సురేష్‌ నావరకు ఇప్పటిదాకా ఓ పజిల్‌! అతను అయిదు సంవత్సరాల నుంచి నాకు తెలుసు. మాదో ఎన్‌జీవో. మా ఆర్గనైజేషన్‌లో అతను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నేను ఇందులో చేరక ముందు మూడు సంవత్సరాల నుంచీ అతనున్నాడు.సురేష్‌ నార్త్‌కి చెందినవాడు. అంతకుమించి వివరాలు నాకు తెలియవు. నేను వచ్చిన దగ్గర్నుండి ఇంతవరకు అతను సెలవులు తీసుకోలేదు. ఎవరయినా బతుకుతెరువు కోసం సొంత రాష్ట్రాల నుండి ఎక్కడికైనా వెళ్తుంటారు.

అయితే సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో తమ ప్రాంతం వెళ్ళి తమవారిని, తమఊరిని చూసి వస్తుంటారు.సురేష్‌ ఎందుకని తన ఊరు వెళ్ళడో నాకు అర్థం కాలేదు. ఓసారి అడిగాను, ‘మీ ఊరు చూడా లనిపించదా? అక్కడ మీ బంధువులు లేరా?’ అని. సమాధానం చెప్పటానికి అతను ఇబ్బందిపడ్డాడు.‘చెప్పటం ఇష్టం లేకపోతే వదిలెయ్‌’ అన్నాను.‘నాకు ఎవరూ లేరు సర్‌’ అన్నాడు.సురేష్‌కి ఇప్పుడు ముప్ఫై సంవత్సరాలు. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. తను ఓ గదిలో ఉంటాడు. తెలుగు బాగా నేర్చుకున్నాడు. ఎవరు ఏ పని అడిగినా కాదన కుండా చేస్తాడు. ఎవరి నుంచీ ఏమీ ఆశించడు. అతనికి ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఏదో కోల్పోయినట్లు కనిపిస్తాడు. అది ఏమయి ఉంటుందో నని అనిపిస్తుంటుంది.

ఈమధ్య మా అటెండర్‌ నరసింహం ‘నాకు మీరో చిన్న సహాయం చేసి పెట్టాలి అని అడి గాడు. అతను అప్పుడప్పుడు అడ్వాన్స్‌ కావాలని అడుగుతుంటాడు. అలాంటిదే అనుకున్నాను.నా చెల్లికి పెళ్ళి చేయాలి. మీరు చెబితే సురేష్‌ వింటాడు. మీరు ఎలా అయినా అతన్ని ఈ పెళ్ళికి ఒప్పించాలి’ అన్నాడు.‘సురేష్‌ మన ప్రాంతం వాడు కాదు. అతనికి బంధు వులు ఎవరూ లేరు. అతని గురించి మనకు తెలి సింది చాలా తక్కువ. అలాంటి మనిషికి నీ చెల్లిని ఇస్తావా?’ అన్నాను.‘అతనికి ఎవరూ లేరు కాబట్టి ఇక్కడే ఉంటాడు. మా చెల్లిని ప్రేమగా చూసుకుంటాడు సార్‌’ అన్నాడు.‘అలా ఎందుకనుకుంటున్నావు? సురేష్‌కి అయిన వారు లేకపోవచ్చు. అతను పుట్టిన ఊరుంది. ఎప్పుడైనా సొంతూరి మీదకు గాలి తిరగ వచ్చు. అయినా ఇలాంటివారే డ్రైవర్‌ ఉద్యోగాలకు వస్తారు. వాళ్ళు శాశ్వతంగా ఓ ప్రాంతంలో ఉంటా రని గ్యారెంటీ లేదు. అప్పడేం చేస్తావు? అన్నాను.