ఉదయం ఆరుగంటలవుతోంది. పాలేరు సత్తిగాడు వడివడిగా ప్రెసిడెంట్‌ రామునాయుడు ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు బెంచీలమీద, అరుగుమీద ఓ పది మంది కూర్చున్నారు. ఇంకా ప్రెసిడెంట్‌ బయ టకు రాలేదు. సత్తిగాడు ఇంటి వెనక్కి వచ్చాడు.‘అమ్మగోరూ..అమ్మగోరూ..’’ అని పిలిచాడు.లోపలనుండి నలభై ఐదేళ్ళ అరుణ బయటకి వచ్చింది.పసుపు పచ్చని మేనిఛాయ, నిండైన విగ్రహం, నుదుటన పెద్ద కుంకుమ బొట్టుతో ఆకుపచ్చ జరీ చీరలో అందంగా హుందాగా ఉందామె. తులసి కోటకి పూజ చేసుకోవడానికి పళ్ళెంలో పూజా సామాను పట్టుకొని ఉంది.‘‘ఏమైంది సత్తీ’’ అడిగాందామె తులసి మొక్కకు నీళ్ళు పోస్తూ.‘‘అమ్మగోరూ.. మరే.. మరే.. తాడిబాబు సచ్చి పోయినాడండీ..’’ వగరుస్తూ అన్నాడు.ఒక్కసారిగా ఆమె మొఖంలో కళ తప్పింది. నీరసం ఆవహించినట్లు అక్కడే తులసికోట దగ్గర కూర్చుండిపోయింది.ఇంట్లో నుండి రామునాయుడు బయటకు వస్తూ సత్తిగాడ్ని అడిగాడు.‘‘ఏటైందిరా..’’‘‘తాడిబాబు సచ్చిపోనాడండయ్యా..’’‘‘పోన్లే భూమికి భారం తగ్గింది.

 అవున్రో రోరేయ్‌.. ఆడు సచ్చిపోనాడని మీరంతా పనేగ్గోట్టే స్తారేట్రా.. వరినాట్లున్నాయి. కూలీలని తీసుకెళ్ళి దగ్గరుండి చేయించాలా... వద్దా..’’ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.‘‘అయ్యా! సేసేత్తామయ్యా! ఆడికి ఎనకా.. ముందు ఎవురూ లేరయ్యా. ముందు ఆడ్ని బుగ్గి చేసి పన్లోకి ఎలిపొచ్చేస్తానయ్య’’ చేతులు కట్టు కుని అర్ధించాడు.‘‘అదే అంటున్నాన్రా! పెళ్ళాం, పిల్లలు లేనోడు. ఇంకా ఎడవడానికి ఎవురొస్తారుగానీ, బేగి కాటికి తీసుకెళ్ళిపోండి. ఎనిమిదో గంటకల్లా ఎర్రచెరువు కాడి పెద్దమడి దగ్గర ఉండాలా! తెలిసిందా. ఇంద, కాటి కరుసులకి ‘‘అని జేబులో నుండి రెండొందలు తీసి ఇచ్చాడు.‘‘ఒరే.. సత్తీ.. ఎల్లేముందు సాల శుభ్రంచేసి, పశువులకి కుడితి పెట్టేసి ఎల్లు’’ అని ఇంటి ముందు తనకోసం కూర్చున్న జనం దగ్గరకు వెళ్ళిపోయాడు.బయట అరుగుమీదున్న వాలు కుర్చీలో కూర్చొని జనం చెప్పే గోడు వింటాడు వూరి ప్రెసిడెంటు రామునాయుడు. అందుకే జనం వాళ్ళ గొడవలు, సమస్యలు చెప్పుకోవడానికి రోజు ఉదయమే వస్తారు. ఆ గొడవలు ఎంతవరకు పరిష్కరిస్తాడో తెలియదుగాని ఈ మిషతో వూర్లో వాళ్ళ జాతకాలన్నీ రామునాయుడుకి తెలిసి పోతాయి. ఎక్కడ ఎలా దరువు వెయ్యాలో, ఎప్పుడు ఎవరి ముక్కుపిండి వసూలు చెయాలో బాగా తెలుసు. అతను రాజకీయ పరిణితి ఉన్న వాడు.