జయ విజయలకు విసుగ్గా ఉంది. తోసుకుంటూ, తొక్కిసలాటలో పడిపోతూ, కళ్లల్లో ఏవేవో భావాలు చూపిస్తూ, దెబ్బలు తింటూ దేవుని దగ్గరకు వచ్చామన్న సంతోషంలో అదోలా నవ్వుకుంటూ గుమ్మడికాయల్లా దొర్లిపోతున్న జనావళిని నిరంతరం నిర్విరామంగా చూస్తూ నిలబడి వున్న వారిరువురికీ ఏదో బాధగా ఉంది.స్వామికి కాపలాగా ఉన్నవారు వీరు. స్వామి వైపు తిరిగి ఆయన దర్శనం చేసుకోలేరు. స్వామిని చూసే వారిని చూస్తారు. వీళ్ల కష్టాలు చూడటమే తప్ప స్వామిని ఎప్పుడు చూసేది? ఇద్దరికీ ఒకే ఆలోచన ఒకేసారి వచ్చినందుకు ఒకరి మొహాలొకళ్ళు చూస్కున్నారు. వాళ్లకున్న మహిమ చేత మానవ రూపాలు దాల్చి శిలల నుంచి ఇవతలకి వచ్చి స్వామి వైపు తిరిగారు. అంతే! ఇద్దరు మనుషులు వచ్చి గట్టిగా పట్టుకుని తోసుకుంటూ ప్రక్కకి లాగారు.‘ఎక్కడి నుండి వచ్చార్రా మీరు? పదండి! ఏది మీ లైను?’ అంటూ కేకలు వేశారు. లైనులో ఒకళ్లనొకళ్లు కుమ్ముకుంటూ ఆత్రుతతో వెంకన్నను చూసుకుంటూ చిత్రమైన ముఖ కవళికలను ప్రదర్శిస్తూ ఆ కొద్ది సేపట్లోనే ఏవేవో కోరికలను కోరుకుంటూ సాగిపోతున్న జనం ఒక్కసారి ఎందుకనో ఇద్దరి వైపు తిరిగి అరిచారు. ఏమవుతోందో తెలుసుకునే లోపల ఇద్దరూ బంగారు వాకిలికి ఇవతల వచ్చి పడ్డారు. దిక్కు తోచక మరల ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకున్నారు ఏం జరిగిందో తెలిసే లోపల ఇద్దరు కర్రలతో నేలమీద గట్టిగా కొట్టారు. 

‘ఇక్కడ సాష్టాంగ పడకూడదు...’, అరిచారు, ‘లెండి!’ ఇద్దరూ బాధగా లేచి నిలబడ్డారు. ఏంటో గోల గోలగా ఉంది. జనం అదే పనిగా ఎంతో హడావుడిగా వెళ్లి పోతున్నారు. ఇద్దరికీ వింతగా ఉంది. కొద్ది సేపు ఎందుకో గుడిలోంచి ఇవతలకి వచ్చినందుకు సరిక్రొత్త అనుభూతిలోకి వచ్చారు. అనంత కాలంగా అనంతుడిని ధ్యానిస్తూ నిలబడ్డ ఇద్దరికీ పైన ఒక కొద్దిపాటి ఆకాశం కనిపించగానే చిత్రంగా చూస్తూ అడుగులో అడుగు వేస్తున్నారు. ‘ఉచిత ప్రసాదం’ అని వ్రాసి ఉన్నచోట అటూ ఇటూ చూస్తుండగా ఎవరో ‘లైను’ అని అరిచారు. చూసే లోపలే ఎవరో తోశారు. లైన్లోకి వెళ్లి చెరో చిన్నలడ్డూ సంపాదించుకుని ఇవతలకి వచ్చారు. అవి తిని ప్రధాన ద్వారం దగ్గర ఒక్కసారి ఎక్కడున్నామా అనుపకుంటూ వెనక్కి తిరిగారు. ‘రావాలి, నిలబడకండి’ అంటూ రక్షక భటులు అరిచారు. బాబోయ్‌ అనుకుంటూ కొద్దిగా జనం లేని చోటుమీదుగా ఒకరినొకరు కనిపెట్టుకుంటూ మెట్టు ఎక్కి ఆంజనేయస్వామి వారి గుడి దగ్గర నిలబడి స్వామిని దర్శించుకున్నారు. ఒక కుర్రాడు ఫొటోలు అమ్ముతున్నాడు.‘సార్‌, పటాలు, పది రూపాయలు’