ఆ రోజు రంగారావు గారింట్లో చాలా సందడిగావుంది. పిల్లా పెద్దా అందరూ సామాన్లు సర్దమన్నారు. ఇళ్లంతా చాలా కోలాహాలంగా వుంది. విషయమేంటంటే -వాళ్లంతా వాళ్ళ మామగారి - అంటే రంగారావు గారి భార్య మీనాక్షి అన్నగారి కూతురు పెళ్లికి తరలి వెళ్తున్నారు.రంగారావు గారింతలో హడావిడిగా వచ్చారు. ‘‘ఏంటి మీరింకా తయారవలేదా? అవతల బస్సుకి వేళవుతూంది-’’‘‘ఇదిగో నండీ అయిపోయింది, వస్తున్నాం-’’ అంది మీనాక్షి.అందరూ సామానులు ఆటో కెక్కించి, బస్సు స్టేషన్‌కి చేరుకున్నారు. మగ పెళ్లి వారు కూడా ఆ బస్సే ఎక్కారు. దాంతో-బస్సు కబుర్లతో, కాలక్షేపాలతో, హాస్య పరాచికాలతో హోరెత్తుతూంది. కాస్సేపు పోయాక, పిల్లలంతా ‘అంత్యాక్షరి’తో బిజీ అయితే, కొంతమంది పెద్దలు ‘చతుర్ముఖ పారాయణం’తో దగ్గరయ్యారు.భువనకిదంతా చూడడానికి చాలా సరదాగా వుంది. ఏవో తెలియని ఊహలు మొలకలెత్తుతున్నాయి. భువన రంగారావు గారి రెండో కూతురు. తొమ్మిదో తరగతి చదువుతూంది. 

క్లాసులో ఫస్టు; చురుకుదనం, తెలివి తేటలు కూడా ఎక్కువే. ‘తను మామ గారింట్లో ఎవర్నీ ఇప్పటి వరకూ చూసిందిలేదు. తనేంటి? ఆ మాటకొస్తే తమ పిల్లలెవరూ వాళ్లెవరినీ ఇదివరకూ చూడలేదు. అక్కడ ఎలా గడుపుతామో-’ ఈ విధంగా తలపులతో గడుపుతోంది.బస్సు అడవి మార్గంలో వెళ్తోంది. చెట్లూ, చేమలూ, టెలీగ్రాఫ్‌ స్థంబాలూ - అన్నిటినీ వెనకకి నెట్టుకుంటూ - దూసుకు పోతూంది బస్సు. కొన్ని చోట్ల చేమ చింతకాయలు చెట్లకి బరువుగా వేలాడుతూండడం చూసి, ‘ఇక్కడ బస్సు ఆగితే, ఈ కాయలు కొన్ని కోసుకుని వుందునే’ అనుకుంది భువన.సరిగ్గా 8 గంటలకు బస్సు భువన వాళ్ల మామయ్యగారి ఊరు చేరింది. మగ పెళ్లివారితో సహా రంగారావుగారి కుటుంబమంతా బస్సు దిగి, ఆటోలలో పెళ్లివారింటికి చేరుకున్నారు. అక్కడంతా చాలా హడావిడిగా, సందడిగా, గోలగోలగావుంది. అప్పటికే చాలామంది చుట్టాలు వచ్చారు.భువనా వాళ్లకి కూడా ఒక గది ఇచ్చారు. సామాన్లన్నీ అందులో వుంచి, అంతా స్నానపానాదులు ముగించి, భోజనాలు పూర్తిచేసి, అక్కడికి తిరిగి చేరుకున్నారు. పెళ్లి కబుర్లు, ఇవ్వబోయే గిప్ట్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు.ఇంతలో, ‘‘భోజనాలు చేశారండీ?’’ అంటూ ఒక అబ్బాయి చొరవగా లోపలికి వచ్చారు. భువన, అక్క రేష్మి, చెల్లి రమ్య అంతా ‘‘ఈ అబ్బాయి ఎవరా?’’ అని అతనికేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘‘నువ్వు నారాయణశర్మ కొడుకువి కదూ?’’ అడిగారు రంగారావు గారు.‘‘అవునండీ-’’‘‘ఏం చదువుతున్నావు, బాబూ!’’ అడిగింది మీనాక్షి.‘‘ఇంటర్‌ సెకండియర్‌-’’ అంటూ ఆ అబ్బాయి స్వతంత్రంగా వాళ్ల మధ్య కూర్చుని, కబుర్లాడడం మొదలెటాడు.‘‘నా పేరు సిద్ధాంత్‌! మీ పేర్లు చెప్పండి-’’ అంటూ అధారిటేటివ్‌గా అందర్నీ పలకరిస్తూ, చేరువయ్యాడు. చూస్తుండగానే పిల్లలంతా కలిసిపోయి, సరదాగా కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టారు.