గిపడు మా ఊర్లె సిన్మతేటర్లు ఉన్నయి. నేను చిన్నగున్నపడు మా ఊర్లె ఒక్క సిన్మతేటర్‌ గూడ లేకుండె. గపడు మా ఊరికి కరెంటే రాకుంటె ఇగ సిన్మతేటర్లు యాడికెల్లి ఉంటయి? సిన్మలు లేకున్నా చిందుబాగోతాలుండేటియి. వారానికి ఒకపారి ఊర్లె యాడ్నో ఒకతాన బాగోతం ఆడెటోల్లు. మా వాడకట్టు చౌరస్తల శంకరయ్య హోటల్‌ ఉన్నది. గాన్నే బాగోతాలు ఆడెటోల్లు. బాగోతం ఆడకుంటె హరికత లేకుంటె బుర్రకత జెప్పెటోల్లు.బాగోతం ఆడెటోల్లు దినం పూట ఆడీడ కూలిపని జేసి బత్కెటోల్లు. బారత, రామాయనం కతలను ఆల్లు బాగోతం ఆడెటోల్లు. కిరీటాలు, గదలు, బానాలు, బుజకీర్తులు కుద్దు గాల్లే జేసుకునేటోల్లు. బాగోతం ఆడేటి దినాన డపగొట్టుకుంట ఇయ్యాల్ల రాత్రి పదిగొట్టంగ శంకరయ్య హోటల్‌ కాడ బాగోతం ఉన్నది అని సాటిచ్చెటోల్లు. బాగోతం ఆడెతందుకు పెద్ద చెక్కబల్లలు ఏసి ఒక దిక్కు తెల్లటి పర్ద గట్టెటోల్లు. పిట్రమాక్సు లైట్లు బెట్టెటోల్లు. పోరగాల్లకు బాగోతంల వొచ్చేటి లత్కోర్‌గాడంటె శానిస్టం. గాడు తమాస మాటలు జెప్పి నవ్విపిచ్చెటోడు. కొందరు లత్కోర్‌గాడొస్తె లేపు అనుకుంట పండుకునేటోల్లు. బాగోతం ఉన్న దినాలల్ల ఆడోల్లు సకినాలు, చేబిల్లలు, ముర్కులు జేసెటోల్లు. గవ్వి దినుకుంట బాగోతం జూసెటోల్లు. నిద్రగాసెతందుకు కొంతమంది సుట్టలు, బీడీలు, సిగలేట్లు దాగెటోల్లు. బాగతమన్నపడు మా వాడకట్టంత మేల్కతోని ఉండేది.

ఒకపారి మా వాడకట్టుల పారిజాతాపహరణం బాగోతం ఆడ్తున్నరు. కిష్నుడు, రుక్మినికి పారిజాతం పువ్వు ఇచ్చిండు. గీ సంగతి ఎర్కకాంగనే సత్యబామ అల్గిబన్నది. గామెను బుద్గరిచ్చెతందుకు కిష్నుడు బోయిండు.‘‘ఎందుకల్గినవె సత్యబావా? లేదా నామీద ప్రేమా? ఏడేడు లోకాల ఏమి గావాలన్న దెచ్చి ఇస్త నీకు బామా’’ అని పాడుకుంట ఒక్కతీర్గ బత్మిలాడిండు.కిష్నుడు ఎంతగనం బత్మిలాడినా సత్యబామ లెవ్వలేదు. గిట్లగాదని సత్యబామ కాల్ల మీద కిష్నుడు తల్కాయ ఉంచిండు. సత్యబామ పెక్కున తన్నింది. కిష్నుడు ఎల్లెంకల బడ్డడు. గాని మూతి ఆసింది. కిష్నుడు, సత్యబామ ఏసం గట్టినోల్లు పాలోల్లు. ఎప్పటిసందో గాల్లిద్దరి నడ్మ జాగ పంచాతి నడుస్తున్నది.