ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లో మెషిన్లా చదివి చదివి ఇంటికొచ్చాను. ఇంటికి రాగానే నా కళ్ళు అమ్మకోసం వెతుకుతాయి ఉండదని తెలిసినా. అమ్మ వొళ్ళో వెచ్చగా పడుకుని కబుర్లు చెప్పాలని నాకు ఆశ. పిల్లలకు... నా లాంటి ఆడపిల్లలకు అమ్మకంటే దగ్గరి వాళ్ళెవరుంటారు.ఇల్లంతా రైలెళ్ళిపోయిం తర్వాత ఖాళీ అయిన ప్లాట్‌ఫాంలా ఉంది. నాకు, పంజరంలోని పక్షికి పెద్ద తేడా లేదన్పించింది.మమ్మి, డాడి రాత్రయ్యాక గాని ఇంటికి రారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఇంటికొచ్చి నన్ను చూస్తూ గాని వాళ్ళకు నేనొక దాన్ని ఉన్నట్లు గుర్తుకు రాదు. మమ్మి, డాడి నాతో కన్నా బిజీతోనే ఎక్కు వగా గడిపేస్తుంటారు. నాతో మాట్లాడే తీరిక వాళ్ళ కుండదు. ఒక వేళ మట్లాడినా నా స్టడీస్‌, మార్క్స్‌ గురించే. అంతకు మించి నాతో మాట్లాడే విషయా లేవీ లేనట్లు.ఎదుగుతున్న నా చిన్ని మనసులో ఎన్నో సందేహాలు.

 నా చిట్టి గుండెలో మరెన్నో భయాలు. మమ్మి, డాడి అని అడిగి నివృత్తి చేసుకోవాలని ఉంటుంది. నాకు అవకాశం ఇస్తేగా? చొరవ తీసు కుని అడిగినా పెద్ద విషయాల గురించి నీకెం దుకు? అంటూ నా నోరు నొక్కేస్తారు.ఆ సందేహాలు, భయాలు నాలోనే ఉండి పోయి నన్ను చికాకు పెడుతుంటాయి.మమ్మి, డాడికే తీరిక లేనప్పుడు ఇంక నాతో మాట్లాడేదెవరు? నా మనసు పంచుకునే వాళ్ళె వరు?ఉన్నారు! తాతయ్య... ఈ లోకంలోనే నా బెస్ట్‌ ఫ్రెండ్‌ తాతయ్య. ఆయనకు బోల్డు విషయాలు తెలుసు. రామయణ, భారత, భాగవత కథలు చెప్పేవాడు నాకు. ఆ కథలు వింటూ తెలీని లోకాల్లో విహరించేదాన్ని.స్కూల్లో మాకివేం చెప్పరు. ఎంతసేపు ఎ ప్లస్‌ బి హోల్‌ స్క్వేర్‌, మైనస్‌.... ఎలక్ర్టాన్‌.. న్యూట్రాన్‌.... వీటి గురించే చెప్తారు. డైలీ లైఫ్‌లో అవెక్కడ ఉపయోగపడతాయో నా చిట్టి బుర్రకు ఎంత ఆలోచించినా అర్ధం కాదు.అలాంటి తాతయ్య మమ్మల్నొదిలి ఆశ్ర మానికి వెళ్ళిపోయాడు.... ప్చ్‌! కొన్నాళ్ళ క్రితం వరకు మాతోనే కల్సి ఉండేవాడు. తాతయ్యకు మమ్మీకి మధ్య గొడవ జరిగింది. అదంతా నా వల్లే.