‘‘నాకు మా అమ్మని చంపేయాలనుంది కవిగారూ!’’ అన్నాడు రంగా.‘‘ఆఁ’’ అన్నాను ఉలిక్కిపడి.సాహిత్యాభిలాష ఉంది కానీ నేను కవిత్వం చెప్పలేను. రంగా కూడా కవినన్న ఉద్దేశ్యంతో నన్నలా పిలవలేదు. నేనో ఇన్వెస్టిగేటివ్‌ ఏజన్సీ నడుపుతున్నాను. రవి కాంచనివి కవికాంచగలడని తెలుగు నానుడి. అందుకని నా ఏజన్సీకి ‘కవి శోధన’ అని పేరెట్టాను. అలా నేను కవిని. నా పేరు రామకృష్ట భట్టు కాబట్టి ఎవరిష్టాన్నిబట్టి వాళ్లు నన్ను రామకవి,కృష్ణకవి, రామకృష్ణకవి, భట్టుకవి అని కూడా పిలుస్తూంటారు.నా శోధనకి మారువేషాలుండవు. పిస్తోళ్లు వాడను. మనసుల లోతుల్లోకెళ్లి రవి కాంచని అంశాలు తెలుసుకుని విశ్లేషించడం నా పద్ధతి. అలా ఎన్నో సమస్యల్ని టాకిల్‌ చేసానేమో- నాకు చేతినిండా పని.

నాకు అసిస్టెంట్లంటూ ప్రత్యేకంగా లేరు. నా శోధనకి తెలిసినవారి సాయం తీసుకుంటాను. తమ శోధనకి నా విశ్లేషణ ఆసక్తికరంగా ఉండడమేకాక ఎంతోకొంత ప్రతిఫలమూ ఉంటుందని చాలామంది నాకు సాయపడ్డానికి కుతూహలపడతారు.‘‘నిజంగా నాకు మా అమ్మని చంపేయాలనుంది కవిగారూ!’’ మళ్లీ అన్నాడు రంగా.పరీక్షగా చూసానతణ్ణి. ఆ మాటనడానికి మనసులో ఎంత వేదన పడ్డాడో- అదంతా ముఖంలో స్పష్టమౌతోంది.‘‘కన్నకొడుక్కే అలా అనిపించేలా ఏం చేసింది మీ అమ్మ?’’ అడిగాను.‘‘అమ్మ పేరు మాలతి. తను చాలా మంచిది. అందరమ్మలూ చీరలు, నగలు అంటూ తమ సరదాల గురించి ఆలోచిస్తే తనెప్పుడూ కుటుంబశ్రేయస్సు గురించే ఆలోచించేదని నాన్న మెచ్చుకునేవారు. నాన్నకి దురలవాట్లు లేవు కానీ- ఇల్లు, ఇల్లాలు, పిల్లలు గురించి అంతగా పట్టించుకోడని తాతగారనేవారు. 

అమ్మ నాన్నని పల్లెత్తు మాటనకుండా, బాధ్యతగా సంసారం నెట్టుకొస్తోందని బామ్మ మెచ్చుకునేది. నాకు చదువబ్బినా, మా చెల్లికి ఇరవై ఏళ్లకే పెళ్లి జరిగినా అమ్మ వ్యవహారదక్షతేనని అంతా అంటారు...’’‘‘అందుకని అమ్మని చంపేస్తారా?’’ అన్నాను టాపిక్‌ వేరెటో వెడుతోందని గ్రహించి.అతడు చురుగ్గా చూసి, ‘‘నన్ను కాస్త చెప్పనివ్వండి...’’ అన్నాడు. ‘‘అమ్మ మంచిదని ఇరుగుపొరుగులూ, ఇంటి కొచ్చిన బంధుమిత్రులూ మెచ్చుకుంటారు. దయాగుణంతో ఆదరిస్తుందని బిచ్చగాళ్లూ, మానవత్వంతో చేరదీస్తుందని అభాగ్యులూ మెచ్చుకుంటారు...’’‘‘మీరొక్కరు మాత్రం ఆమెని చంపాలనుకుంటారు’’ అన్నాను విసుగు నటిస్తూ. నిజానికి నాకు విసుగ్గా ఏం లేదు. టాపిక్‌ పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త.