బర్రె తప్పిపోయింది. యాదగిరికి తెలిసేటప్పటికి చీకటిపడేవేళయింది. ఎప్పటిలాగే ఉదయం పది గంటలకు నాయక్‌ వచ్చి బర్రెల్ని మైదానానికి తోలుకుపోయాడు. సాయంత్రం ఐదింటికి ఎప్పట్లాగే తిరిగొచ్చాయి. యాదగిరి చేసిన తప్పేంటంటే అవి తిరిగొచ్చిన వెంటనే వాటినన్నిటినీ చూసుకోకపోవడం. యధాలాపంగా వచ్చేస్తాయన్న ధైర్యంతో షెడ్డు శుభ్రం చేసుకుంటూ కూర్చున్నాడు. నీళ్ళ తొట్టెల్లో నీళ్ళు నింపి, మేత తొట్టెల్లో పచ్చగడ్డి మోపుల్ని విప్పి, గోలాల్లో ఉలవలు, చిట్టు, తవుడు వేసి తిరిగొచ్చిన బర్రెల్ని ఒక్కొక్కదాన్నే గుంజలకు కట్టుకుంటూపోతే ఆఖరి గుంజ మిగిలిపోయినపడు యాదగిరి గుండెలు కొట్టుకుంటున్నాయి. ఒక్కసారి అన్నిటి మొహాల్ని పరికించి చూశాడు.మొహం మీద తెల్లని మచ్చ, తోట చివర తెల్లని కుచ్చు, చక్రాల్లాంటి నల్లని కళ్ళతో అందంగా వుండే గౌడు గేదె తప్పిపోయింది.‘ఓరి నాయనోయ్‌. నర్సిరెడ్డికి తెలిస్తే ఇంకేమయినా ఉన్నదా! పూటకు పదిలీటర్ల పాలిచ్చే గేదె తప్పిపోయిందంటే శివాలెత్తుతాడు’.నర్సిరెడ్డికి ఆ బర్రె అంటే చాలా ఇష్టం. పొద్దుట లేవగానే కానుగ పుల్లతో మొహం కడుగుతూ దాని దగ్గరే నిలబడి మెడ రాస్తూ ఉంటాడు. ఆయాలపడే యాదగిరి దాని పొదుగు దగ్గిర బక్కెట్టు పెట్టి పాలుతియ్యాల. పొదుగు కింద బక్కెట్లు మారుతుంటే ఆనందంగా చూసుకునేవాడు నర్సిరెడ్డి. రాత్రిపూట ఎంత పొద్దుపోయినా సరే ఆపక్కకు ఒంటేలుకు పోయేటపడు దాని నుదురుమీద ఆప్యాయంగా చెయ్యేసి ‘‘యూరియా గడ్డేసినావా? ఉలవ పెట్టినావా?’’ అంటూ కుశలాలు అడిగేవాడు. 

జవాబు చెప్పేందుకు ఎపడూ యాదగిరి అక్కడే గడ్డిపక్కమీదుంటాడు.యాదగిరికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు రాలేదు. షెడ్లోంచి బయటకొచ్చి నర్సిరెడ్డి ఇంట్లోకి తొంగి చూశాడు. అర్ధగంటయినా మనిషి జాడలేదు. ఆలస్యం అయినకొద్దీ భయం పెరుగుతోంది. చివరకు లక్క్షమ్మ గుమ్మంలో కనబడింది. ‘‘అమ్మా’’ అంటూ అరిచాడు ఒక్కసారిగా.‘‘ఏందిరా యాది?’’ అంది లక్క్షమ్మ బయటకొచ్చి.చమట్లు కారుకుంటూ చెప్పాడు ‘‘బర్రె తప్పిపోయిందమ్మా’’‘‘ఎట్టా! ఏది?’’‘‘మొగం మీద తెల్లమచ్చది. తోకమీద తెల్లకుచ్చుంటది గదమ్మా.’’‘‘ఒంగోలు నుంచి తోలుకొచ్చినాం. గౌడు బర్రేనా?’’‘‘అదేనమ్మా. మేతకెళ్ళి తిరిగి రాలే’’.‘‘మేతకు తోలుకెళ్ళిన ఆ గాడిద కొడుకుని అడగలా?’’‘‘లేదమ్మా. ఆడెల్లినాక బర్రెల్ని గుంజలకు కట్టేస్తూ చూసినానమ్మా’’.‘‘మరిక్కడే నిలబడ్డావేం! ఆడెక్కడున్నాడో పట్టుకో. పోయెత్తుకురా.’’‘‘పాలు తియ్యాల గదమ్మా’’‘‘పోరా సచ్చినోడా. ఆ పెద్దాయనొచ్చేలోగా తోలుకురా. లేకుంటే నీ తోలు వలుస్తాడు. పాల సంగతి నే చూస్తాలే’’ అంది లక్క్షమ్మ మరింత కంగారుతో.‘‘గట్లానే అమ్మా’’ అంటూ యాదగిరి అడుగు వేశాడు. ఆ ఊర్లో బర్రెల్ని మేపే నాయక్‌ ఊరు చివర తండాలో ఉంటాడు. యాదగిరి ఉరుక్కుంటూ తండా దగ్గరకు వెళ్ళాడు. నాయక్‌ తండా మనుషులతో కల్లు పట్టులో ఉన్నాడు. యాదగిరి రొపతూ నాయక్‌ ముందు నిలబడ్డాడు.