‘‘నేను వాళ్ళకేం అన్యాయం చేశాను’’ అని ఏడ్చింది అవని.అవని నా బాల్యస్నేహితురాలు.వాళ్ళాయనా, మా వారూ ఉద్యోగరీత్యా ఈ నగరంలోనే ఉండటం వల్ల మా స్నేహం కొనసాగింది. అయితే, తరచు కలుసుకోవడానికి వీలు కుదరనంత దూరంలో ఉన్నాం. మొదట్లో తరచు కలుసుకోగలిగినా, ఇప్పుడు బస్సుల్లో ప్రయాణం చేసేటంత ఓపికా లేదు. ఆటోలో ప్రయాణం చేసేటంత అత్యవసర పరిస్థితులూ లేవు. రిటైరైన కొత్తలో బాగానే గడిచింది. కొంతకాలం దేనికీ లోటు లేకుండా. అయితే, బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పడి పోయిన దగ్గర నుంచీ ఖర్చులకి కొంచెం ముందు వెనకలు చూసుకోవలసి వస్తోంది. అనవసరపు భేషజాలకి పోకుండా, ప్రతి విషయంలోనూ, జాగ్రత్త పడవలసి వస్తోంది. ఫోన్‌లో మాట్లాడుకోవడం మానట్లేదు మేమిద్దరం. 

అదొక్కటే కదా మనసు విప్పి మాట్లాడుకునే మార్గం మిగిలింది!అవని ఇప్పుడు బాధపడుతున్నది కూతురు అల్లుడూ ప్రదర్శిస్తున్న ధోరణి గురించి. అల్లుడి సంగతి మొదటి నుంచీ తెలిసినా, ఇప్పుడు మరింత బాధపడుతోంది.అవని భర్త రాజారావుకి పక్షవాతపు లక్షణాలు వచ్చి, తగ్గి రెండు నెలలు దాటాయి. ఇప్పుడు బాగానే తన పనులు తను చేసుకుంటున్నాడు. కానీ ఇదివరకులా చురుకుగా వెళ్ళి పనులు చేసుకోలేక పోతున్నాడు. ఇంట్లో పనులూ, బయటి పనులూ అన్నీ అవని స్వయంగా చూసుకుంటోంది. అవస్థ పడుతోంది.అవనికి ఒక్కర్తే కూతురు కుసుమ. అపురూపంగా పెంచి పెద్దచేశారు. గ్రాడ్యుయేషన్‌ అయ్యాక, బాగా పెద్దచదువు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడికిచ్చి పెళ్ళి చేశారు. మాధవ రావుకి తల్లి ఉంది. తండ్రి మాధవరావు పైచదువు చదువుకుంటున్న రోజుల్లోనే పోయాడు. అతనికి ఇద్దరు అన్నలూ, ఒక అక్కా ఉన్నారు. తల్లికి అతను ఆఖరి కొడుకు కావడం వల్ల, బాగా గారాబంగా పెంచడం వల్లా అతనికి తల్లి దగ్గర చేరిక ఎక్కువ. తల్లి పెద్దకొడుకుల దగ్గర కన్న తన దగ్గరే ఎక్కువగా ఉండాలని కోరుకునే వాడు.

ఆవిడకి అంతకన్న ఏం కావాలి!అవని కూతురికి పెళ్ళిచేసిన కొత్తలో అల్లుడితో ఎంతో ఆత్మీయంగా మాట్లాడింది - ‘‘బాబూ, మాధవ్‌ మాకు అల్లుడివైనా, కొడుకువైనా నువ్వే. నాకు కొడుకు లేని లోటు తీరినట్లుగా ఉంది నిన్ను చూస్తే’’ అని. అతను వచ్చినప్పుడల్లా అతన్ని అడిగి, అతనికిష్టమైన వంటలూ, పిండి వంటలూ చేసి పెట్టేది. అయినా అతను అంటీ ముట్టనట్లు ఉండేవాడు. అతన్ని తన ఆత్మీయతతో ముంచెత్తడానికి అవని ప్రయత్నించేది ఎంతో ఆపేక్ష కురిపిస్తూ ‘‘కొడుకు కొడుకు అంటూ మీ అమ్మ నన్ను తన కొంగుకి కట్టేసుకోవాలనుకుంటోందా?’’ అన్నాడుట పెళ్ళాం దగ్గర. కుసుమ ఆ మాటల్ని తల్లిదగ్గర అనేసింది. ఆ సంగతి నాతో చెప్పి అవని ఏడ్చినప్పుడు.