‘‘...మావా, నాకు బంగారు గాజులు చేసుకోవాలనుంది...’’ చివరికి ఎలాగోనోరు తెరిచి మొగుణ్ణి అడిగింది గౌరి.తల వొంచుకొని అన్నం తింటున్న వెంకటేశులు తల పైకెత్తి పెళ్ళాం ముఖంలోకి చూశాడు.గౌరి కళ్ళల్లో ప్రతిబింబిస్తున్న కోరికను చూశాక అతడికి మరి కవణం మింగుడుపడలేదు.పెళ్ళై కాపరానికి వచ్చినప్పటి నుండిఈ ఎనిమిదేళ్ళ కాలంలో -ఏదీ కావాలని అడగని గౌరి, ఈ రోజున అలా అడిగే సరికి అతడికి ఆశ్చర్యం కలిగింది. ప్రత్యేకించి ఇప్పడు అడగడంలో గల-‘అసలు కారణాన్ని’ అతడు సులభంగానే గ్రహించాడు.అప్రయత్నంగా అతడి చూపులు గౌరి కడుపు మీదికి మరలి అక్కడే ఆగిపోయింది.మొగుడు అదేపనిగా తననలా చూస్తుండే సరికి-గౌరికి ఎక్కడలేని సిగ్గూ ముంచుకొచ్చింది.‘‘మ్మే, నీకు గాజులు ఏసుకోవాలనుందా? చేసుకోవాలనుందా?... ఏసుకోవాలనుకుంటే మటుకు నువ్వు మా పెద్దమ్మ నడుగు. లేదనకుండా ఆపాట్నే ఇస్తాది. తీసుకుని ఒక రెండు దినాలు ఏసుకో...’’ చాలా సులభంగా జవాబిచ్చాడు వెంకటేశులు.మొగుణ్ణి కొరకొర చూసింది గౌరి.‘‘ఎప్పడూ వాళ్ళదీ వీళ్ళదీ అరువు తీసుకొనేదే గానీ, మనకని సొంతంగా ఏం ఉండాదీ? ఒక సామానా? ఒక నగనా?... ఇంకన్నా మందీ అని చెప్నేదానికి ఏదన్నా ఉండొద్డా?!...’’ నిష్ఠూరంగానూ, అనునయంగానూ అంది గౌరి.

ఆమె మాటలు అతడి చేతగానితనాన్ని ఎత్తి చూపుతున్నట్టూ, అతడి అసమర్థతను సవాలు చేస్తున్నట్టూ అనిపించి, అతడికి ఎక్కడలేని కోపాన్నీ తెప్పించింది.‘‘మ్మే... నీ మొగుడు గవురుమెంట్‌లో పని చేస్తా ఉండాడు అనుకోనుండావా, ఎట్టా?... ఏదో ఆ బగమంతుడు ఈకాళ్లూ సేతులూ లచ్చనంగా ఇచ్చినాడు గాబట్టి, రొండు పూటలా ఈ కూడన్నా తింటా ఉండాము! లేకపోయుంటే, అడక్కతినే బతుకు అయ్యుండేది మంది? ఈ దినం ఎట్రా దేముడా తెల్లారబోతిందీని, ఓ నేను దిగులుపడి చస్తా ఉంటే దీనికి నగలు కావాలంట నగలు... దాని మూతి సూడండిరా ఎట్టుండాదో...’’ కసురుకున్నాడు గౌరి మొగుడు.మొగుడు అలా కోపంతో అనేసరికి మనసు కష్టపెట్టుకుంది గౌరి. తను మొదటిసారి తల్లిని కాబోతున్న ఈ సమయంతో తన చిరకాల వాంఛను మొగుడు తీరస్తాడనే పిచ్చి నమ్మకంతో దాన్ని బయట పెట్టింది.కానీ, అతడు దాన్ని ఏమాత్రం గ్రహించకుండా అలా తిర స్కారంగా మాట్లాడేసరికి, కళ్ళలో నీళ్ళు తిరిగాయి గౌరికి.‘‘నాక్కూడా కోరికలుండాది...దినాము పనికి పట్నం నడిచిపోయి రావాలంటే కాళ్ళు సచ్చిపోతా ఉండాది! ఒక సైకిలుంటే బాగుణ్ణు అనిపిస్తాది! మరి నేను ఎవుర్నిపోయి అడిగేది?’’ ఉక్రోషంగా అన్నాడు వెంకటేశులు.‘‘ఎవుర్నన్నా నీకెందుకు మ్మే పోపి అడగాల? అడిగితే, గిడిగితే మా అత్తమామల్ని కదా అడగాల....’’‘‘అడుగూ...’’ వెటకారంగా అంది గౌరి.