సుప్రభాత వేళ ఇంట్లో గంటలు మ్రోగించి ధూప దీప హారతులు ఇచ్చే బామ్మ ఇంకా నిద్ర లేవలేదంటే...మొట్టమొదట షాక్‌కి గురి అయింది అనిత. ఆమె బామ్మగారి మొదటి కూతురికి రెండవ సంతానం. గాబరాగా బామ్మ రూమ్‌లోకి పరుగు తీసింది. బామ్మ నిద్రపోతోంది అనుకుంది. ‘‘బామ్మా! బామ్మా!’’ అని పిలిచింది. ఉలుకు లేదు. పలుకు లేదు. మంచం దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకుని కదిపి మరీ ‘‘బామ్మా! బామ్మా!’’ అని పిలిచింది.సమాధానం లేదు!అనిత గాబరా పడింది. పరుగున వెళ్ళి తల్లికి చెప్పింది. తల్లి రాజేశ్వరి చేస్తున్న పనిని ఆపేసి, వంటింట్లోంచి పరుగు తీసింది. వీళ్ళ ఆదుర్దా, ఆందోళన చూసి రాజేశ్వరి భర్త శ్రీధర్‌ తన రూమ్‌లోంచి బామ్మగారి రూమ్‌ వైపుకు వెళ్ళాడు.అందరూ ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా పిలిచి, అన్ని ప్రయత్నాలు చేసి చివరికి 108ని పిలిచారు.రకరకాల వింత శబ్దాలు చేసుకుంటూ 108 అంబులెన్స్‌ వచ్చింది!

బామ్మగారికి రకరకాల పరీక్షలు నిర్వహించిన తరువాత హృద్రోగ నిపుణుడు, ప్రముఖ వైద్యుడు డా.అబ్దుల్లా చాలా ప్రశాంతంగా చెప్పాడు‘‘ఆమెకు ఏం ఫరవాలేదు. ఏం భయపడనవసరం లేదు’’ అని.‘‘హమ్మయ్యా!’’ అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంది అనిత.‘‘భగవంతుడా నా తల్లిని రక్షించావు. చేసింది వృధా పోతుందా?’’ అని రెండు చేతులు జోడించి రిసెప్షన్‌లో ఒక మూల కనిపిస్తున్న సాయిబాబా ఫోటోకు దండం పెట్టుకుంది రాజేశ్వరి.శ్రీధర్‌కు ఒక్కసారి మొత్తం ఆందోళన తగ్గినట్లయింది.‘‘డాక్టరు గారూ! అయితే ఆవిడను ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చా?’’ అని అడిగాడు.‘‘లేదు. ఒక రోజంతా అబ్జర్వేషన్‌లో ఉంచుదాం. ఆ తరువాత పంపిస్తాను’’ అన్నాడు డాక్టరు అబ్దుల్లా.‘‘అలాగే డాక్టరు గారూ! అలాగే చేయండి. మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి’’ అంది రాజేశ్వరి.

‘‘ఇప్పుడు మేం ఆమెను చూడవచ్చా?’’ ఇంటెన్సివ్‌ కేర్‌లో అద్దాల్లోపల కన్పిస్తున్న బామ్మను చూస్తూ అడిగింది అనిత.‘‘తప్పకుండా చూడవచ్చును. ఒకరి తరువాత ఒకరు’’బామ్మ నిద్రపోతోంది.రాజేశ్వరి నెమ్మదిగా అద్దాల గ్లాసు తలుపును తోసుకుంటూ లోపలికి వెళ్ళింది.‘‘అమ్మా! అని నెమ్మదిగా పిలిచింది.సమాధానం లేదు. మళ్ళీ పిలిచింది. సమాధానం లేదు. కథ మళ్ళీ మొదటకు వచ్చింది! ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు...గదిలోంచి బయటకు వచ్చేసి డాక్టరుని పిలవాలని అనుకుంది. వెళ్ళి తలుపు తీసి బయటకు వెళ్ళబోతుండగా