పెళ్ళైన యువతి పెళ్ళికాని బావతో ప్రతిరోజూ కొన్ని గంటలు ఏకాంతంగా గడిపితే చిత్రం కాకపోవచ్చు. అందుకామె భర్త అభ్యంతరపెట్టకపోతే అదీ చిత్రం కాకపోవచ్చు. కానీ నేనీ వ్యవహారంలోంచి జీవితాదర్శాన్ని గ్రహించడముందే- అది మాత్రం చిత్రమే!నా నెలజీతం యాబైవేలు. ముప్పై ఐదు లక్షలు విలువచేసే నా ఐదుగదుల అపార్టుమెంట్లో ఉండేది పాతికేళ్ల నేను, ఇరవై రెండేళ్ళ నా భార్య ఊర్మిళ.బేగంపేటలో ‘లైఫ్‌స్టైల్‌’కి దగ్గర్లో ఉన్న మా ఇంట్లో ఎపడు కుళాయి తిప్పినా మునిసిపల్‌ వాటర్‌. ఎపడు స్విచ్‌ ఆన్‌ చేసినా నేనున్నానహో అనే కరెంట్‌. అడుగు బయటపెడితే చాలు, దర్శనమిచ్చే రకరకాల దుకాణాలూ, హోటళ్ళూ. అడుగు బయటపెట్టక్కర్లేకుండా గ్యారేజిలో ఓ శాంత్రో. నన్నూ నాభార్యనీ నా ఉద్యోగాన్ని మా ఇంటినీ కలిపిచూసిన వాళ్ళంతా నన్ను అదృష్టవంతుడంటారు. ‘భావి’ అనబడే మా బిల్డింగులో నా వయసు అదృష్టవంతులు మరో ఐదుగురున్నారు. ఇంకా ఎక్కువమంది ఉందామన్నా- మరి మా ‘భావి’లో ఉన్నవి ఆరే అపార్టుమెంట్సు.ఆర్నెల్లక్రితం బిల్డర్‌ మా అందరికీ ఒకేసారి ఇళ్ళు అప్పజెప్పినపడు ఒకరికొకరు తెలిసి- పొరుగు మహచక్కదని మహదానందపడ్డాం.

ఇళ్ళు బాగా కట్టాడని బిల్డర్ని పొగిడితే, ‘‘అర్హతకు తగిన గౌరవాన్ని కాదనకూడదు.’’ అంటూ బిల్డర్‌ మా పొగడ్తలను నిర్మొహమాటంగా స్వీకరించి, ‘‘చాలామంది బిల్డర్సు ఇళ్ళు కట్టడంతో తమ పని అయిపోయిందనుకుంటారు. కానీ మీకు డబ్బున్నా, నా అనుభవం లేదు. చదువున్నా, నా లోకజ్ఞానం లేదు. ఉద్యోగమున్నా, నా స్వేచ్ఛ లేదు. అదృష్టమున్నా నా పలుకుబడి లేదు. అందుకని ఇళ్ళప్పగించేసినా కూడా మీకు నేను సాయపడుతూనే ఉంటాను.’’ అంటూ మమ్మల్ని కొంత చిన్నబుచ్చి- కొంత పరబిల్డర్‌ నింద చేసాడు. ఆ తర్వాత కిమ్మనకుండా తన మాటలు వింటున్నామనేమో, ‘‘మీరో అసోసియేషన్‌ ప్రారంభించండి. మీ లీడరు ద్వారా మీ సమస్యలు తెలియజేస్తే నేను పరిష్కారాలు చెబుతూంటాను.’’ అని ఓ సలహాను హామీలా ఇచ్చి వెళ్ళిపోయాడు.అలా శివ మాకు లీడరై- ఆ వెంటనే ‘భావి’ భామలకు- ఒంటరితనమొక పెద్ద సమస్యని గుర్తించాడు. మేమంతా వెళ్ళేది తలో కంపెనీకే అయినా- అంతా ఉదయం ఏడున్నరకల్లా ఇల్లు వదిలి- మళ్ళీ రాత్రి ఎనిమిదింటికి ఇల్లు చేరతాం. అంతసేపూ అందం, వయసు ఉన్న ‘భావి’ భామలకు ఒంటరితనం. నా విషయమే తీసుకుంటే- ఆఫీసునుంచి అలసి వచ్చిన నాకూ, ఒంటరితనంతో విసిగిపోయిన ఊర్మిళకూ పొంతన కుదరక ఇద్దరిలోనూ అసహనం, దాన్నించి పుట్టుకొచ్చి అసంతృప్తీ మోతాదు మించిపోయాయి. కొత్త మోజూ, కొత్త కాపురమే ఇలా ఉంటే మున్ముందు సంగతేమిటని భయమేసింది నాకు.