బ్రహ్మలోకంలో సకల జీవులు సమావేశమయ్యాయి.ప్రతి జీవి తరపున ఒక ప్రతినిధిని రప్పించాడు బ్రహ్మ.పిచ్చాపాటి ముగిసే సందర్భంలో లోకసంచారి నారదుడు ఒక సందేహం వెలిబుచ్చాడు.‘‘విధాతా! ఇప్పటిదాకా సకల జీవుల ఉత్తమ గుణాల గురించి తమరు తెల్సుకున్నారు - ఉత్తమ జీవులకు బహుమతులు యిచ్చారు. కాని నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. తమరి సృష్టిలో కెల్లా నీచాతినీచమైన జంతువు ఏదో తెలుసుకోవాలని ఉంది.’’ నారదుడు తంబూర తీసుకుని మీటుతూ అడిగాడు.చిరునవ్వు చిందించాడు దేవేంద్రుడు. ‘‘మహానుభావా! దీంట్లో ఆలోచించాల్సింది ఏముంది! పంది నీచ జంతువు - జంతువుల మలము తిని బతుకుతుంది’’.వెంటనే బృహస్పతి అభ్యంతరం తెలియచేశాడు. ‘‘దేవేంద్రా! వరాహం లేనిచో లోకమంతా గబ్బు పడుతుంది. అది నిస్వార్థంగా మలినాలను శుభ్రం చేస్తున్నది. నా దృష్టిలో వరాహం చాలా గొప్ప జంతువు. దాన్ని ఆదర్శంగా మనం పని చెయ్యాలి!’’శుక్రాచార్యుడు తన ఒంటి కంటితో వ్రాక్కుచ్చాడు గడ్డం నిమురుకుంటూ ‘‘చతుర్వేద పారాయణా! లోక రక్షయణా! నీలకంఠా - నా దృష్టిలో సింహం నీచాతినీచమైన జంతువు. విచక్షణ లేకుండా కనిపించిన జంతువును చంపివేస్తుంది. దాని ఆకలికే అడవి ఖాళీ అయిపోతుంది. అతి క్రూర నీచజంతువు సింహం!’’విధాత సగం నవ్వునవ్వాడు.‘‘శుక్రాచార్యా! నువ్వు వక్రంగా ఆలోచిస్తున్నావు! సింహరాజం ఆకలి తీరింతర్వాత ఏ జంతువును ఉత్తినా వధించదు! రేపు ఆకలి వేయవచ్చు అని ఊహించి ముందుగానే తన ఆహారాన్ని సేకరించు కోదు’’ అని బృహస్పతి అడ్డుపడ్డాడు.ఇలా చర్చ రసవత్తరంగా జరుగుతున్నది.అప్పుడు విశ్వామిత్రుడు లేచి అన్నాడు. 

‘‘పెద్దలకు ఇలా సభాసమయం వృధా చేయడం తగదు. విధాత సృష్టిలో నీచాతినీచమైన సృష్టి మానవుడే! ఇంత చిన్న విషయానికి యింతలా తలకాయలు పట్టుకోవడం సిగ్గుచేటు’’ అని చెప్పాడు.అందరూ నివ్వెరపోయారు. నోట మాటరాలేదు. ముఖ్యంగా బ్రహ్మకున్న నాలుగు శిరస్సులు గిర్రున తిరిగిపోయాయి. రోషం ముంచుకు వచ్చింది. అంతకుముందే మానవుడికి అతను ఉత్తమ సృష్టి అని బహుమతి ప్రదానం చేశాడు వాణి సాక్షిగా.‘‘విశ్వామిత్రా! ఆపు! నువ్వు చెప్పింది సబబుగా లేదు. నీలాగా సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. కృత్రిమంగా మానవుడ్ని తయారు చేస్తున్నాడు. గ్రహాలను గాలిస్తున్నాడు - విజ్ఞానపరంగా ఎంతో ఎదిగిపోయాడు - అటువంటి మానవులను ఆక్షేపించావో - నీకు తగిన శాస్తి జరుగుతుంది’’. బ్రహ్మ విశ్వామిత్రుడితో వాగ్వివాదానికి తలపడ్డాడు.విశ్వామిత్రుడు తన కోపాన్ని తొక్కిపట్టి వ్యంగ్యాస్త్రం అందుకున్నాడు. ‘‘విధాతా! నీరాత సరిగా లేదయ్యా! వయసు మళ్ళిందో ఏమో - మానవుడి నుదిట రాత ఏం రాస్తున్నావో గమనించే వారు లేరు. నువ్వు పాపం వాళ్ళకు తెలివితేటలు యిచ్చావనుకున్నావు - అవిదేనికి వాడుతున్నాడు వాడు? ఎదుటి మనిషిని హింసించడానికి - చంపడానికి వాడుతున్నాడు. నీకు ఉదాహరణ కావా లంటే ఏదేశ చరిత్ర అయినా పరిశీలించు - హిరోషిమా - నాగసాకి బాంబు దాడులేమిటి? - గెరిల్లా యుద్ధాలు ఏంటి? తీవ్రవాదమేంటి? శాంతిదళం ఏమిటి? - పేరు ఏదైనా పనిచేసేది తుపాకీనే - పోయేది ప్రాణమే? ఎవరైనా బాగుంటే ఓర్వలేడు. తనకు లేదు - ఇంకోడికి ఉంది అని ఒకటే ఏడుపు - ఎదుటివాడి సొమ్ము దోచుకునే దాకా నిద్ర పట్టదు. దోచుకున్న వాడిని ‘దొంగ’ అనకుండా ‘వీరుడు’గా గౌరవిస్తారు! ఎంత పెద్దదొంగ అయితే చరిత్రలో అంత గొప్ప వీరుడిగా ఉండి పోతాడు. అలెగ్జాండరు ప్రపంచయాత్ర ఎందుకు జరపాల్సి వచ్చింది? గజనీ మహమ్మద్‌ ఎందుకు 17 సార్లు భారతదేశంపైకి దండయాత్ర జరపాల్సి వచ్చింది?’’ విశ్వామిత్రుడు కమండలం ఎత్తుకుని గటగట నీళ్ళు తాగాడు పెద్దల బుర్రలకు పని కల్పిస్తూ.