మసీదులో అజా వినబడకముందే ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లోనివారిని నిద్రలేపుతుంది రాజయ్య సన్నాయి. సూర్యుడు రుతువులను బట్టి కొంచెం ఎనకాముందుగా ఉదయిస్తాడేమోగానీ రాజయ్య సన్నాయిమాత్రం ఏ కాలంలోనైనా ఠంచన్‌గా తెల్లవారుజామున మోగాల్సిందే!రాత్రంతా నిద్రపట్టక తెల్లవారుజామున కునుకుతీసే ముసలీముతకలకు అదో తలనొప్పి వ్యవహారం. వేకువనే పనీ పాట్లుకెళ్ళేవాళ్ళకి, బడికెళ్ళి చదువుకునే బుడ్డోళ్ళకి మాత్రం రాజయ్య సన్నాయే అలారం గడియారం.‘‘మసీదులో సాయిబు కూతెయ్యకముందే లేసి మా నిద్దర్లెందుకు పాడు సేత్తావురా రాజయ్యా?’’ అని రాజయ్య ఈడువాళ్ళు నిష్ఠూరాలాడేవాళ్ళు.‘‘నేను సన్నాయి వాయిస్తేగానీ మసీదులో అల్లాగానీ, గుళ్లో రాములోరు గానీ నిద్దరలేవర్రా’’ అనేవాడు రాజయ్య ముసిముసిగా నవ్వుతూ.‘‘ఈ వయసులో ఎందుకయ్యా అంతయాష్ట? చదివి బడిపిల్లల్లా పరీచ్చలు రాయాల్నా? పనిపాట కెల్లి గాదెలు నింపాల్నా’’ అనేది రాజయ్య భార్య సత్తెమ్మ.

‘‘ఇది సాధనచెయ్యందే సాధ్యపడే విద్యకాదే పిచ్చిమొగమా! ఒకరోజుగానీ సాధన చెయ్యకపోతే నా సంగీతంలో తప్పులు నాకే తెల్సిపోతాయి. రెండ్రోజులు చెయ్యకపోతే పక్కవాద్యగాళ్ళు పసిగట్టేస్తారు. ఇంకా మూడోరోజుగానీ సాధన చెయ్యకుండా కచేరీలో కూర్చున్నామా, జనం ఇట్టే పట్టేస్తారే!’’ అనేవాడు రాజయ్య నవ్వుతూ.పోయిన కృష్ణా పుష్కరాల్లో ఊపిరి సలపనన్ని ప్రోగ్రాములు చేశాడు. బందరునుంచి బెజవాడదాకా నిండా ప్రోగ్రాములే. ఆ తర్వాత ఖాళీ. ఈ ఏడాదే మళ్ళీ కృష్ణమ్మకి పుష్కరాలంటున్నారు. ఈ పుష్కరకాలంలో పెద్దప్రోగ్రాములేవీ తగల్లా. అయినాసరే ఏ రోజూ సంగీత సాధన ఆపింది లేదు. ఈ మధ్యకాలంలో భజంత్రీలకు జనాదరణ బాగా తగ్గింది.

మళ్ళీ పాతవైభోగం వస్తుందనీ, తను పోయేలోగా ఈ విద్య ఎవరికన్నా నేర్పాలనేదే రాజయ్య ఆశ!పెళ్ళి మండపం రంగురంగుల కరెంటు బల్బులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అందమైన అమ్మాయిలు పట్టులంగా ఓణీలు కట్టుకుని, బంగారు వడ్డాణాలు పెట్టుకుని పెళ్ళి మండపంలో సందడి చేస్తున్నారు. ఒంటినిండా బంగారు, డైమండ్‌ నగలు ధరించి ఖరీదైన పట్టుచీరలు కట్టుకున్న స్త్రీలు తమ వైభవం చూడండంటూ ధగధగ మెరిసిపోతున్నారు. సూట్లు, బూట్లు వేసుకున్న దర్జా బాబులు ధీమాగావచ్చి ముందువరసలో ఖరీదైన సోఫాల్లో కూర్చుంటున్నారు. కుర్రకారంతా ఉత్తరదేశపు వస్త్రధారణతో అటూఇటూ తిరుగుతూ హడావిడి చేస్తున్నారు.