విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్టుపైనుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు, ఇవియం దగ్గరకి వెళుతున్న ఓటరులాగా. శవంలో ఉన్న బేతాళుడు మౌనంగా సాగిపోతున్న విక్రమార్కుడితో ‘‘రాజా... ఈ నిశీధివేళలో, ఈ నక్కల ఊళల మధ్య చితులూ, శవాలూ దాటుకుంటూ ఎవరికోసం శ్రమపడుతున్నావో తెలీదు.. నీకు శ్రమ తెలీకుండా ఉండటానికి ఒక కథ చెబుతాను విను.

పూర్వం చిత్రకూట పర్వతపాదం వద్ద ఉద్దండపురం గ్రామంలో...’’కథలో మునిగిపోయింది శైలజ.శైలజకు ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. వేరుశనగపప్పు, బెల్లం ఉండ నోట్లో వేసుకుని చప్పరిస్తూ... కొంచెం కొంచెం కొరుక్కుంటూ చందమామ కథలు చదవడం అంటే భలే ఇష్టం. అలాగే చేతులకి గోరింటాకు పెట్టుకుని రంగు రంగుల గాజులు రెండు చేతుల నిండా వేసుకుని వాటి చప్పుడు వినడం ఆమెకి ఇష్టం. అలానే తాను పుట్టి పెరిగిన అప్పలరామునిలంక అన్నా కూడా.రేపు తమ ఊరు వెళ్ళబోతోంది, అమ్మతో కలిసి. చాలాకాలమైంది అక్కడికి వెళ్ళి.గోదావరి లంకలన్నీ భలే అందంగా ఉంటాయి. చుట్టూతా ప్రవహించే నీళ్ళు లేదా ఘనీభవించిన ఇసుక మేటలు. ఎటుచూసినా పచ్చని ఆకుల్తో పెళ్ళిపందిరిలాగా కళకళలాడే కొబ్బరిచెట్లు. పచ్చ పరికిణీ వేసుకున్న అందమైన అమ్మాయి పాదాలకు పారాణి పూసినట్టు కొబ్బరి చెట్ల మొదళ్ళలో పైరు పచ్చ వరిపొలాలు.ఈ చెట్ల మధ్య పాపిడి తీసినట్టుగా రోడ్డు. గాలి కూడా పచ్చటి వాసనేస్తూ కమ్మగా ఉంటుంది.

అది వేసవికాలం అయితే వెచ్చని పచ్చదనం... ప్రియురాలి శ్వాసలా. చలికాలమైతే చల్లటి పచ్చదనం... తల్లిశ్వాసలా.ఇంతకంటే అందమైన దేశాలూ, ప్రదేశాలూ ఉంటాయా? ప్రశ్న... బేతాళప్రశ్న. శైలజ మెదడులో తిరిగే ప్రశ్న. అమ్మానాన్నల్తో, అత్తమ్మ మామయ్యలతో, పిన్ని బాబాయిలతో కలిసి అందరిలా తిరుమల వెంకన్న దర్శనానికి ఎప్పుడూ వెళ్ళలేదు శైలజ. వాళ్ళంతా వేరేగా వెళ్ళేవాళ్ళు... ఎందుకు?... అదింకో ప్రశ్న.కానీ తల్లితో కలిసి వెంకన్న మొక్కు తీర్చుకోడానికి యాత్రా బస్సులో వెళ్ళినపుడు బద్వేలు దగ్గర కిటికీలోంచి తల బయటపెట్టి చూసి అమాంతం ఝడుసుకుంది శైలజ. అక్షరదోషమైనా ఆ జడుపుకి ఆ మాత్రం అవసరమే. కనుచూపుమేరలో కానరాని నీటి జాడ.