సందెవేళ ఆకాశంలో రంగులు గబగబ మారుతున్నాయి - పార్టీ మార్చిన రాజకీయ నాయకుడి అభిప్రాయాల్లా.భూషణం కారు భుజంగం ఇంటిముందు ఆగింది.‘‘ఏవయ్యా! ఈమధ్య మరీ నల్లపూసై పోయావు. నీ సినిమా యాపారం ఎలా వుంది? రా! లోపలకు రా!’’ అంటూ సాదరంగా ఆహ్వానించాడు భుజంగం.భుజంగం ఎవరనుకున్నారు? లోకల్‌ పాలిటిక్స్‌లో ‘చాకులు నూరిన యోధుడు’. ప్రస్తుతం ‘అఖిల భారత సైబర్‌ కుటీర సంఘం’ అధ్యక్షుడు. భూషణం విసుగు చెందని చిత్రమార్కుడు. ఏడాదికో సినిమా తీసి, ఎప్పటికీ రాని ‘ఆస్కారు’కోసం ఎదురుచూస్తుంటాడు.‘‘ఈరోజుల్లో సినిమా యాపారం ‘మూడు సోపులు, ఆరు ఫ్లాపుల్లా’ వుంది మావా! అయినా, పాలిటిక్స్‌లో చేరాక నీ పనే బావుంది. కడుపు కదల్చర్లేకుండా కూర్చున్నావు..’’ (ఈ సోఫాలో కూర్చుంటే, భుజంగం బొజ్జ ఆ సోఫాలో వుంటుంది. ఇంకేం కదుల్తాడు చెప్పండి)... ‘‘అసలు, పాలిటిక్స్‌లో చేరాలని నీకెలా బుద్ధిపుట్టిందయ్యా?’’‘‘అడిగావూ? అయినా, ఇదేం పెశ్నయ్యా? మొన్న ఇదే కొశ్చను మా అమ్మాయి ఏసింది. అది కాలేజీలో చదూకుంటోంది, ఏదో ఎర్రి బాగుల్దిలే, అడిగిందనుకున్నాను. ఇదేటిది? రేపో, మాపో పార్లమెంటు కెళ్ళాల్సినోడివి. నువ్వడిగితే నేనేటనుకోవాల? అసలు, నేనోటడుగుతాను, చెప్పొరే. విదేశీయులు కూడా మన ‘కట్టు-తిట్టు’ నేర్చి మన రాజకీయాల్లో దూరిపోయి, పెజాసేవకోసం తహతహలాడుతూ వుంటే, ఇదేటిది, మన చేతిలోని విద్య, మనం ఎలా ఒదిలేసుకుంటాం’’ - అంటూ పెద్ద చుట్ట నోట్లో పెట్టి వెలిగించాడు.‘ఐదే, నువ్వు పెజాసేవ చెయ్యడానికే పాలిటిక్స్‌లోకి దిగానంటావ్‌’’‘‘నువ్వలాగనుకుంటే, ఎమ్మెల్యే కూడా కాకుండానే పెజాసేవ చేసేసిన ఎల్లయ్య కత చెప్తా యిను’’ అంటూ భుజంగం కత మొదలెట్టేశాడు.

‘‘.... ఎల్లయ్యకి పదేళ్ల కిందట ఒక్క సారాయి కొట్టు మాత్రమే వుండేది. ఓసారి ఎలచ్చన్లొచ్చాయి. అపడు ‘జంతర్‌ మంతర్‌’ పార్టీ రూలింగ్‌లోకొస్తాదని అందరికీ తెలుసు. మనవాడెళ్ళి సరాసరి ఆ పార్టీ కాండిడేటు కెదురుగా నామినేసనిచ్చేశాడు. తరవాతేం చేశాడనుకున్నావు? ఆ రాత్రి జంతర్‌ మంతర్‌ పార్టీ వాళ్ళు పెచారానికొస్తారని తెలిసి, మన ఊళ్ళో కనపడినాడికల్లా సారా మంచినీళ్ళలా పట్టించేశాడు. నువ్వు నమ్మవుగానొరే, అంతకుముందు ఎపడూ తాగనోళ్ళు కూడా ఆ ఏళ తాగేశారు. ఆ పార్టీ వోళ్ళు వచ్చి మీ ఓటు మాకెయ్యండన్నారు. అపడీళ్ళంతా మత్తులో వున్నారు. ‘మాకేటి తెల్దు. మా ఎల్లయ్య బాబు ఏం చెప్తే అదే చేస్తాం’ అన్నారు. ఆళ్ళకి గుండె జారిపోనాది. ఎల్లయ్య దగ్గరకు లగెత్తుకెళ్ళారు. ఈళ్ళొత్తారని ఆడికి తెల్సుగదా! ఆడు కొండెక్కేసాడు. ‘నే సస్తే దిగను. నేను పెజాసేవ సేసేయాల’ అన్నాడు. ఇంక ఆలస్యం చేస్తే ప్రమాదమని, ఆళ్ళు బేరంలోకి దిగారు. మనోడు బేరం సెటిల్‌ చేసుకుని, అదుచ్చుకుని తిన్నగా అయిద్రాబాద్‌ ఎళ్ళాడు. ఎళ్ళి, అక్కడేం చేశాడో తెల్సా? సినేమా పత్రికలోళ్ళని, టీవీల వాళ్ళనీ పిల్చి, ‘నేనిపడో బెమ్మాండమైన తెలుగు సినిమా తీస్తాను. అదంతా ఆంధ్రలోనే సూటింగు’ అని చెప్పాడు. ఆ తరవాత, అప్పటిదాకా సినేమా చాన్సు రాక, ఎర్రిమొగాలేసి కూచున్న ఎదవలందర్నీ పోగేసి, ఓ పిచ్చరు నాగేసి, ‘అచ్చోసి ఒదిలాడు’ (సినేమా మూడొంతులయ్యాక డబ్బులైపోతే, అయినంతవరకూ రిలీజు చేసేశాడు). ముందు కొంతమంది చూశారు. అర్ధం కాలేదు. అందుకని మళ్ళీ చూశారు. అర్ధమయినట్టనిపించాక, ఇదేదో ‘ఎరైటీ’ లాగుందని మళ్ళీమళ్ళీ చూశారు. ఆ సినేమా రెండొందల్రోజులాడింది. ఇంక బాగోదని, స్టేట్లో ఒకటి, సెంటర్లో ఒకటి అవార్డులిచ్చారు. ఆస్కారుకు పంపమని మేధావులందరూ చెప్తే ‘ఎందుకొచ్చిన గొడవ’ని వద్దనేశాడు...’’