తెలుగుభాషలో కొన్నిపదాలకి సరైన అర్థం చెప్పటం చాలాకష్టం. సందర్భానుసారంగా ఆ పదాల్ని మనమే అవగాహన చేసుకోవాలి. సామాన్యంగా తెలివితక్కువ దద్దమ్మల్నీ, అప్రయోజకుల్నీ బడుద్ధాయి అనీ, వాజమ్మ అనీ చెప్తూ వుంటారు. కాని ఆ పదం కేవలం తన భర్త గోపాలం గురించి మాత్రమే సృష్టించబడిందని మీనాక్షి ఉద్దేశం. ఆ సంగతి ఆమె కాపురానికి వచ్చిన కొత్తల్లోనే గ్రహించింది.అత్తా, మామా, మరిదీ భర్తా అందరితో కలిసి వుండవలసిన ఉమ్మడి కుటుంబానికి కోడలుగా వెళ్ళింది మీనాక్షి. పెళ్ళితంతులన్నీ ముగిశాక, ఆమె తల్లితండ్రులు అన్నిలాంఛనాల తోటే అత్తారింట్లో దింపి వెళ్ళారు ఆమెని. ఇంట్లో అందరూ చాలా సరదాగా వుంటారు. కనుకనే ఆమె అత్తారింట్లో త్వరలోనే ఇమిడిపోయింది. ఒకరోజు అందరూ కూర్చుని కాఫీలు త్రాగుతూ వుండగా గోపాలం తల్లితో.‘‘అమ్మా ఎలావుందే మన సెలక్షను?’’ అన్నాడు ఓరగా భార్య వంక చూస్తూ. తల్లి కొడుకువైపు ఆపేక్షగా చూస్తూ ‘‘నిక్షేపంగా వుందిరా నువ్వు చాలా అదృష్టవంతుడివి’’ అంది.‘‘అదృష్టం నాది కాదే దానిదే మనలాంటి భర్త దొరకాలంటే పెట్టి పుట్టాలి’’ అన్నాడు గోపాలం కాలరెగరేస్తూ గర్వంగా.మీనాక్షికి నవ్వొచ్చింది. 

ఎందుకంటే అప్పటికి కనీసం పది పన్నెండు సంబంధాలు చూశారనీ, పిల్లాడు పొట్టి, నలుపు, ఉద్యోగం కూడా ఏమంత గొప్పది కాదని, ఏ ఆడపిల్లా ఇతగాడ్ని చేసుకుందుకు ఇష్టపడ లేదనీ అభ్యంతరం లేకపోతే చూసుకోమనీ ఈ సంబంధం గురించి చెప్పిన పిన్నిగారు చెప్పింది. అయినా పిల్లాడు బుద్ధిమంతుడనీ, చాలా సాంప్రదాయమైన కుటుంబం అనీ తన తండ్రి తనకి నచ్చచెప్పి ఒప్పించాడు. గోపాలం తల్లితండ్రులు కట్నం కానుకలు అడుగలేదు. చదువుకున్న పిల్ల అయితే చాలనీ, తమ ఇంట్లో ఇమిడిపోయే పిల్లైతే చాలనీ అన్నారు.నిజానికి మీనాక్షి గోపాలం కంటే ఎక్కువగా చదువుకుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. తన తల్లీతండ్రీ ఇంతకంటే పెద్ద సంబంధం తేలేరని తెలుసుకుని, మొదటిసారి చూసిన సంబంధమే ఒప్పేసుకుంది. అందుకు తనేం బాధ పడటం లేదు. ఇంట్లో అందరూ మంచి వాళ్ళు. భర్త కూడా మంచివాడే. కాకపోతే సొంతడబ్బా ఎక్కువ. బ్రహ్మదేవుడి సృష్టిలో తానొక్కడినే తెలివైనవాడినని అతడి నమ్మకం. అందుకే ఎప్పుడూ అందర్నీ విమర్శిస్తూ హేళనగా మాట్లాడుతూ వుంటాడు. అదొక్కటే తనకి నచ్చదు. అంతమాత్రానికే తను బాధ పడదు. కాని ఇంటి విషయంలో ఏ మాత్రం పట్టించుకోడు.

అన్నింటికీ పాపం అత్తగారు మావగారు తిరగ వలసిందే. కూరలు తెమ్మంటే ముదరవీ, పుచ్చువీ తెచ్చి పడేస్తాడు. ఆ బాధపడలేక ముసలివాడైనా మావగారే బజారు పనంతా చూసుకుంటాడు. సామాన్యంగా ప్రతి సంసారంలో లాగే ఇంటద్ది వగైరా లివ్వటం కాస్త ముందూ వెనకా అవుతుంటుంది. అలాంటప్పుడు తను ఇంట్లో దాక్కుని అత్తగార్ని మాట్లాడమని పంపిస్తాడు. తాను ఇంటి యజమానినేననే అహంకారంతో కనీసం గ్లాసుతో మంచినీళ్ళు ముంచుకుని కూడా తాగడు. ఆఫీసు వేళకి బూట్లు సాక్సుతో సహా అన్నీ అందించాల్సిందే. ఇవన్నీ మీనాక్షికి నచ్చవు. అయినా కాని మీనాక్షి ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం చెయ్యకుండా సర్దుకుపోయేది. ఎందుకంటే సర్దుకుపోవటం లోనే స్వర్గం వుందని ఆమె తల్లి చెప్పింది.