తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం - కాదు, మన్మధ ముహూర్తంలో, బెడ్‌రూమ్‌లో కాలం స్తంభించిపోయింది - భార్యాభర్తలైన రాంబాబు, జయ ఏకశరీరులై, శృంగార సామ్రాజ్యాన్ని ఏలుతున్న వేళ - సంపూర్ణమైన, సంతృప్తితో, రాసక్రీడ ముగిసింది. రాంబాబు ప్రణయ శిఖరాన్ని అధిరోహించిన విజయగర్వంతో ఉండగా, భార్య జయ తాననుకొన్నది సాధించడానికి, ఇదే సమయమని నిశ్చయించుకొంది.‘‘ఏమండీ...’’ అని గోముగా పిలిచి, ‘‘ఊ’’ అన్నాక, ‘‘నేనిపడు మీకు సైన్సు నేర్పాలి’’ అంది.తను ‘ఎమ్మెస్సీ జెనెటిక్సు’ చేసిందని తెలుసు గనుక సమయోచితంగా భార్య ఏవో మధురమైన విషయాలు చెప్తుందని ఆశించాడు రాంబాబు. కాని అలాంటి ఆశల మీద నీళ్ళు జల్లుతూ, ‘‘నేనిపడు చెప్పబోయేది, రాత్రి జరిగిన సంవాదానికి కొనసాగింపే! నా చెల్లెలు విజయ యొక్క దాంపత్యాన్ని బాగుచేయడానికి మనం చేయాల్సిన ‘ఉపవాసవ్రతం’ యొక్క అవసరాన్ని బలపరిచే అదనపు సమాచారమే’’ అని బాంబు పేల్చింది, తెలుగు టీవీ సీరియల్‌ భాషలో.‘‘మైగాడ్‌! నా ముద్దుల పెళ్ళాం, తన పిచ్చి ఆలోచనలు ఇంకా మానుకోలేదన్నమాట - నన్ను ఒప్పించడానికే మళ్ళీ ప్రయ త్నం మొదలుపెట్టిందన్నమాట’’ అని మనసులోనే వాపోయాడు.

 గతరాత్రి ఇద్దరి మధ్యన జరిగిన సంవాదమో, వివాదమో, ఏమి టో తెలుసుకోవాలంటే, కొన్ని గంటలు వెనక్కి వెళ్ళాలి.రాత్రి పదకొండు గంటల వరకు జయ టీవీ వీక్షణం సాగించి, అసహనంగా బెడ్‌రూమ్‌లో పడుకొని ఎదురుచూస్తున్న రాంబాబు పక్కలోకి చేరింది - మరుక్షణమే మరులుగొల్పేలా అతన్ని మెత్తగా హత్తుకొంటూ ‘‘ఏమండీ - మీరు నాకో చిన్న సాయం చేయాలి’’ అని గారాలు పోయింది. మెత్తదనాన్ని ఆస్వాదిస్తున్న మైకంలో, ‘‘మీరజాల గలనా, నీ ఆనతిని’’ అని రాగం తీశాడు. అంతలోనే ఏదో అనుమానం వచ్చి ‘‘అసలేంటి కథ’’ అని అడిగాడు.‘‘రేపు మా చెల్లెలు విజయ వస్తోంది మనింటికి’’ మెల్లగా చెప్పింది.రాంబాబుకి విజయ తెలుసు - తన భార్య ‘జయ’, ‘విజయ’లు కవల పిల్లలు - ఇద్దరిలో కొన్ని నిమిషాల పెద్దదైన జయతో రాంబాబు పెళ్ళయిన ముహూర్తంలోనే, చిన్నది విజయకు సోంబాబుతో పెళ్ళయింది - పెళ్ళిలో మాత్రమే, విజయను రాంబాబు చూశాడు.‘అరే! ముమ్మూర్తులా నా పెళ్ళాంలానే ఉందే’ అని ఆశ్చర్యపోయి, వెంటనే ‘ఎపడైనా తారమారయ్యే ప్రమాదం, ప్రమోదం ఉందిరా, నాయనోయ్‌’ - అని కొంటెగా మనసులోనే అనుకున్నాడు. కాని, అటువంటి ప్రమాదానికే అవకాశం లేకుండా, ఇరు జంటలు పెళ్ళయిన రాత్రే వేర్వేరు ప్రాంతాల్లోని, ‘అత్తవారిళ్ళ’కు సాగనంపబడ్డారు. కాబట్టి రాంబాబుకి మరదలు విజయని, బాగా చూడ్డానికి గాని, మాట్లాడటానికి గాని, తన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి గాని, అవకాశం సంభవించలేదు.