సుందరానికి బంగారిని చూస్తే పండిన బంగినపల్లి మామిడి పండు గుర్తుకొస్తుంది. నునుపెక్కిన బుగ్గలు, గుండ్రటి భుజాలు.. ఆమె పేరేమిటో తెలీదు. సుందరం మాత్రం ‘బంగారి’ అని పిలుచుకుంటాడు మనసులో. సుందరం భావుకుడు. సౌందర్యాన్వేషి. పైగా భయస్థుడు.ఉదయం వీధి వరండాలో కూర్చుని, ఆనాటి దినపత్రిక చూస్తూ కాలక్షేపం చేస్తాడు సుందరం. ఎనిమిది గంటలవుతుండగా, నెత్తిన పాలబుట్టతో వస్తుంది బంగారి. పక్కవాటాలో ఉన్న వృద్ధ దంపతులకు పాలు పోయడానికి. బంగారి గేటు తీసుకుని పాలబుట్టతో వస్తూంటే, వెన్నెలే మల్లెల వాసనల్ని మోసుకుని వయ్యారంగా నడచి వస్తున్నట్టనిపిస్తుంది సుందరానికి. లేతరంగు చీరల్ని అందంగా నేర్పుగా కట్టే బంగారి క్రిందటి జన్మలో ఏ దేవతో అయి ఉంటుందనుకుంటాడు. పేపరులో తలదూర్చి బంగారి వేపు దొంగచూపులు చూస్తాడు. పాలు పోయడం అయిపోయిన తరువాత కూర్చుని ముసలామెతో మాట్లాడుతూ సుందరం వేపు విలాసంగా చూపులు విసిరి సన్నగా నవ్వుకుంటుంది బంగారి. సుందరం పక్కచూపుల్ని ఏనాడో కనిపెట్టేసింది. అవకాశం చూసుకుని బంగారితో మాటలు కలుపుదామనుకుంటాడు సుందరం. కాని మాట్లాడలేడు. భయం, సంకోచం. చివరికి బంగారే మాట్లాడేసింది ‘నా దగ్గర పాలవాడిక పట్టరాదటండీ’’ అని. మళ్ళీ బంగారే అంది.. ‘ఓసారి నా పాలుపట్టి చూడండి పంతులుగారు’’ మీకు నచ్చకపోవు. చిక్కగుంటయి’ అని పైట చెంగుతో ముఖం మీది చిరుచెమటను తుడుచుకుని, గుండె మీద విసురుకుంటూ ఉంటే ‘‘అమ్మగారితో చెప్తాలే’’ అనేశాడు.చెల్లెలు పెళ్ళికి పదిహేను రోజులు ముందుగా తమ్ముడు తోడు రాగా బస్సెక్కిన శారదను పంపిన నాటి సాయంత్రమే, పక్కింటి తాతగారు, బామ్మగారు అమెరికా నుండొచ్చిన మనవడిని చూచేందుకు విశాఖ బయలు దేరారు. వాళ్ళని స్లీపరు కోచ్‌లో ఎక్కించి వచ్చిన సుందరానికి, వెళ్ళే ముందు భార్య చెప్పిన మాటలు పదేపదే గుర్తుకొచ్చాయి.‘పాల ప్యాకెట్‌ ఒకటే తీసుకోండి. 

రెండు రోజులు ముందుగా పెళ్ళికి వచ్చేయండి’ అని.సమయం ఉదయం 8 గంటలు. ‘‘యాండీ! అమ్మగారూ’’ అనే పిలుపు. ముందు గదిలోకి వెళ్ళాడు సుందరం.ఒయ్యారంగా కుడిచేత్తో ద్వారబంధం పట్టుకుని నిలబడ్డ బంగారి కనిపించింది. ‘గుమ్మం మీద కుడికాలి పాదం పెట్టి శృంగార రసాధి దేవ తలా కనపడింది సుందరానికి. ‘‘ఏటి బాబు మాటాడరు. ఆ ముసలోళ్ళు లేరా?’’ అంది.‘‘ఊళ్ళో లేరు. పదిహేనురోజుల పాటు రారు. నీకు చెప్పలేదా?’’ అన్నాడు.‘‘సెప్పలేదనే కదండి అడుగుతున్నా, తమరేటి బాబూ. గరిటె సేత పట్టినారు. అమ్మగారు గాని ఇంట్లోకి రారేటండి’’ అంది.‘‘అమ్మగారు ఊరెళ్ళారు. పదిహేను రోజులు రారు.‘‘అయ్యో! అయితే తమరే సెయ్యి కాల్చుకోవాలన్న మాట. శాన ఇబ్బందే పోన్లెండి రోజు సేపల కూరో, సేపల పులుసో చేసేసి తెచ్చి ఇత్తాలెండి’’ అంది విలాసంగా కళ్ళు తిప్పుతూ. రెండు చిన్న చేపలు ఈ చివరి నుండి ఆ చివరికి ఈదుకుంటూ పోయినట్టనిపించి ‘‘వద్దు. వద్దు, మీనాక్షి’’ అనేశాడు.