బయటివాళ్ళు ‘‘రేయ్‌ లోపలికెళ్ళద్దు, దెయ్యాలుంటాయ్‌’’ అని ఆడుకుంటున్న తమ పిల్లల్ని భయపెడ్తుంటే, ‘‘కొడుకా, ఒక్కడివే బయటికెళ్ళబాక, మనుషులుంటారు. గేలి చేస్తారు’’ అని నాలుగేళ్ళ అవిటి కొడుకుని బతిమాలుతుంటాడు, స్మశానంలోనే, సమాధులతోనే ఉంటున్న రుద్రుడు.స్మశానం....వయసైపోయిన అవయవాలేవి బతకడానికి సహకరించక, ఒంటికతుక్కున్న మంచమే ఇంట్లోని అన్ని గదుల్లా మారి, ప్రతి రోజూ చావును గుర్తుచేసే స్వంత మనుషుల కళ్ళల్లోని అసహ్యాన్ని చూడలేక, కనీసం స్వంతంగా చనిపొయ్యే బలం కూడా లేక, ఆనందంగా మరణాన్ని కోరుకుని, మంచాలు, కంచాలు, చాపలతో పాటుగా చుట్టి విసిరేయబడ్డవారినీ, తనలో కంటా పాతేసుకుని, హాయిగా నిద్రపుచ్చి వీరి నుంచి బతికున్న వారినీ...స్మశానం...గడపదాటితే గుర్తుచేసే ఇంటి అవసరాలు, గడపలోకొచ్చినా మర్చిపోలేని అప్పులు తీర్చి ఇంక తీర్చలేక బతికివున్న శవాలుగా ఉండలేక, ప్రశాంతత కోసం నిర్జీవంగా మారి వచ్చిన వారందరినీ జాగ్రత్తగా తనలో దాచుకుని, బతికున్న వారి నుంచి వీరినీ... కాపాడే ఓ పుణ్య రక్షణ స్థలం, స్మశానం. అంతటి గొప్ప స్మశానానికే రక్షకుడు, రుద్రుడు.

 ఇలా ఎన్నో జీవితాలకు చివరి మజిలీగా నిలిచిన ‘స్మశానం’ అనగానే కొంతమంది భయపడతారు. అలాంటి పిరికివాళ్ళను చూసి, ‘ఖచ్చితంగా ప్రతి ఒక్కడూ ఇక్కడకు రావాల్సిందే, పాడె పై నైనా, మోస్తూ కిందనైనా’ అంటుంటాడు రుద్రుడు. రాత్రిపూట, జనాలు ఆ గోడ పక్కగా వెళ్తూ ఏదో తెలియని భయంతో బిక్కచచ్చిపోయేవారు. అలా భయపడేవారిని చూసి నవ్వుకుంటూ ‘మనిషి బతికున్నప్పుడే పక్కవాడిని పీక్కుతింటూ, దెయ్యంలా వుంటాడు. చనిపోయిన ప్రతి ఒక్కడూ ఎవరినీ ఏమీ చెయ్యలేని, ఇంట్లో గోడకు వేలాడే పటంలాంటి దేవుడే’ అనేవాడు రుద్రుడు.రుద్రుడికి ఈ వృత్తి వంశపారంపర్యంగా వచ్చింది కాదు. ఆ విధంగా చావులు మాత్రమే వస్తాయి. వృత్తులు కాదు. కొన్ని వృత్తులైతే ఎప్పుడో పాడెనెక్కేస్తాయి. ఆ విషయాన్ని ఏ మాత్రం గ్రహించని రుద్రుడి తండ్రి సిమ్మాద్రి, నమ్ముకున్న భూమి ఎప్పటికైనా అన్నం పెడుతుంది, అనుకుంటూనే అప్పుల వ్యవసాయం చేసాడు. భూమి విలువ దాన్ని నమ్ముకుంటే కాదు, అమ్ముకుంటేనే అన్న సత్యం, కరువొచ్చి పంటలతో పాటు, ఊరందరి డొక్కలు ఎండిపోయున్నప్పుడు, అప్పులు ఇచ్చిన భూస్వాములు తెలియజేసి, వడ్డీ లెక్కలన్నీ సమతూకం చేసి, సిమ్మాద్రి భూమినీ స్వాధీనం చేసుకున్నారు. ఉన్నవూర్లో, చివరికి పాలెగాడి పనికూడా దొరక్క రుద్రుడు, భార్య లచ్చిమితో కలిసి, తండ్రి సిమ్మాద్రిని వెంట తీసుకుని కట్టుబట్టలతో పొరుగూరికి వచ్చేసాడు. కొడుకు బతకడానికి ఏ ఆధారం ఇవ్వలేదు, ఇంకెలా బతుకుతాడో అన్న దిగులుతో, సిమ్మాద్రి మంచం పట్టినప్పుడు, సునామీ వచ్చి సిమ్మాద్రితో పాటు సగం ఊరిని శవాలుగా మార్చింది. అతివృష్టి, అనావృష్టి, అనావృష్టి రెండింటి అనుభవాలు నేర్చుకున్న రుద్రుడు, వరుసగా రెండు రోజులు, తండ్రి శవంతో పాటుగా మిగిలిన శవాలను పూడ్చి, తగలబెట్టి, వల్లకాడులా మారిన ఊరిలో కాపరి అనుభవం తెచ్చేసుకున్నాడు. తన చావుతో ఈ వృత్తిని అందుకున్న కొడుకుని చూసి, ‘కన్నతల్లి లాంటి భూమిని, నాగలితో దున్నాల్సినోడు, గునపంతో గుచ్చుతున్నాడు’ అనుకుంటూ, సిమ్మాద్రి మట్టిలోపలి నుంచి కూడా ఏడ్చాడు. ఇదంతా గతం. రుద్రుడి కులం, గోత్రం అప్రస్తుతం.