దూరం నుంచి చూస్తే కారుమేఘంలా కన్పించింది.ఆ మేఘం దగ్గరకు వొచ్చి మీద పడేటప్పుడు చూస్తే బూడిద మేఘం అది. ఒక్క వానచుక్క కూడా లేదు. ఎంత మోసం చేసింది? కారు మేఘమని వర్షం వొస్తుందని ఆశపడితే అడియాశ అయ్యిందే!బూడిద మేఘం ఉప్పెనలా ఊరి మీద పడుతూ వుంది. వాన నీటితో గొంతు తడుపుకుందామని మోత ఎత్తి నిలబడిన పాడి ఆవు కళ్ళల్లో దుమ్ము పడింది. బూడిద కుప్పలో కూరుకుపోయింది పాలపిట్ట... పచ్చని మొక్కలు బూడిద రంగులోకి మారిపోయాయి.చుట్టుముట్టేసింది బూడిద తెర.. ముక్కుల్లో నుంచి ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయింది బూడిద... ఊపిరి ఆడటం లేదు......గింజుకున్నాడు... ఎవరో మీదపడి నొక్కివేస్తున్నట్లుగా అన్పించింది... ఉక్కిరి బిక్కిరయ్యాడు..మెలుకువ వొచ్చింది జీవన్‌కు.బెడ్‌లైటు కాంతిలో డబుల్‌ కాట్‌ మంచం మీద తన ప్రక్కన పడుకున్న పిల్లలిద్దరూ కన్పించారు. కుదుటపడి సెల్‌ఫోన్‌ నొక్కి స్ర్కీన్‌ మీది వెలుగులో టైం చూసుకున్నాడు... ఐదయింది.మళ్ళీ పడుకోవాలని ప్రయత్నం చేశాడు గాని నిద్రపట్టలేదు. లేచి బాత్‌ రూమ్‌కు వెళ్ళి మొహం కడుకున్నాడు. వంట గదిలోకి దూరి కాఫీ కలుపుకుని కాఫీ కప్పుతో ఇంట్లో నుంచి బయటకు వొచ్చాడు.పక్కింటి వసుమతి వాకిలి ఊడుస్తూ కన్పించింది.‘‘రాత్రి ఇంటికి వొచ్చేసరికి బాగా పొద్దుపోయింది. పిల్లలు నిన్నేం ఇబ్బందిపెట్టలేదుగా?’’ అరుగుమీద కూర్చుని కాఫీ చప్పరిస్తూ వసుమతితో అన్నాడు జీవన్‌.‘‘పిల్లల స్కూలు ఫీజులు కట్టడం మర్చిపోయావట... డబ్బులు టేబిల్‌ మీద పెట్టి వెళ్ళండి. నేను స్కూలుకు వెళ్ళి కట్టి వొస్తాను.. రేపు మీ చిన్నబ్బాయి బర్త్‌డే! ఇంట్లోనే ఉండండి ఆఫీసుకు సెలవుపెట్టి’’ అందామె.

వాకిలి ఊడ్వటం అయిపోవడంతో కళ్ళాపి చల్లుకుంది. ఉదయం వెలుగులో ఆమె వొంటి వొంపులు అద్భుతంగా కన్పించాయి జీవన్‌కు.‘‘ఏమిటా చూపులు? లోపలికి వెళ్ళి మీ పని చూసుకోండి! మనిద్దరం వాకిట్లో నిలబడి కొరుక్కుతింటన్నట్లు చూసుకుంటూ వుంటే ఊళ్ళో వాళ్ళు తాటాకులు కడతారు’’ అల్లరవతామన్న భావనతో అందామె.లోపలికి వొచ్చి వసుమతి గూర్చే ఆలోచిస్తూ ఉండిపోయాడు.... తన కుటుంబాన్ని ఆమె ఆదుకోకపోతే తను ఏమయ్యేవాడో! పిల్లలు దిక్కు లేని పక్షులయ్యే వాళ్ళు!‘‘పెళ్ళయిన కొత్తల్లోనే వసుమతి వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగాడు తను... నీలిమ ఎంతో చలాకీగా వుండేది. వసుమతితో బాగా స్నేహం కలిసింది. ఎక్కడకు వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. తమకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించడం అన్నం తినిపించడం, ఎత్తుకుని ఆడించడం వసుమతే చేస్తూ ఉండేది.వసుమతి భర్తకు కుదురు లేదు... ఊళ్లు పట్టుకుని తిరుగుతూ వుంటాడు. మతి స్థిమితం కూడా తక్కువ. వసుమతి తన భార్య అన్న సంగతే మర్చి పోతాడు. పరాయి స్ర్తీ అనుకొని ఒక్కోసారి ‘‘ఆకలవుతుంది... అన్నం పెడతారా అమ్మా!’’ అంటూ అడుగుతాడు. కళ్ళ నీళ్ళు పెట్టుకుని భర్తకు అన్ని మర్యాదలు చేస్తుంది.. చిన్నపిల్లాడిని పెంచినట్లు భర్త పోషణ చూస్తుంది... ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోతాడు. ఐదారు నెలల కొకసారి ఇంటికి వొస్తూ ఉంటాడు. అతను భుజానికి తగిలించుకున్న సంచిలో ఇంటి అడ్రెస్‌ రాసి వున్న కాగితాలు ఉంటాయి. ఆ అడ్రెసు చూసి అతని మీద దయదలచి అతన్ని తీసుకువొచ్చి ఇంటి దగ్గర ఒదిలి పెడతారు. అతని పెరిగిన గడ్డాన్ని తీయించి, బట్టలు కొత్తవి కొని మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది వసుమతి. పట్టుమని పది రోజులు కూడా ఇంట్లో ఉండదు. మళ్ళీ మాయమయిపోతూ వుంటాడు.