అర్థరాత్రి జానకమ్మగారికి నిద్రలో గుండెపోటు వచ్చింది.రెండురోజులుగా కురుస్తోన్న వర్షం....ఎడతెరపి లేకుండా యింకా కురుస్తూనే వుంది. పైగా కరెంటు కూడా పోయింది. వూరంతా చిమ్మచీకటి. కోడలు వసుంధర తన ఛాతీకి అమృతాంజనం రాస్తోంది. అయినా నొప్పితగ్గటంలేదు. రాను రాను ఎక్కువ అవుతూంది. వళ్లంతా చెమట్లు దిగజారుతున్నాయి.ఆమె భర్త కోదండరామయ్యగారు చేతిలో కొవ్వొత్తు పట్టుకొనికంగారుగా యిల్లంతా కలతిరుగుతున్నారు. ఏమీ చేయటానికి ఆయనకి తోచడంలేదు.ఆమెకు తక్షణం వైద్యసహాయం కావాలి. బయటికిపోటానికి వీల్లేదు. వురుములుమెరుపుల్తో వర్షం పడుతూనే వుంది.ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ పన్జేయటంలేదు. వర్షానికి టెలిఫోన్‌ కేబిల్స్‌ పాడైపోయాయి. సెల్‌ఫోన్‌ వుంది కాని ఏం చెయ్యాలి. ఫోన్జేయగానే అంబులెన్సులు వచ్చే వూరుకాదు ఇది. 

ట్యాక్సీలు కూడా దొరకవు.సమయానికి కొడుకు కూడా వూళ్లోలేడు. ఆఫీసు డ్యూటీ మీద క్యాంపుకెళ్లాడు.షెడ్డులో కొడుకు కారు వుంది కానీ ఆయనకు డ్రైవింగ్‌ రాదు; కోడలుకూ రాదు. ఇరుగు పొరుగు వాళ్లెవ్వరికీ కార్లు లేవు. నిస్సహాయ సంకట పరిస్థితి!ఆయన కాలుకాలిన పిల్లిలాగా యిల్లంతా తిరుగుతున్నారు.భర్త పడుతున్న ఆరాటం, కంగారూ చూస్తోంటే అంతబాధలోనూ తనకు ఆయన మీద జాలివేస్తోంది. ఉత్త పిచ్చిమారాజు. కోడలు మంచిదే కన్నకూతురులాగా తనకు సేవ చేస్తోంది. తనకు వాంతి వస్తోందంటే వాష్‌బేషిన్‌ దగ్గరకు తీసికెళ్లింది.కోడలు నోట్లో నాలికలేనిది. కొడుకు ప్రకాష్‌ తన మాటకెదురు చెప్పడు. భర్త సరేసరి! తన నోటికి జడిచి నోరు మెదపడు; అందరి నోళ్లూ తనే పెట్టుకొని యింట్లో చలాయించుకొస్తోంది... ఇప్పుడిలా తనకు ముంచుకొచ్చింది అర్థంతరంగా. ఎప్పుడూ రోగం నొప్పి తెలియనిది.

రాయిలాగా వుండే మనిషి తను.‘‘అమ్మాయి, వసుంధరా! టార్చిలైటు యివ్వమ్మా! ఆటోలు దొరుకుతాయోమో బయటికెళ్లి చూచివస్తాను’’ అన్నారు కో.రా. గారు.‘‘ఈ వర్షంలో చీకట్లో వెళ్లొద్దని చెప్పమ్మా! తెల్లవారాకా చూసుకోవచ్చు!’’ అంది.తన మాట తనకే వినిపించనంత నీర్సంగా మెల్లగా అంది.‘‘ఆమెకు ఏం తెలియదమ్మా! రేపొద్దుటి దాకా వుండే పరిస్థితి కాదు. ముందు నువ్వు లైటివ్వు!’’ అన్నారు.కోడలు లైటు తీసికొచ్చి యిస్తూ, ‘‘రోడ్డు మీద గోతులూ గుంటలూ వుంటాయి. జాగ్రత్తగా వెళ్లండి మామయ్యగారు!’’ అంది.‘‘గొడుగు తీసికెళ్లాండి!’’ తను గొణిగింది.‘‘నువ్వు పడుకోవమ్మా తల్లీ! ఇప్పుడు కూడా నా గొడవే నీకు! అమ్మాయి, అత్తయ్యకు వేడివేడిగా కాసిని పాలు యివ్వు! అవి త్రాగి కాస్త కళ్లుమూసుకొని పడుకో జానకీ!’’ అన్నారు.ఇహ ఎటూ ఒకేసారి కన్ను మూయటం... ఈ నొప్పి తను భరించలేకపోతూంది. సమ్మెట్లతో కొట్టినట్లు వుంది. గుండె బిగపట్టేస్తోంది... ఇక నాపని అయిపోయినట్లేరా దేముడా... అనుకుంది.కోడలు, ‘‘మామయ్యగారూ! ఎవరయినా కారు డ్రైవింగ్‌ వచ్చిన వారు దొరుకుతారేమో చూడటం బెటర్‌!’’ అంది...