ఒరే చింటూ, పక్క సందులోని షాపుకెళ్లి ఓ సర్ఫ్‌పేకెట్‌ తీసుకొని రా’’ పదేళ్ల చింటు వురఫ్‌ గోపిని పురమాయించింది వాళ్లమ్మ నిర్మల.‘‘ఆ సందులో స్ర్టీట్‌లైట్‌ వెలగడం లేదమ్మా, అంతా చీకటిగా వుంది. నాకు భయంగా వుంది. నే వెళ్లను’’ కిటికీలోంచి ఆ సందులోకి తొంగి చూసి చెప్పాడు చింటూ.అప్పుడే బేంకు నుండి ఇంటికొచ్చి, స్నానం ముగించి లాల్చీ, పైజామలోకి మారి పడక్కుర్చీల్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆశీష్‌ కొడుకు వంక ఓ సారి కోపంగా చూసి చెప్పాడు.‘‘ఒరే, నువ్వీ లేనిపోని భయాలన్నీ పోగొట్టుకోవాలి. లేకపోతే జీవితంలో పైకి రాలేవు’’.చింటూ తండ్రి వంక ఆశ్చర్యంగా చూసి అడిగాడు. ‘‘ఐతే నువ్వు చిన్నప్పుడు ఒక్కసారి కూడా భయపడలేదా డాడీ?’’‘‘లేదురా, మేం చిన్నప్పుడు హైస్కూల్లో చదువుకోవాలంటే మా విలేజ్‌ నుంచి మూడు మైళ్లు నడిచి పక్కనుండే టౌన్‌కి వెళ్లాల్సి వచ్చేది. స్కూలు, ట్యూషన్‌ ముగించుకొని ఇంటికి బయల్దేరే సమయానికి చీకటి పడేది. మా వూరికి వెళ్లేదారిలో వూడలు దిగిన ఓ పెద్ద మర్రి చెట్టుండేది. అందరూ దాన్ని దెయ్యాలమర్రి అనేవాళ్లు. ఒక్కోసారి నేనొక్కణ్ణే రాత్రి తొమ్మిది, పదికి కూడా ఆ మర్రి చెట్టు దాటుకొని ఇంటికెళ్లే వాణ్ణి. 

అక్కడికి చేరగానే కొన్నిసార్లు ఏవో భయంకరమైన శబ్దాలు వినిపించేవి. ఐనా ఒక్కసారి కూడా నేను భయపడలేదు’’ గర్వంగా చెప్పాడు ఆశీష్‌.ఆశీష్‌ జీవితంలోనే అత్యంత భయంకరమైన రోజు అతి సమీపంలోనే పొంచి వుందని అతనికా సమయంలో తెలియదు.్‌్‌్‌‘‘పోలీసులకు కబురు పెట్టండి’’ తీరిగ్గా కూర్చుని వక్కపొడి నములుతూ అన్నాడు గుర్నాధం.‘‘అవసరం లేదు. పోలీసులంటే అఫిషియల్‌ కంప్లెయింటు ఇవ్వాలి. మన రికార్డ్స్‌లో రిజిస్టర్‌ చెయ్యాలి. అశీష్‌ సర్వీస్‌ రిజిస్టర్లో ఎంటరౌతుంది! తరువాత అతనికి త్వరలో రాబోయే ప్రమోషన్‌ ఆగిపోవచ్చు’’ కంగారుగా చెప్పాడు బేంకు మేనేజర్‌ రవీంద్ర.‘‘అసలు కాష్‌ సీట్లో ఎప్పుడూ చాలాజాగ్రత్తగా వుండే ఆశీష్‌ ఎందుకింత దారుణమైన పొరపాటు చేశాడో అర్థం కావడం లేదు. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి అకేషన్‌రాలేదు’’ ఆశీష్‌ను ఓదారుస్తున్నట్లు అన్నాడు ముజీబ్‌.ఆశీష్‌ తన సీట్లో విచారంగా కూర్చుని వున్నాడు.‘‘మనలాంటి వాళ్లు మెత్తగా అడిగితే చేసిన నేరాన్ని ఎవరైనా అంత సులభంగా ఒప్పుకుంటారా? పోలీసులు డీల్‌ చేస్తే ఫలితం వేరుగా వుంటుంది’’ సిగిరెట్‌ వెలిగిస్తూ చెప్పాడు గుర్నాధం.ఆశీష్‌ మనసు మొద్దుబారినట్లైంది. ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కింది.తాను కేషియర్‌ సీట్లో కూర్చుని ఎన్నోరోజులు పని చేశాడు. ఎప్పుడూ ఎలాంటి పొరబాటు జరగలేదు. కానీ ఈ వేళ ఎందుకో.... ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన అతని మనసులో మెదిలింది.