పూర్వం ఊరికి దూరంగా వుండేది కాని బైపాస్‌ రోడ్డు పడ్డాక ఆశ్రమం అందిపుచ్చుకున్నట్టు అయింది. ఆశ్రమమూ అందులో స్వామివారూ వెలిసినపడు అందరూ ‘‘కొత్త సాములు’’ అని పిలిచేవారు. ఇపడు బైపాస్‌ సాములారుగా క్రమేపీ పాప్యులారిటీని పుంజుకుంటున్నారు. చెట్టు చేవ తేలడానికి, స్వాములు నిలదొక్కుకోడానికి అడ్డదారులు లేవు. కాలమే దానికి ఏకైక మార్గం. ఆయన మహిమలు కూడా కొన్ని లీక్‌ అయినాయి. కాని వాటిగురించి అతిగా ప్రచారాలు చెయ్యద్దనీ, మహిమల గురించి తెలిస్తే తాము దైవాంశ సంభూతులమని అందరికీ తెలిసిపోతుందనీ, తనలో దైవాంశ వుందనే సత్యం జన సామాన్యానికి తెలియడం వల్ల ప్రజలకు దూరం అవుతాననీ, అది తనకు చచ్చినా యిష్టం లేదనీ స్వామి హితభాషణం చేశారు. కాని భక్తులు ఆయన మాటల్ని పెడచెవిన పెట్టారు. బైపాస్‌స్వామి మృదువుగా కోప్పడి ‘‘మనసెరిగి నడుచుకోండిరా’’ అని మెత్తగా మందలించారు.నాలుగైదు ఏళ్లలోనే ఆశ్రమం హంగులన్నీ ఏర్పాటు చేసుకుంది. భక్తులూ పెరిగారు. చిన వాసుదేవుడు శిష్యగణంలో సాములారికి ఆంతరంగికుడు. సందర్భ శుద్ధి వున్నవాడు. భక్తుల మనసుల్ని పసిగట్టి అప్పటికపడు దానికి తగిన చిట్కా ప్రయోగించి, స్వామివారి ఇమేజిని యించీలించీలుగా పెంచగలవాడు. నలుగురిలో భక్తి ప్రపత్తులతో వొణికిపోతూ కనిపించినా, ఏకాంతంలో గురువుకి క్లాసు తీసుకుంటాడని ఒక వదంతి.

 ఆశ్రమం వెనకాలున్న బొప్పాయి చెట్టు ఆ ఏడాది విరగగాసింది. పిందెలుగా వుండగా తెగులు తగిలి, బొప్పాయిలు గిడసబారి చిన్నసైజు శివలింగాలుగా ఆగిపోయాయి. ‘‘అంతా గురువాజ్ఞ’’ అని ముమ్మారు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. తెగులిని దైవత్వంలోకి కన్వర్ట్‌ చేసి, ఒక్కో లింగాన్ని నూటపదహారు రూపాయలకు తక్కువ లేకుండా అమ్మి, సొమ్ము ఆశ్రమానికి జమచేయించాడు వాసుదేవుడు.బంగారు పళ్లానికైనా గోడవార్పు తప్పదు. ఎంతటి వారైనా ఒక మంచి ఆసరా లేకపోతే అల్లుకుపోవడం కష్టం. పగలు భోజనాలు కాగానే, దూరప్రాంతాల భక్తులు రాసే విజ్ఞాపన ఉత్తరాలు చినవాసుదేవుడు చదువుతుంటే సాములారు సావధానంగా వినడం అలవాటు. కొన్నిటికి అప్పటికపడే జవాబులు చెప్పేవారు. కొందరికి ఆశీస్సులు, కొందరికి శ్రీముఖాలు, కొందరికి అభయాలు తిరుగు టపాలో వెళ్లేవి. ఈ మధ్య భక్తులు రాసే జాబులలో స్వామివారి ఫోటో కావాలనీ, పూజలోకి అవసరమనీ, కనుక అనుగ్రహించాలనీ తెగ కోరుతున్నారు. దూరాభారాన వున్న ఆ భక్తుల వెర్రి అభిమానం స్వామివారి ముఖాన్ని ఎరుపెక్కించింది. ‘‘దేనికైనా తరుణం రావలె’’ అన్నారు గురూజీ. ‘‘పోనీ ఒక ఫుటో కొట్టించి పంపితే పోలే’’ అని చినవాసుదేవుడి మనసు అనుకుంది గాని పదిమందిలో ఏమంటాడు. మింగేసి వూరుకున్నాడు.