‘‘గ్రూప్ హౌస్ అనుకుంటాను. కింద ఫ్లాట్‌లో సొంతవాళ్లేనట ఉన్నది. వాళ్ల దగ్గరే తాళాలు ఉన్నాయి. తీసుకుని వస్తాను’’ అంటూ శివరాం బైక్ పార్క్ చేసి వచ్చేలోగా శైలజ వెళ్లి తాళాలు అడిగి తీసుకుంది.సన్నగా ఇరుగ్గా ఉన్నాయి మెట్లు. రెండు మలుపులు తిరిగాక మెట్ల పక్కనే ఉంది తలుపు. తలుపుముందు గడప వారగా చీమల పుట్టలు చూసి శివని ఆపింది శైల. ఆగి కిందకి చూసి ఒక అడుగు వెనక్కి వేసి తాళం తీసాడు శివరాం. తాళం చెవి రెండుసార్లు తిప్పితేనే గాని తెరుచుకోలేదు తలుపు.జాగ్రత్తగా చీమలపుట్ట దాటి లోపలికి అడుగుపెట్టాడు. వెనకే శైలజ ముక్కు మూసుకుంటూ అటూ ఇటూ చూస్తూ లోపల కాలుపెట్టింది. లోపలంతా ఒకటే ముక్క కంపు. ఆమెకు తుమ్ములు ఆగలేదు.
బయటికి వచ్చి కాస్త సద్దుకున్నాక తిరిగి లోపలికి వెళ్లింది.ఇల్లంతా తిరుగుతున్నా ఏదో ఆలోచనలో పడ్డట్టు కనిపించాడు శివరాం. శైలజ అతని భుజంమీద చెయ్యి వేసి కదుపుతూ ‘‘బాబోయ్! శివా! ఏమిటి ఈ ఇల్లు?’’ అంది.ఇంటినిండా, నేల అంతటా అడుగుజాడలు పడేలా దుమ్ము పేరుకుపోయి ఉంది. హాలు పెద్దదే. ఎల్ ఆకారంలో ఉన్న ఖరీదయిన సోఫాసెట్, దానిముందున్న టీపాయ్ కూడా దుమ్ముమయంగా ఉన్నాయి. టీపాయ్ మీద టీవీ రిమోట్, దాని కింద అడ్డదిడ్డంగా రెండు న్యూస్ పేపర్లు, ఎదురుగా గోడకి 42 అంగుళాల ఎల్.సి.డి టెలివిజన్. షోకేసుల నిండా ఏవేవో వస్తువులు పేర్లు చెప్పడానికి సాధ్యం కానివన్నీ ఉన్నాయి.మిగతా కుర్చీలు, దివాను అన్నింటిమీదా దుమ్ము మందమైన పొరగా స్వేచ్ఛగా పరుచుకుని ఉంది.
శివరాం వెనకనే పడకగదిలోకి వెళ్లింది శైలజ. రెండు సింగిల్ మంచాలు దగ్గరికి కలిపి ఉన్నాయి అందరి ఇళ్లల్లోలాగానే. దిళ్లు అడ్డదిడ్డంగా పడేసి ఉన్నాయి. కప్పుకున్న దుప్పట్లు మడత కూడా పెట్టకుండా అలా విప్పి పడేసి ఉన్నాయి.ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్. దానిమీద ఉన్నవన్నీ కూడా ఉదయమే వాడి వదిలినట్టు చెల్లా చెదురుగా ఉన్నాయి. రెండో బెడ్‌రూంలోకి వెళ్లబోతూ ఆగి ఈ పడక గదికి ఆనుకుని ఉన్న స్నానాల గది తలుపు తీసింది శైలజ, శివరాం ‘వ ద్దులే శైలా’ అంటున్నా సరే ‘చూద్దాం ఉండు’ అంటూ.