రాత్రి పది గంటలైంది. బ్యాంకుకి తాళాలు వేసుకుని ఇంటికొచ్చేసరికి! రాగానే అరుంధతి గ్లాసుతో నీళ్ళిచ్చింది. తాగాను.అప్పుడు చెప్పింది.పిడుగులాంటి వార్త!నాక్కోపం నషాళానికెక్కింది. ‘‘నీకు బుద్ధుందా? నన్నడక్కుండా, నా ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోవటం నీ ఇష్టమేనా? అందులో నా విషయంలో’ అన్నాను.జీవితంలో అరుంధతిమీద అంత నోరు చెయ్యటం ఇరవైఏళ్ళ కాపురంలో అదే మొదటిసారి. అరుంధతి దుఃఖం ఆపుకోలేకపోయింది. భళ్ళుమంది. పైటకొంగు నోటికడ్డంగా పెట్టుకుంది.‘‘క్షమించండి. ఈ ఒక్కసారికీ నా మాట మన్నించండి. జీవితంలో మరెప్పుడూ మీకు చెప్పకుండా మీ విషయంలోనే కాదు, నా విషయంలో కూడా నేనే నిర్ణయం తీసుకోను’’ అన్నది కళ్ళు తుడుచుకుంటూ.నాకు సమస్యేదైనా తీవ్రంగా వేధించినప్పుడు పరిష్కారం కోసం సిగరెట్టు కాల్చటం అలవాటు. వెంటనే సిగరెట్టు నోట్లో పెట్టుకుని లైటర్‌తో వెలిగించాను.

‘‘అదిగో! అక్కడే మీకూ నాకూ వస్తుంది. రాత్రంతా ‘ఖళ్‌... ఖళ్‌’మని ఒకటే దగ్గు. మీరు అసలు నిద్రపోలేదు. రాత్రేకాదు, ఈ మధ్య మీకు దగ్గూ, కఫం ఎక్కువైంది. మందులా పని చెయ్యటం లేదు. సిగరెట్లు మరీ ఎక్కువైపోయాయి. మానమంటే మానరు!’’ అంది.‘‘ఏం చెయ్యను. బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువయింది. స్టాఫ్‌ తక్కువ. వీరయ్య అటెండరైనా కంటికిరెప్పలా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, బుర్ర వేడెక్కినప్పుడు దానికి విశ్రాంతి అవసరం. వాలంటరీకీ టైం కాదు’’ అన్నాను.‘‘అందుకే, పొద్దున్న అన్నయ్య వస్తే నాగోడు చెప్పుకున్నాను. చెపితే ఈ పరిష్కారం చూపెట్టాడు.

ఈ ఒక్కసారీ నామాట కాదనకండి’’ చేతులు పట్టుకుని బతిమలాడింది.ఎంతోసేపు ఆలోంచించాను.ఆమె నిర్ణయంలో తప్పులేదనిపించింది.అనవసరంగా నోరు చేసుకున్నందుకు చాలా బాధపడ్డాను, రాత్రల్లా!సోమవారం ఏకాదశి!అయ్యప్పస్వామి కోవెల రద్దీగా ఉంది!ఆలయం నిండా స్వాములుగా మాల వేసుకోబోయేవారే!గురుస్వామి మా బావే!మా వీరయ్య కూడా మాల వేయటానికి తగిన సామగ్రితో వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయాడు.‘‘బాబూ! తమరూ...’’‘‘అవును వీరయ్యా! నా చేత సిగరెట్లు మాన్పించటానికి అమ్మగారీ నిర్ణయం తీసుకున్నారు. పోనీలే, ఈ విధంగానైనా సిగరెట్టు మానేయగలనేమో చూద్దాం!’’‘‘బాబూ! ఈ నలభై రోజులే కాదు, ఆ తరువాత కూడా మానేస్తేనే ఈ దీక్ష ఫలితం. మీ ఉప్పు తిని బతికినవాణ్ణి కాబట్టి మీకు చెప్పలేదిన్నాళ్ళూ. తమరు దగ్గుతున్నప్పుడల్లా సెప్పాలనుకునేవాణ్ణి, సిగరెట్లు తగ్గించమని. తమరేమనుకుంటారోనని సెప్పలేక పోయాను’’ అన్నాడు.