ఎంత ఆపుకుందామన్నా సుందరయ్యకు దుఃఖమాగడం లేదు. కన్నీళ్ళు ఎక్కడనుండి ఎగదన్నుకొస్తున్నాయో... గొంతు దగ్గరపడి.. ఉక్కిరిబిక్కిరైపోతూ, సుడిగాలిలో ఒట్టి కాగితపు ముక్కవలె.. కడుపులో ఎవరో చేతులుపెట్టి ఊర్చేస్తున్నట్టు... నాభి దగ్గర్నుండి ఏడుపు పొంగి పొంగి.. తమాయించుకోవడం వశం కావడం లేదు సుందరయ్యకు. యిక ఆరిపోబోయేముందు వత్తిలా రెపరెపలాడుతూ...మనిషి.. దుఃఖంతో సుళ్ళు తిరిగిపోతున్నాడు.కన్నీళ్ళలో నుండే ఎదురుగా గడియారం దిక్కు చూశాడు.రాత్రి...మూడు గంటల పది నిముషాలు.చుట్టూ అంతా నిశ్శబ్దం... ఎక్కడా ఏ అలికిడీ లేదు.వెల్లకిలా నులకమంచంపై పడుకుని తలకింద రెండు చేతులనూ పెట్టుకుని గంటలకు గంటలు ఎప్పట్నుండో అలా పై కపలోకి చూస్తూ ఉండిపోయిన సుందరయ్యకు మనసంతా గొర్రుకొట్టిన పొలంలా ఉంది. 

గుండెల్లోకి ఎవరో ఉలులను దిగ్గొడ్తున్నట్టు.. శరీరం ఖండఖండాలుగా విడిపోతున్నట్టు.. కళ్ళముందే అంతా ముక్కలు ముక్కలుగా ధ్వంసమైపోతున్నట్టు..ఎలా జరిగిందంతా.. ఒక్క రెండు నెలల్లోనే.. యింత బీభత్సం.. యింత వ్యాపారం.. యింత దురాక్రమణ యింత దగా... మనుషులు మనుషులను కొనడం.. మనుషులు భూములను కొనడం.. భూములు మనుషుల చేతుల్లో కాగితపు ముక్కలకంటే హీనంగా పీలికలు పీలికలైపోవడం.. మట్టికి రెక్కలు రావడం.. ఒర్రెలు, బోళ్ళు, వాగులు, గుట్టలు, అన్నీ డబ్బుగా మారిపోతూండడం... ఏమిటి... ఏమిటిదంతా.సుందర య్యకు అంతా.. యింకా ఓ అర్థంగాని మాయవలెనే అనిపిస్తోంది. అతనికి ఈ భూమిని మింగేసే చిచ్చు ఎక్కడ పుట్టిందో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా ఉండే తమ ఊళ్ళోకి అకస్మాత్తుగా ఈ పెద్దపెద్ద కార్లు, ఖడక్‌ బట్టల మనుషులు, అన్ని చేతివ్రేళ్ళకూ బంగారు ఉంగరాలు పెట్టుకున్న తెల్లసీమపందుల్లాంటి ఘరానా వ్యక్తులు ఎక్కడనుండి ఊడిపడ్తున్నారో అర్థం కావడం లేదు.ఒకరోజు రెండు కార్లొచ్చాయి. సర్పంచ్‌తో, ఒక వార్డు మెంబర్‌తో రహస్యంగా మాట్లాడారు. ఆ వచ్చినవాళ్ళు సీసాలకు సీసాలు తాగారు. ఊరిబయటికిపోయి పొలాలు, తాళ్ళు, చెరువుకట్ట, మైసమ్మ గుట్ట, హనుమంతుని గుండు.. అంతా కలియదిరిగి సాయంత్రం వెళ్ళిపోయారు.యిక మర్నాటినుండి ఏ చెట్టుకింద చూచినా గుంపులు గుంపులుగా మనుషులు. దిక్కుమాలినవాళ్ళ చేతుల్లో సెల్‌ఫోన్లు...హలోహలోలు.. సాయిబు హోటల్‌ నిండా రాత్రికి రాత్రులు మందు సీసాలు రావడాలు.. ఎవరినోట విన్నా భూమిని అమ్ముకోవడం గురించే ముచ్చట్లు. అమ్ముకోకుంటే ముంచుకురాబోయే ముప గురించి బెదిరింపులు.. భయపెట్టడాలు.. భ యపడడాలు.. అంతా ఓ యుద్ధవాతావరణం.సుందరయ్య సూటిగా సర్పంచ్‌ రామలింగంను అడిగాడు.. ‘‘ఎందుకు ఊర్లోని జనమంతా యిట్ల బిత్తర పడిపోతున్నారు. ఏం జరిగిందసలు.’’ అని.‘‘మొన్న వాళ్ళొచ్చి చెప్పిండ్రుగదా.. నువ్వినలేదా.. మన ఊరు ఊరంతా ఆ ఎస్సీజడ్‌ల పోతాందట.. భూములను ప్రభుత్వం తీసుకుని మనను ఊరు ఖాళీ చేయమంటదట. మన భూములకు సర్కార్‌ లెక్కప్రకారం ఏ పైసో పర్కో కట్టిచ్చి ఎక్కడన్నా పునరావాసం ఏర్పాటు చేస్తదట. గీ విషయం విన్నకానుంచి అసలు సంగతేందని రోజూ హైద్రాబాద్‌కు తిరుగుతనే ఉన్న.’’