గోధుమరంగు జుట్టు, పాలిపోయిన మొహంతో స్లిగో పట్టణంవైపు వడివడిగా నడుస్తూ వెళుతున్నాడు కమ్‌హాల్‌. ఎర్నాన్స్‌ వంశానికి చెందినవాడు. సన్నిహితులు అతన్ని ‘వేగంగా పరిగెత్తే గుర్రం’ అంటుంటారు. ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉంటాడు. పొట్టిగా ఉన్న దుస్తులు, మొనదేలిన బూట్లు వేసుకుని ఉన్నాడు. చేతిలో సంచి నిండుగా ఉంది. ఎరి చుట్టుపక్కల ఉండే నాలుగు జిల్లాల్లో అతను తరచుగా తిరుగు తుంటాడు. అయితే భూమిమీద అతనికి నివసించదగిన ప్రదేశం కనిపించలేదు.పట్టణానికి తూర్పుభాగంలో ఉన్న కొండ శిఖరం వైపు చూసిన అతని కళ్ళు అక్కడే నిలిచి పోయాయి. శిఖరాగ్రం మీద అతనికి వరుసగా ఉన్న శిలువలు కనిపించాయి. అతను శిలువల వైపు చూస్తూ కోపంగా పిడికిలి బిగించాడు. శిలువలు ఖాళీగా లేవనీ, వాటిమీద మనుషులు వేలాడుతున్నారనీ అతనికి తెలుసు. శిలువల చుట్టూ పక్షులు ఎగురుతున్న దానిని బట్టి అతను ఆ విషయం ఊహించాడు. తనలాంటి సంచార తెగకు చెందిన వాళ్ళనెవరినో శిలువ వేసి ఉంటారని అతను అనుకున్నాడు.‘‘అలా మనుషుల్ని శిలువ వేయటం కన్నా వాళ్లకి ఉరిశిక్ష వేసిగాని, రాళ్ళతో కొట్టిగాని, తల నరికిగాని చంపడం నయం. కానీ బతికుండగానే పక్షులు కళ్ళు పీక్కుని తినడం, తోడేళ్ళు పాదాలు కొరుక్కుని తినడం ఎంతఘోరం. ఆ హింస పడే దానికన్నా పిల్లవాడిగా ఉండగానే ఏ ఎర్రటి గాలి దుమారమో వచ్చి ఉయ్యాల్లో నుంచి తీసుకు పోవడమో, లేదా పర్వతాల్నిచీల్చే పిడుగులు అతన్నికూడా చీల్చివేయడమో, ఆకుపచ్చటి గోళ్ళు ఉన్న జలభూతాలు అతన్ని ఎత్తుకు పోవడమో మేలు కదా’’ అతను తనలో తనే గొణుక్కున్నాడు.అతను మాట్లాడుతూనే ఉన్నా నిలువెల్లా వణికి పోతున్నాడు. అతని మొహం నుంచి చెమట ధారలు కట్టి కారుతోంది. అన్నిశిలువల్ని ఒకే చోట చూసి అతను నోట మాట రానట్టు నిదా నంగా నడుచుకుంటూ కొండల వరస దాటి ఒక క్రైస్తవ సన్యాసుల మఠం ముందు నిలబడి తలుపు తట్టాడు. 

తలుపుతీసిన కాపలాదారుడిని తనకు అతిథి గృహంలో బసకావాలని కోరాడు. పోర్టరు చిన్న కొవ్వొత్తి వెలుగులో అతనికి దారిచూపిస్తూ, ఒక మురికిపట్టిన గదిలోకి తీసుకువెళ్ళాడు. గోడలో బిగించి ఉన్న ఒక కొవ్వొత్తిని వెలిగించి, రెండు అగ్గిపెట్టెలు ఒక కొవ్వొత్తి అతని చేతికిచ్చాడు. గదిలో ఉన్న అల్మారనుంచి రొట్టెను, ఒక కూజాలో ఉన్న నీళ్ళను తీసిచ్చాడు. దూరంగా ఉన్న నీళ్ళ తొట్టెలోని నీటిని స్నానానికి ఉపయోగించు కోవచ్చనిచెప్పి పోర్టరు భవనంలోకి వెళ్ళి తలు పేసుకున్నాడు.

అతను వెళ్ళిన తర్వాత కమ్‌హాల్‌ అగ్గిపుల్ల వెలిగించి కొవ్వొత్తి వెలిగిద్దామని చూశాడు. అవి చెమ్మగా ఉండటంతో అంటు కోలేదు. దానితో అతను బూట్లు విప్పి దుమ్ముతో నిండి పోయిన కాళ్లను కడుక్కోవడానికి నీళ్ళ తొట్టెవైపు నడిచాడు. అయితే నీళ్ళు ఎంత మురికిగా ఉన్నా యంటే అతను నీళ్ళ అడుగుభాగాన్ని కూడా చూడలేక పోయాడు. అతనికి చాలా ఆకలి అని పించింది. అతను రోజంతా ఏమీ తినలేదు కూడా.