అర్థరాత్రి మేలుకొన్న సురభికి ఏదో సందడి వినబడింది. అకస్మాత్తుగా అంతసంరంభం ఎక్కడినుంచి ఎందుకు వస్తోందో ఆమెకి తెలియలేదు. పక్కనే రాఘవ గాఢంగా నిద్రపోతున్నాడు. కిటికీ తలుపు చప్పుడవ కుండా మెల్లిగా తెరిచింది చూద్దామని. రోడ్డుకి అవతలవైపున అవుతోంది ఆ సందడంతా. చాలామంది జనం, పిల్లలూ పెద్దలూ; ఏవేవో సరంజమా సరుకులూ చేరవేయటమూ, సర్దటమూ. టైము చూసింది. మూడు దాటు తోంది. గ్లాసెడు మంచినీళ్లు త్రాగి పడుకుంది.తెల్లవారి పనిమనిషికి తలుపుతీసిన సురభి ఆశ్చర్యపోయింది. ఏనాటి నుంచో అక్కడే ఉంటూ ఉన్నట్లు పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్దలంతా తమతమ వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు. రాత్రికి రాత్రి అక్కడొక కాలనీ తయారయిపోయింది. ఉండటానికి వాళ్లు ఏర్పరచుకొన్న ఆవాసాల్ని ఆవాసాలనే అనాలి. అవి ఇళ్లు కావు, గుడిశెలు కావు, డేరాలు కూడా కావు. పైకప్పుమీద వెదురుబద్దలూ తాటాకులూ ఎన్ని ఉన్నాయో, చిరిగి వాలికలై ఒకదానితో ఒకటి ముడిపెట్టబడిన చింకిబట్టలూ, ప్లాస్టిక్కు షీటులూ అవి ఎగిరి పోకుండా, విరిగిపోయిన ప్లాస్టిక్‌ బకెట్టు ముక్కలూ కూడా, అన్ని ఉన్నాయి. అందులోకి ప్రవేశించాలంటే వంగి నేల నానుకుని దూరాలసిందే! అక్షరాలా తలదాచుకునేందుకు చేసుకున్న ఏర్పాట్లు.సురభి నిలబడి చూస్తూ ఉండడం ఒక స్త్రీ చూసింది. 

ఘల్లుఘల్లుమని చప్పుడుచేస్తూ రోడ్డుదాటి దగ్గరగా వచ్చింది. సురభి ముఖం లోని ప్రశ్నలకి జవాబుగా చెప్పింది.‘‘రాత్‌కో ఆయా. ధోడా దిన్‌ యహీఁ రహతే. హమ్‌లోగ్‌ పుతుల్‌ బనాతే, అవుర్‌, బిక్రే కర్తే. దేఖో వహాఁ..... ’’ కళ్లతో చూపించింది.సురభి చూసింది, రోడ్డు కవతలవైపున. రకరకాల దశల్లో ఉన్న బొమ్మలు. దాదాపు పూర్తి అయినవీ, ఇంకా మొదట్లోనే ఉన్నవీ, రూపురేఖలు దిద్దుకుంటున్నవీ, కొన్నిమట్టివి, కొన్ని ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేయబడి నవీ... హిందీ నుండి తెలుగులోకి మారిపోయింది ఆ స్త్రీ. ‘‘రాత్రే దిగామమ్మా! ఇంత గంజికాచాను, ఏదైనా కాస్తంత పచ్చడిపెట్టు. నాలిక్కి రాసుకునేందుకు’’ అడిగింది.రాత్రి మిగిలిన బీరకాయపచ్చడి తీసుకొచ్చి, ప్లాస్టిక్‌ కవరు మీద వేసి ఆమెకిచ్చింది సురభి.ఆఫీసుకి బయల్దేరి బయట అడుగుపెట్టిన రాఘవ ముఖం చిట్లించు కున్నాడు. తమ యింటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోని జన సమ్మర్దాన్ని చూసి. అతని ఉద్యోగం మునిసిపల్‌ ఆఫీసులో.మధ్యాహ్నానికల్లా వాళ్లు ఆ రోడ్డు పక్కన పూర్తిగా స్థిర పడ్డారు.సురభి రాఘవ భార్యాభర్తలు. పెళ్ళై ఇరవైఏళ్లు అయినా పిల్లలు పుట్టలేదు. సురభికి చాలాలోటుగా ఉంటుంది. పదిమందిలోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఆ లోటు మరీ బాధ పెడుతుంది. తను పనికిమాలిన దానినన్న భావం మనసులో మెదలుతూ ఉంటుంది. రాఘవకి మాత్రం అటువంటిదేమీ లేదు.