‘‘హ్యాపీ డేస్‌ సినిమాకి ఓ ఎనిమిది బాల్కనీ టిక్కెట్లు ఎడ్వాన్స్‌ బుకింగ్‌లో తీసుకోండి’’ అంది బుజ్జిగాడి భార్య లీలావతి. బుజ్జి అసలు పేరు ఆనంద్‌. బుజ్జి అనేది ముద్దుపేరు. ‘‘పాపం బావగారు ఏం వెళతార్లేవే అక్కా! నేనెళ్లి తీసుకొస్తాను’’ అన్నాడు లీలావతి తమ్ముడు.‘‘వెళ్లనీయరా! ఆ బొజ్జ కొంచమైనా కరుగుతుంది.’’ఆనంద్‌కి ఓ మోస్తరు పెద్ద బొజ్జ వుంది. అందుకే ఆఫీసులో ‘‘బుజ్జి’’ అన్న పేరు తెలిసిన కొంతమంది ‘‘బొజ్జగాడు’’ అని ముద్దుగా పిలుస్తారు.‘‘ఎందుకులేవే నేను వెళతాను. అసలే కొత్త సినిమా! ఆ ఎడ్వాన్స్‌ బుకింగ్‌ చాలా రద్దీగా వుంటుంది. ఆ క్యూలో బావ బొజ్జ ఎవరైనా నొక్కేస్తారు’’ అన్నాడు బుజ్జి బావమరిది.‘‘అంత అదృష్టమా! అలా పదిసార్లు బొజ్జమీద నొక్కుతేనైనా ఓ నాలుగు అంగుళాలు తీస్తుందేమో!’’ అంది లీలావతి.‘‘నా బొజ్జ నొక్కేవాడు ఈ భాగ్యనగరంలో ఎవడూ లేడు! నేనెళ్లి ఈ బొజ్జతో ఒక్క తోపు తోసానంటే పదిమంది పడిపోయి, క్యూ చెల్లాచెదురయిపోతుంది.’’

‘‘సర్లేండి! బొజ్జ బడాయిలు’’ మాని సినిమా టిక్కెట్లు బుక్‌ చెయ్యండి. బుజ్జిగాడు తీసుకున్న టిక్కెట్లతో బుజ్జిగాడి భార్య, బావమరిదీ, అత్తమామలూ, మరదళ్లు వెరసి ఎనమండుగురు ఆదివారం ‘హాపిడేస్‌’ సినిమాకి బయల్దేరారు.సిటీబస్‌ స్టాప్‌కి వెళుతుంటే ఓ చోట రోడ్డు దాటుతుండగా బుజ్జిగాడి బొజ్జకి ఓ మోటార్‌ సైకిల్‌ హ్యాండిల్‌ తగిలింది. చొక్కా మూడు బటన్లు తెగిపోయాయి. ఏం చెయ్యాలో తెలీలేదు! కొంతమంది ‘‘సినిమా మానేసి ఇంటికి పోదాం’’ అన్నారు. బుజ్జి బావమరిది, ఇంటికెళ్లి వేరే చొక్కా తెస్తానన్నాడు. ‘‘సినిమాకి వేళ మించిపోతుందన్నారు!’’ కొంతమంది.‘‘పెద్ద అదృష్టం. బావ బొజ్జ తగిలి, ఆ మోటార్‌ సైకిల్‌ వాడు బ్యాలన్స్‌ తప్పిపోయి కిందపడి చచ్చిపోలేదు!’’ అన్నాడు బావమరిది.‘‘నిజమే.. వాడుపోతే బుజ్జిబావ జైలుకి పోయేవాడు’’ అంది ఓ మరదలు.‘‘అమ్మో! జైలుకే! పండగలపడు బొబ్బట్లు, పులిహోర జైలుకి మోసుకెళ్లలేక చచ్చేవాళ్లం!’’ అంది ఇంకో మరదలు.‘‘జైల్లో చచ్చేటంత పనిచేయిస్తారు. నాలుగు నెలల్లో బొజ్జ సగం తీసేస్తుంది.’’ అన్నాడు బావమరిది.