సన్నగా మొదలైన చినుకులు పెద్ద వర్షంగా మారిపోయేయి. వర్షం ఏటవాలుగా, ఉధృతంగా పడుతోంది. ఉన్నట్టుండి కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు! చెవులు హోరెత్తి పోయేలా ఉరుములు! కిటికీ తలుపులు టపటప కొట్టుకుంటున్నాయి. అంజలి ఆతృతగా వీధి వైపు మాటిమాటికి చూస్తూన్నది.అర్ధరాత్రి వీధిలో రిక్షా ఆగిన చప్పుడుకి తల్లీ కూతుళ్లిద్దరూ ఆతృతగా కిటికీలోంచి చూసేరు. రిక్షా దిగి అంత వర్షంలోనూ తూలుతూ నడిచి వస్తున్న వ్యక్తిని పోల్చి గబగబా వీధి తలుపుతీసి మెట్లు దిగి ఇద్దరూ చెరొక వైపు సాయంపట్టి అతన్ని లోపలికి తీసుకు వచ్చేరు. అంజలికి లోలోపల భయంగా వుంది. ఇరుగు-పొరుగు ఎవరైనా చూస్తున్నారేమోనని!అంతటా నిశ్శబ్దంగా వుంది. వాన శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు. అందరిళ్ళల్లో అప్పటికీ లైట్లార్పేసి వున్నాయి. తమని ఎవరూ చూడ్డం లేదని గమనించి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అంజలి.విశాలాక్షికి దుఃఖం ముంచుకొస్తోంది.‘‘ఏమిటండీ ఇది?’’ అందామె ఏడుపు గొంతుతో‘‘ఎప్పుడూ ఉన్నదేగా అమ్మా!’’ అంది అంజలి నిర్లిప్తంగా.మంచం మీద అస్తవ్యస్తంగా పడుకున్న రామనాధంని ‘‘ఏవండీ! భోం చేస్తారా?’’ అని ఆవిడ అడగలేదు.‘‘నాన్నా! భోం చెయ్యండి’’ అని అంజలి కూడా అనలేదు.ఇద్దరికీ తెలుసు. అతనలా తాగొచ్చాక చచ్చినా భోం చెయ్యడని!లోలోపల దుఃఖిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియక ఒకసారి ఆమె వైపు జాలిగా చూసి తర్వాత తన జాగాలో కొచ్చి పడుకుంది. పడుకుందన్న మాటే గాని నిద్రరాక ఆమె కళ్లు మంట పెడుతున్నాయి.

 ఆలోచనలు కుమ్మరి పురుగుల్లా ఆమె మనసుని తొలిచేస్తున్నాయి!నాన్న ఎందుకిలా తయారయ్యేడు? అమ్మ నిజంగా చాలా మంచిది. ఎప్పుడూ ఎదురు జవాబిచ్చి ఎరుగదు. ‘‘ఇది లేదు. అది లేదు’’ అని సతాయించదు. ఉన్న దాంట్లోనే క్లుప్తంగా గడుపు కొస్తుంది. అయినా ఇలాంటి పాడు వ్యసనంతోనే నాన్నకి ఉన్న ఉద్యోగం కూడా ఊడింది. ఊర్నిండా అప్పులు! ఎక్కడా తలెత్తుకోలేక.... ఎవరు? నాన్నకేం హాయిగా తలెత్తుకు తిరుగుతున్నాడు. ‘‘షేమ్‌ లెస్‌ ప్యూపుల్‌ ఆర్‌ ఆల్‌వేజ్‌ హేపి!’’ మధ్యన తను... అమ్మ... తలెత్తుకోలేక, ఎవరింటికి వెళ్లలేక సిగ్గుతో చితికిపోతున్నారు! ఇంత వయసు వస్తే మాత్రం ఏం లాభం? బుద్ధి, జ్ఞానం లేకపోయేక?... అంజలి మనసంతా దిగులుతో నిండి పోయింది. పోనీ తనకైనా ఉద్యోగం వస్తే బాగుణ్ణు! తను బి.ఏ. పాసయింది. మొన్ననే ఇంటర్వ్యూ కెళ్లి వచ్చింది. ఇంటర్వ్యూ బాగానే చేసింది. ఈ ఉద్యోగమైనా తనకొస్తే బాగుండును. తల్లిని, చెల్లెళ్లని, తమ్ముడ్ని ఆదుకోవచ్చు. బాధ్యత మోయాల్సిన తండ్రి బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తూ బరువు దించుకోవాలని చూస్తున్నాడు. తన అర్థం లేని తాగుడికీ, బాధ్యతల బరువుకి అనవసరంగా ముడి వేసి ‘‘ఈ బాధల్ని మర్చిపోవడానికే తాగుతున్నానని’’ సమర్థించుకుంటున్నాడు. ఇంకా గట్టిగా అడిగితే పెద్దపెద్ద కేకలు వేసి, ఇంట్లో అందర్నీ తన్నినంత పని చేసి ఆఖరికి ‘‘నేను ఏమీ చేతకాని వాడిని. చేతకాని వాడిని. ఇంత విషం ఇచ్చెయ్యండి. చచ్చిపోతాను. నా పీడ విరగడై పోతుంది!’’ అని భోరున ఏడుస్తాడు. ఛ అసలు మగాడు అలా ఏడవడం చూస్తే పరమ అసహ్యం వేస్తుంది.