జనం గుంపులు గుంపులుగా చేనుగట్టు చుట్టూ నిలబడ్నారు. అందరి మొగాల్లోనూ ఏదో ఆత్రుత, ఆందోళన... ఒకటే గుసగుసలు...దాదాపు నలభై ఎకరాల చేను. ఎవరూ లోపలికి దిగడం లేదు. మంత్రగాడు ఎవరో మంత్రాలు చదువుతూ చేనంతా మంత్రించిన నీళ్లు చల్లుతావున్నాడు. నుదుటిపై ఎర్రని పెద్దబొట్టుతో, లావు మీసాలతో, విరబోసుకున్న జుట్టుతో, ఒంటిపై లావు లావు రుద్రాక్షలతో, కాషాయపు అడ్డపంచతో చూడ్డానికి భయంకరంగా ఉన్నాడు. ఆరేడుమంది రైతులు గడాలతో చేను దున్నడానికి సిద్ధంగా వున్నారు.మంత్రగాడు నిమ్మకాయలు కోసి పొలం నాలుగువైపులా విసిరి మొదలుపెట్టమన్నట్లుగా సైగ చేసినాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. గాలి పీలుస్తూ వదుల్తున్న చప్పుడు తప్ప ఏమీ వినబడ్డం లేదు. అందరి కళ్ళూ దున్నుతున్న గడాల వెంటే పరుగెడుతూ గుచ్చి గుచ్చి చూస్తున్నాయి.‘‘నెమ్మదిగా... బాగా లోతుగా... జాగ్రత్తగా దున్నండి. అంగుళం గూడా వదలగూడదు’’ అంటున్నాడు మంత్రగాడు. నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. జనాలు మాత్రం కదలడం లేదు. వూర్లో నుంచి వస్తున్న జనాలు వారికి తోడై ఇంకింతమంది పెరుగుతున్నారు. రెండుగంటలు దాటింది. పొలంలో మూడు భాగాలు దున్నడం పూర్తయింది. అంతలో బైటినుంచి ఒకరు ‘‘‘రేయ్‌... మాదేవగాని గడానికి ఏదో ఎర్రగా తగులుకోనింది సూడు’’ అంటూ గట్టిగా అరిచినాడు. అంతే... జనాలంతా వులిక్కిపడ్నారు. అందరికళ్ళూ ఒక్కసారిగా అటువైపుకు తిరిగినాయి. 

మాదేవ దున్నడమాపేసి భయం భయంగా వణుకుతా పక్కకి జరిగినాడు.మంత్రగాడు అక్కడికి పోయినాడు. ఎర్రగా ఏదో బట్ట. దానిచుట్టూ ఉన్న మట్టి నెమ్మదిగా గెలికినారు. అదో సంచీ. లోపల ఏదో లావుగా. దాని చుట్టూ పసుపూ, కుంకుమ, నిమ్మకాయలు. ‘‘రేయ్‌... మనం గాని తీస్తే రక్తం కక్కుకుని అక్కడికక్కడే సచ్చి శవాలవుతాం. పెట్టినోళ్లే తీయాలి. జాగ్రత్త’’ అంటూ గట్టిగా అరిచినాడు ఒక ముసిలోడు. మంత్రగాడు కూడా అదే మంచిదంటూ వెనక్కి తిరిగినాడు. కొందరిని ఆడ్నే కాపలావుంచి మిగిలినవారంతా పెదరెడ్డి ఇంటివైపు బైలుదేరినారు.ఫఫఫఊలిగమ్మ పెదరెడ్డి ఇంటిముందు ఒక మూలకు లేచే సత్తువ లేక అట్లాగే నేలకు కరుచుకుని పడివుంది. ఆమె మొగం వాచిపోయి వున్నాయి. జుట్టు ముడివీడి వెంట్రుకలు చెల్లాచెదురుగా వున్నాయి. ఏడ్చి ఏడ్చి కళ్లులోపలికి పీక్కు పోయినాయి. బట్టలంతా నలిగి మట్టికొట్టుకు పోయినాయి. దూరంగా కూచున్న పెదరెడ్డి మనుషులు బారాకట్టా ఆడతా ఆమెను మధ్యమధ్యలో గమనిస్తావున్నారు. అంతలో వచ్చి పడ్డారు. అంతవరకు నిశ్శబ్దంగావున్న ఆ ప్రదేశమంతా జనాల అరుపులు, కేకలతో నిండిపోయింది.ఆ చప్పుళ్ళకు పెదరెడ్డి బైటకు వచ్చినాడు. నుదుట విభూది అడ్డంబొట్లతో, పెదవులపై చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఆ చప్పుడుకి ఊలిగమ్మ పడుకునే రెడ్డివంక సూటిగా చూసింది. ఆమె కళ్ళనిండా అసహ్యం, కసి. రెడ్డి ఆమె వంక కొరకొర చూస్తా జనాలవైపు కదిలినాడు. వాళ్లను తోసుకుంటూ మంత్రగాడు ముందుకొచ్చి విషయమంతా వివరించినాడు. పిల్లలూ, పెద్దలూ, ముసలీముతకా, ఆడామగా గుంపులుగుంపులుగా రెడ్డింటిముందు గుమిగూడతా వున్నారు. వూరువూరంతా కోపంతో వూగిపోతావుంది. ‘‘దీన్ని ఇట్లాగే వదిలేస్తే లాభంలేదు. పెదరెడ్డి మీదకే పోయిందంటే రేప్పొద్దున మనలాంటోళ్ళని వదుల్తాదా... కొట్టంలో యేసి కాల్చి పారేయండి. వూరికి పట్టిన శని వదిలిపోతాది’’ ఎవడో తాగి గట్టిగా అరుస్తావున్నాడు.