మా ఊర్లె మా నాయినను అందరు పెద్ద పంతులు అనేటోల్లు. మా అన్నను చిన్న పంతులు అని నన్ను బుడ్డపంతులు అని బిల్సెటోల్లు. మా అన్న బక్కగుండెటోడు. ఎంత బక్కగ అంటె జోరుగ గాలిగొడ్తె కిందబడేటంత. దొడ్డుగయ్యేతందుకు మా అన్న పప, నెయ్యి ఏస్కోని నాలుగు పూటలు బువ్వ దినేటోడు. ఎంతదిన్నా గాడు దొడ్డుగ్గాలేదు.‘‘ఏజేస్తె దొడ్డుగైత?’’ అని మా అన్న మల్లేశ్‌గాన్ని అడిగిండు.‘‘దినాం కస్రత్‌ జేస్తె దొడ్డుగైతవు’’అని గాడు జెప్పిండు.మా వాడకట్టు అయినంక మంజరి వాడకట్టు ఉన్నది. గా వాడకట్టుల హన్మాన్‌ వ్యాయామశాల ఉన్నది. మా అన్న గాదాంట్ల షరీక్‌ అయ్యిండు. పొద్దుగాల్ల ఐదుగొట్టంగనే లేసి గాడు వ్యాయామశాలకు బోయెటోడు. బిస్కిలు దీసెటోడు. డంబుల్స్‌తోని దండిలు దీసెటోడు.

ఎన్నిజేసినా మా అన్న ఎప్పటి లెక్కనే ఉన్నడు. గిట్లయితే పనిగాదని దినాం గాడు చెర్వుకట్టదాంక ఉర్కబట్టిండి. చెర్ల ఈతగొట్టబట్టిండు. ఒక్క తీర్గ కస్రత్‌ జెయ్యబట్కె దినం పూట గూడ గాన్కి నిద్రరాబట్టింది. ఒకపారి బల్లె నిద్రబోతె పెద్దసార్‌ జూసి బెంచిమీద నిలబెట్టిండు.దొడ్డుగ గానందుకు మా అన్నకు ఫికర్‌దల్గిది. గాడు మాటముచ్చట లేకుంట ఎపడు మొగులు దిక్కు జూస్కుట సోచాయించెటోడు. మా ఊర్లె మసీదు పక్కప్‌టి ఉన్న జానీకి మంత్రాలు వొస్తాయి. ఎవ్వరికన్న దయ్యంబడితె గాని తాన్కి తోల్కబోయెటోల్లు. గాడు మంత్రాలు సద్వి దయ్యంను ఎల్లగొట్టెటోడు. తాయిత్తులు గట్టెటోడు.‘‘జానీ తానిక బోయి దండకు తాయిత్తు గట్టిచ్చుకుంటివా అంటె రెండు నెలలల్ల దొడ్డుగైతవు’’ అని ఎవ్వడో మా అన్నకు జెప్పిండు.గాని మాట మీద బరోస ఉంచి మా అన్న జానీ తాన్కి బోయిండు.‘‘చిన్న పంతులూ ఏంగావాలె?’’ అని జానీ అడిగితె-‘‘నేను దొడ్డుగ్గావాలె’’ అని మా అన్న అన్నడు.‘‘మా లెక్క మటన్‌, చికెన్‌ దింటివా అంటె దొడ్డుగైతవు’’‘‘ముందుగాల్ల దొడ్డుగయ్యేతందుకు తాయిత్తు గట్టు’’జానీ మంత్రాలు సద్వుకుంట ఊదు పొగ ఏసి మా అన్న దండకు తాయిత్తు గట్టిండు.తాయిత్తు గట్టుకున్నంక దినాం మా అన్న అద్దంల సూస్కోబట్టిండు. టేపు దీస్కోని చాతి, దండలు కొల్వబట్టిండు. గని తాయిత్తుతోని గూడ పాయిద లేకుంట బోయింది. మంత్రాలకు చింతకాయలు రాల్తయా? తాయిత్తుకు పెయ్యి బలుస్తదా? ఇగ లాబం లేదనుకోని మా అన్న అనుకున్నడు. సరింగ గపడే మా ఊరికి ఒక సన్నాసి వొచ్చిండు. గాయిన తాన చెట్ల ఏర్లు. అడ్విల దొర్కేటి దుంపగడ్డలుండేటియి. గవ్విటితోని గాయిన రోగాలు తక్వజేసెటోడు.