నూటికి తొంభై మందికి చాలా ఏళ్లు శాంతంగా గడపాలంటే ..ఎంత నరకంగా ఉన్నా, లేచి పోవటం కన్నా సంసారమే నయం. ఎంత బాధ్యతలు ఉన్నా సంసారంలో స్త్రీకి ఒక స్థానం ఉంది. ఎంత నీచమైన స్థానమైన సరే, దాంట్లోనే ఓ విధమైన రక్షణా, శాంతి ఉన్నాయి. సంఘం, ఇరుగు పొరుగు, బంధువులు కొంతవరకన్నా స్త్రీ వైపు పలుకుతారు. - చలం‘‘చెప్పవే ఏమి చెప్తావో! ఒక్క మాట మాట్లాడకుండా కూర్చున్నావు’’ అక్క అడుగుతూనే ఉంది. బయట పడుతున్న వర్షం వల్ల వచ్చే చల్లగాలికి మనసు, శరీరాలు చల్లపడుతున్నాయి.‘‘ఇలాంటి సంబంధాలు ఎన్ని రోజులు నిలబడతాయో నీకు తెలవదా? ఇందులోకి ఎందుకు దిగావు?’’హమ్మయ్య, అక్రమ సంబంధం అనలేదు. ఎందుకో అలా అంటే మనస్సుకు బాధ అనిపిస్తుంది. ఇష్టంతో, ప్రేమతో, మోహంతో ఒక మనిషిని కోరుకోవటం, అతనితో ఉండాలనుకోవటం అక్రమమా? ఇవేవీ లేకుండా కేవలం భర్త కావటం చేతనే శరీరాన్ని అప్పగించటం సక్రమమా? ఏమో! నేను ఒప్పుకోలేను.‘‘నీ పరిస్థితి చూసి నిన్ను వలవేసి లాగాడు. 

నీ మీద మోజు తీరిన తరువాత నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏమిటి?’’ పసుపురంగు ఛాయలో ఉండే అక్క ముఖం, ముక్కు ఎర్రబడిపోయి ఉన్నాయి.నాకు నవ్వు వచ్చింది. ‘‘బుద్ధి లేదు. అన్నిటికీ నవ్వే’’ అక్క కోపంగా అంది.‘‘అక్కా! నాకు ముప్పయి ఆరేళ్లు. వలవేస్తే పడటానికి నేనేమైనా చిన్న పిల్లనా? నామీద మోజు పోతే అతని కాళ్లా వేళ్లా పడతాననుకున్నావా? అతన్ని నేనెప్పుడూ బంధించను...నా కన్నీళ్లతో గాని, బేలతనంతో గాని’’ చెప్పాను.‘‘నీకు బుద్ధి లేదు’’ అక్కకు ఇంకో మాట రావటం లేదు. నా జీవితం గురించి దిగులు, బాధతో చేష్టలుడిగి గోడకు చేరిగిలబడి పోయింది. బయట వర్షం పడుతూనే ఉంది. అక్క కళ్ళల్లో కూడా వర్షమే. ఎన్నో రోజులు. ఎన్నో సంవత్సరాలు నా మనసుని కమ్ముకుని చీకట్లతో నింపిన దుఃఖపు మేఘాలు కరిగి, కురిసి ప్రవహించి నన్ను స్వచ్ఛంగా నిలిపిన వర్షం.్‌్‌్‌మాది చిన్న పల్లెటూరు. పెద్ద కమతం, చిన్న కమతం అని కాకుండా ఆడ, మగ అందరూ పొలంలో కష్టపడి పని చేసేవాళ్లు. మా తాతలు మా వూరిలో భూస్వాములు. కాని మా నాన్నల కాలం నాటికే ఆస్తులు కరిగిపోయి అప్పులు మిగిలాయి. బాగా చదువుకుని రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం. మా నాయనమ్మకు గయ్యాళి అని పేరు. ఊరులో అందరికీ ఆమెంటే హడల్‌. నాయనమ్మ నల్లగా ... ఏ మాత్రం అందంగా ఉండేది కాదు. కానీ మగవాళ్లతో సమానంగా పనిచేసేది. మా నాయనమ్మకి మరిదితో సంబంధం ఉందనీ, చెల్లెలికి సంచులు పంపేదని అందుకే మా ఆస్తులు కరిగిపోయాయనీ మా పెద్దమ్మ తిట్టుకుంటుండేది. అల్లాంటి సంబంధాల గురించి చాలా చెప్పుకునేవాళ్లు. చాలామంది ఆడవాళ్లు దెయ్యం పట్టింది అని ఏవో మంత్రాలు, తాయత్తులు కట్టించుకునేవాళ్లు. మా చిన్నప్పుడు ఈ దెయ్యం పట్టిన ఆట మేము కూడా ఆడుకునేవాళ్లం.