? చాలా రోజులకు గుర్తొచ్చామే మేము’’ అన్నాడు నిష్ఠూరంగా.ఒరే, నువ్వు నన్ను అంటున్నావట్రా! మూడు వ్యాపారాలూ, ఆరు ఆదాయాలతో నువ్వు తీరిక లేకుండా తిరుగుతూ నింద నా మీద వేస్తున్నావట్రా’’ అన్నాను.