మా పెద్దమ్మ మీకు తెలుసు కదా?అదేనండీ మా బెజవాడ పెద్దమ్మ. ఆవిడ పేరేవిటంటే..ప్చ్‌.. గుర్తురావట్లేదు.. చిన్నాపెద్దా అందరం పెద్దమ్మ అనే అంటాం. నర్సాపురం సుబ్బారాయుడి గారి పెద్దమ్మాయి - సత్యనారాయణ గారి భార్య. ఆయన్ది రైల్వేలో ఉద్యోగం. గుర్తొచ్చిందా?మరీ పొడగరి గాకపోయినా కొంచెం ఎత్తుగా దబ్బపండు రంగులో ఉంటుంది. నుదుటి మధ్య అక్షరాలా రూపాయి బిళ్లంత బొట్టు, కళ్లు నిండిపోవడంతో ఎప్పుడూ ఒలికిపోతూ పోతూ ఉండే ఆప్యాయత, పెదాల మీద వెన్నెలంత చల్లని చక్కని నవ్వు.. ఆవిడ నవ్వు చూసే, బెజవాడ కనకదుర్గమ్మ అంత ఆత్మీయంగా నవ్వడం నేర్చుకునిఉంటుందని చిన్నప్పుడు మేం చెప్పుకునే వాళ్లం.ఆవిణ్ణి ఎప్పుడో ఒకప్పుడు బెజవాడలో చూసేఉంటారు. ఆవిడెవరో తెల్సిందా?మా పెద్దమ్మండీ. మా అమ్మకి అక్క అన్నమాట. ప్రతి వేసవి సెలవుల్లో నేనూ మా చెల్లీ, పిన్నిగారబ్బాయి వేణూ, బుల్లి పిన్నిగారబ్బాయి విశ్వం, అమ్మాయి విజయ అందరం బందరు పాసింజర్‌ రైలెక్కి బెజవాళ్లో వాలిపోయే వాళ్లం.

మేం ఎంత అల్లరి చేసినా విసుక్కునేది కాదు కసురుకునేది కాదు. అసలు పెద్దమ్మకి కోపమంటేనే తెలీదు, మేం ఏం చేసినా మురిసిపోయేది. సున్నుండలు ఎంత కమ్మగా, చంద్రకాంతాలు ఎంత తీయగా చేసేదో చెప్పలేను. ఏది వండినా సరే కొసరి కొసరి తినిపించేది. పాటలు పాడేది. కథలు చెప్పేది.కీలుగుర్రం కథ ఎంత బాగా చెప్పేదంటే ప్రతి ముక్కా నాకిప్పటికీ గుర్తే.కనకదుర్గమ్మ తల్లిని చూస్తే పిల్లలు జడుసుకుంటారని నా చిన్నప్పుడు భయపెట్టేవారు. ఓసారి పెద్దమ్మ మమ్మల్నంద ర్నీ గుడికి తీసుకెళ్లింది.

మాకు అండగా పెద్దమ్మ ఉందనో ఏమో ఆ తల్లి మాకు నవ్వుతూ కన్పించింది. ‘చల్లగా బతకండ్రా’ అని దీవించింది నిజం!కృష్ణ ఒడ్డునే స్నానం చేసి వచ్చేవాళ్లం. లోపలికంటా వెళ్లిపోతామేమోనని మా రెక్క వదిలేది కాదు మా పెద్దమ్మ.సినిమాలు చూశాం. నాటకాలు చూశాం. గాంఽధీ పర్వతం ఎక్కాం. ఎగ్జిబిషన్లో రంగుల రాట్నం మీద తిరిగాం. ఓహ్‌! ఆ రోజుల్ని తలచుకుంటే చాలు మళ్లీ చిన్నపిల్లాడినై పోతాను.హైస్కూల్లో చేరాక బెజవాడ వెళ్లడం రావడంకాస్త తగ్గింది. కానీ పెద్దమ్మ కబుర్లు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేవి.