ఇంకో రెండు రోజులలో నా హౌస్‌ సర్జన్సీ కాలం పూర్తికానుంది. అప్పట్లో హవుస్‌ సర్జన్‌లో వుండగానే గవర్నమెంట్‌ హాస్పిటల్లో పోస్టింగ్‌ వచ్చేది. అలాగే నన్ను వరంగల్‌కు కేటాయిస్తూ పదిహేను రోజుల క్రితమే ఆర్డర్‌ వచ్చింది. మనసులో కొంచెం ఉద్వేగంగా వుంది. ఎమర్జన్సీలో నైట్‌డ్యూటీలో వున్నాను. అప్పటివరకు చదువుతున్న ‘మెడికల్‌ ఎమర్జెన్సీస్‌ పీడియాట్రిక్స్‌’ పుస్తకాన్ని మడిచిపెట్టి, బద్ధకంగా కుర్చీలోంచి లేచి, వొళ్ళు విరుచుకున్నాను. అలా బయటకు వచ్చి ఒక సిగరెట్‌ వెలిగిద్దామనుకున్నాను.ఇంతలో సైకియాట్రి (మానసిక రోగుల విభాగం) నుంచి అక్కడికి డ్యూటీ డాక్టర్‌ను పంపవలసిందిగా ఒక మెమో వచ్చింది. సిగరెట్‌ వెలిగించుకుని నిదానంగా నడుస్తున్నాను. ఆ విభాగం హాస్పిటల్‌ కాంపౌండ్‌లోనే అయినా ఒక ఫర్లాంగు దూరంలో వుంటుంది.పగలంతా గోలగోలగా, హడావిడిగా బెజవాడ రైల్వే ప్లాట్‌ఫారమ్‌లా వుండే హాస్పిటల్‌ రాత్రి 2 గంటల సమయంలో నిద్రపోతున్నట్లున్నది. మర్నాటి రాత్రి డ్యూటీతో ఇక ఈ హాస్పిటల్‌తో నా అనుబంధం వుండదు - తాత్కాలికంగానైనా సరే. కొంచెం దిగులు అనిపించింది. నా కొత్త పోస్టింగ్‌... అదీ... ఇలా ఆలోచించుకుంటూ మానసిక రోగుల విభాగానికి చేరాను. అప్పట్లో వైజాగ్‌లో మానసిక రోగులకు ఒక ప్రత్యేక హాస్పిటల్‌ వుండేది. దానికి సూపరింటెండెంట్‌గా వున్న డాక్టరు గారిని యిటీవలే గుంటూరు గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో మానసిక వ్యాధుల విభాగానికి చీఫ్‌గా బదిలీ చేశారు. ఆయనే అనేవారు .

 ‘‘నేను వైజాగ్‌ పిచ్చాసుపత్రిలో పెద్ద డాక్టర్ని. ఇక్కడ గుంటూరులో పెద్దాసుపత్రిలో పిచ్చి డాక్టర్ని’ అని.నేను వెళ్ళే సమయానికి అక్కడ జయ అని ఒక నర్స్‌ డ్యూటీలో వుంది. జయ వాళ్ల బ్యాచ్‌ - నేను మెడికల్‌ వార్డ్‌-2లో వుండగా అక్కడ కలిసి పనిచేశాం. ఆ బ్యాచ్‌ వాళ్ళంతా బాగా పరిచయం. జయ అంటే ఒక ప్రత్యేక అభిమానం వుండేది. ఇంకో సంగతి. అప్పట్లో ఒక రూలు వుండేది. నర్సింగ్‌ స్టూడెం ట్స్‌ ఎవరి చేతులలోనైనా సిరంజి ఏదైనా పగిలితే, ఆ సిరంజి ఖరీదు వాళ్ళ స్టయిఫండ్‌లో కట్‌చేసేవారు. అదే మా హౌస్‌ సర్జన్ల చేతిలో పగిలితే మాకేమీ ‘కట్‌’ వుండేది కాదు. ఆ రూలు సరైంది కాదనుకునేవాణ్ణి! అందుకని, మా వార్డులో ఏ నర్సింగ్‌ స్టూడెంట్‌ చేతిలో సిరంజి పగిలినా నా చేతిలో పగిలినట్లు రిజిస్టర్‌లో సంతకం పెట్టేవాణ్ణి.మా బంధువొకాయన హాస్పిటల్‌లో క్లర్క్‌గా ఉండేవారు. ఆయన వద్దకు ఆరోజు ఉదయం వెళ్ళి నా పోస్టింగ్‌ విషయం చెప్పాను. ఆయన నవ్వుతూ ‘‘ఇక్కడ హౌస్‌ సర్జన్‌గా ఏం నేర్చుకున్నావో ఏమోగాని ప్రతినెలా యాభై అరవై సిరంజిలు మాత్రం పగలగొట్టినట్టు రిజిస్టర్‌లో వుంది’’ అన్నారు. జయ మాత్రం అలాంటి సందర్భం ఏమైనా వచ్చినా మిగతావారిలాగా నా సంతకం కోసం రిజిస్టర్‌ తీసుకువచ్చేది కాదు. ‘ఎందుకు సంతకం పెట్టించుకోవు?’ అనడిగితే - ‘మేం జాగ్రత్తగా వుండాలి. అన్నీ భద్రంగా చూసుకోవాలి. అందుకోసమే కదా ఆ రూలు? నా చేతిలో సిరంజి పగిలితే అది నా పొరపాటే కదా’’ అనేది. అంతేకాదు - పేషంట్ల పట్ల ఆప్యాయంగా, ప్రవర్తనలో హుందాగా వుండేది. అందుకే ఆ బ్యాచ్‌లో ప్రత్యేకంగా గుర్తుండిపోయింది.