బెనారస్‌. గంగానది. దశాశ్వమేధ్‌ ఘాట్‌. ఒక వేసవి ఉదయం.పదేళ్లు కూడా నిండని పడవ పిల్లవాడు కింది మెట్ల మీద నుంచుని నన్ను తన పడవలోకి రమ్మని, గంగానది మీద ఒడ్డు పొడవునా తిప్పుతానని బతిమాలుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పెద్ద మనిషి తీరున ధోతి కట్టుకున్నాడు. ఎర్ర గాపంచా తలపాగా చుట్టాడు. వాడి పెద్దపెద్ద కళ్లలో పసి తనంతో పాటు గంగానది అందం మెరుస్తున్నది. ఆ పడవ పిల్లవాని వెనకా ముందూ ఎక్కడా పెద్దమనిషి ఎవరూ ఉన్న జాడలేదు. ఒడ్డున నీళ్లల్లో పడవ ఊగుతున్నది. ఆ పడవా, ఆ గంగానదీ, ఆ బెనారస్‌ ఘాట్‌లు అన్నీ తన ఆటస్థలాలే అన్నట్టుగా ఉంది వాడి మాట తీరు.పురాణాల్లో బాలవీరుడిలా కనిపించాడు. ముందు హిందీలో చెప్పి, నాకు హిందీ అర్థం కాలేదని గ్రహించి ఇంగ్లీషులో ‘‘బోట్‌ రైడ్‌ సార్‌. బోట్‌ రైడ్‌ ఆన్‌ రివర్‌ గేంజస్‌ సార్‌. హాలీ గేంజస్‌ సార్‌ ఓన్లీ ఫైవ్‌ రుపీస్‌ సార్‌’’ అని వేడుకుంటున్నాడు.ఇంత చిన్న కుర్రకుంకా నన్ను గంగానదిలో పడవలో తిప్పేది? ‘‘హెపీ బోట్‌ రైడ్‌ ఆన్‌ రివర్‌ గేంజెస్‌ సార్‌. ఓన్లీ ఫైవ్‌ రుపీస్‌సార్‌’’.వద్దన్నాను, విసుక్కున్నాను. అయినా పడవ పిల్లవాడు నన్ను వదిలిపెట్టలేదు. బెనారస్‌ మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాస్తున్న శ్యామలను స్కూలు దగ్గర విడిచిపెట్టి, గంగానది అందాలను చూడటానికి ఘాట్‌ల వేపు రావటం ఇక్కడ నాకు నిత్య కార్యక్రమమయింది.

 బెనారస్‌ని చూట్టం నాకు అదే మొదటిసారి. అయినా పుట్టుకతో పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఎన్నో పురాణకథలు, ఏకతార మీద మా తాతయ్య పాడిన తత్త్వాలు, మా అమ్మ కట్టుకునే బెనారస్‌ పట్టుచీరలు, కాశీమజిలీ కథలు, బెనారస్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్న నా స్నేహితుల అనుభవాలు అన్నీ కలిసి చిరస్మరణీయ సౌందర్యం మనసులో చల్లగా విచ్చుకుంటున్నది. గంగ ఒడ్డున స్నానఘట్టాల మెట్ల మీద జీవిత విడ్డూరాలను చూస్తూ మణికర్ణిక నించి హరిశ్చంద్ర ఘాట్‌ వరకు తిరుగుతూ, నచ్చిన చోట స్నానంచేసి పరీక్ష ముగిసే సమయానికి స్కూలుకి పోయి శ్యామలను బసకు తీసుకు రావటం, పరీక్ష ఎట్లా రాసిందో కనుక్కోవటం, వంట చేసుకోవటం, భోజనం తర్వాత రెండో రోజు పరీక్షకు చదివించటం - అదీ నా దినచర్య.శ్యామల పరీక్షకు చదువుకుంటూ ఉంటుంది. దక్షిణాది వార్తలు వెతికినా దొరకని ఉత్తరాది వార్తా పత్రికల్లో తలదూర్చుకుని కూర్చుంటాను నేను. మధ్యమధ్య బెనారస్‌ గల్లీల్లో తిరిగి కూర గాయలూ, పెరుగూ, స్వీట్లూ కొనుక్కురావటం.... అట్లా సాగుతున్నది.