శ్రీ కె.రామేశం,జిల్లా కలెక్టరు, విశాఖపట్నం.‘‘మీరు ఒక లక్షా యాభైవేల రూపాయల మేరకు ప్రభుత్వ ధనాన్ని నిర్దేశించిన విధంగా కాక వేరేవిధంగా వినియోగించి అపచర్యకు పాల్పడినారు. ఇందుకు అంగీకారం తెలుపుతూ మీరు రాజీనామా చేయవలసిందిగా సలహా ఇవ్వడమైనది. మీరు దానికి అంగీకరించనిచో మిమ్ములను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన చర్య తీసుకోబడుతుందని ఇందుమూలముగా తెలియజేయడమైనది’’.ఆర్‌. పరమేశ్వరరావుఛీఫ్‌ సెక్రటరీ,ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.దీనంతటికీ కారణం నెలరోజుల క్రితం జరిగిన ఒక సంఘటన.్‌ ్‌ ్‌సాయంకాలం ఆరు గంటలవుతోంది. నా డఫేదారు పోలిపల్లి కారు ఆగగానే వేగంగా వచ్చి కారు వెనక తలుపు తెరిచి పట్టుకున్నాడు. నేను కారు దిగి కొద్ది సెకండ్లపాటు అక్కడ నిలుచున్నాను. పోలిపల్లి కారు తలుపుని శబ్దం లేకుండా మూసి రెండు చేతులు కట్టుకొని నిలబడి ‘‘ఇదే ఇల్లు సార్‌. నిన్న సూసెల్లావండి. లోనకెళ్ళి ఆర్ని పిలవమంతారా?’’ అని అడిగేడు.నేను ఇంటి లోపలినుండి సన్నగా మ్రోగుతున్న తుంబుర నాదంతోబాటు మృదువుగా వినిపిస్తున్న ఒక రాగం ఆలాపనను శ్రద్ధగా వింటున్నాను. ఈలోపుగా డ్రైవర్‌ సిరాజ్‌ నాకు సమీపంగా వచ్చి నేను వింటున్నదేమిటో గ్రహించి పది సెకండ్లపాటు ఏమీ మాట్లాడకుండా తాను కూడా విన్నాడు. అపడు నాకు మరికొంచెం దగ్గరై అది ‘బిలావల్‌’ రాగం బాబు అన్నాడు.‘‘చాలా నున్నగా వుంది కదా!’’ అన్నాను. ఇటువేపు తిరిగి చూస్తే పోలిపల్లి ‘‘లోనకెళ్ళి కుర్సీ ఎయ్యమంతారా?’’ అన్నాడు.నేను అక్కర్లేదన్నట్టుగా చెయ్యి ఊపి కారుకి చేరబడ్డాను. సిరాజ్‌ నా వీపు కారుకి తాకకముందే తన రుమాలు పెట్టి అక్కడ (దుమ్ము వుందా లేదా అని ఆలోచించకుండానే) శుభ్రం చేశాడు. ‘థాంక్యూ సిరాజ్‌. మేము ఈ రాగాన్ని శంకరాభరణం అంటాము’’ అన్నాను.‘‘ఎస్‌, సార్‌’’రాగం ఆలాపన ఇంటిముందరి గదిలోంచి వినవస్తోంది. కిటికీ తలుపులు పైరెండూ మాత్రం తెరిచి వున్నాయి. 

రెండు నిముషాలపాటు ఆ ఆలాపనను తన్మయంగా విన్నాము. అపడు ఒక ఏడెనిమిదేళ్ల పాప చేతిలో ఒక చిన్న స్టీలు గ్లాసుతో వచ్చి తుర్రుమని నాలుగు మెట్లు ఒక్కదాటులో ఎక్కేసి ముందు తలుపు తోసింది. లోపలికి వెళ్ళి ‘‘అమ్మమ్మగారూ, ఈ గ్లాసుకి తలగోసి పంచదార ఇమ్మందండి, మా అమ్మ’’ అని పలికిన మాటలు ఆ సంగీతాన్ని మింగేసి వెలువడ్డాయి. ఆలాపన సాగుతూనే వుంది.పాపాయి పంచదార గ్లాసు పుచ్చుకుని మెట్లు జాగ్రత్తగా దిగింది. ఒక పెద్దావిడ ద్వారం వరకు వచ్చి మమ్మల్ని చూశారు. కారు తమ ఇంటికేనని ఆమెకు అర్థమైపోయింది. వయస్సుకు తగినంత ఉత్సాహం తెచ్చుకొని మెట్లు దిగి మాకు దగ్గరగా వచ్చి వొళ్ళంతా పైటచెంగుతో కపకొని నమస్కారం చేసింది. ‘‘రండిబాబూ. మావారి పాట వినాలని వచ్చారా! ఎంత ఆనందం’’ అని, మా ప్రమేయం లేకుండానే వెనుకకు తిరిగి మెట్లెక్కి ద్వారం దాటి రెండవ తలుపు కూడా తెరిచి పట్టుకుంది. తల ఎడమవైపుకు తిప్పి నాదం వస్తున్న వైపుగా ఏదో మాట్లాడినట్టు కనపడింది. నాదం ఆగిపోయింది. 65-70 వయసున్న ఒకాయన పంచె కుచ్చిళ్ళు బిగించుకుంటూ ద్వారం వద్దకు వచ్చి ‘‘దయచేయండి. దయచేయండి’’ అన్నాడు.