సికిందారాబాద్‌ ప్యాట్నీసెంటర్‌ ఫ్లైవోవర్‌ దగ్గరికి వచ్చేసరికి రెడ్‌లైట్‌ పడింది. ఏదో మంత్రదండం చూపినట్లు వాహనాలన్నీ ఈ చివర్నుంచి ఆ చివర వరకూ ఆగిపోయాయి. ‘దిగవే అరుణా!’ ‘పదవే విప్లవా!’ అనుకుంటూ, జనాన్ని నె ట్టుకుంటూ నేనూ, విప్లవ జ్యోతీ ఎలాగో బస్సులోంచి బయటపడ్డాం.అల్వాల్‌ బస్‌స్టాప్‌ వైపు పరుగులు దీశాం. అల్వాల్‌, బాలాజీనగర్‌ల వైపు పోయే కంపెనీ పికప్‌ వ్యాన్ల కోసం ఆ కార్నర్‌లో కాపు కాస్తూ నిలబడ్డాం. ఏయస్‌రావ్‌ నగర్‌, ఇసిఐఎల్‌ వైపు పోయే వ్యాన్లూ, కార్లూ కూడా అక్కడే ఆగుతుంటాయి. 

ఆ డ్రైవర్ల చేతిలో అయిదో, పదో పెడితే హాయిగా కార్లో కూచొని యఫ్‌యమ్‌ రేడియో వింటూ యిళ్లకు పోవచ్చు. అందుకే మాలాగా చాలా మంది ఈ పికప్‌ వెహికిల్స్‌ కోసం ఆ టైంలో అక్కడ వెయిట్‌ చేస్తూ వుంటారు.ఆ వెయిటింగ్‌ గేప్‌లోనే కాస్త ఇంత గాలి పీల్చుకునేది, కాస్త మాటా మంతీ, నాలుగు మాటలూ, కాసిని నవ్వులూ...‘‘మన తాతగారు ఈ రోజు ఇంకా దిగలేదేం అరుణా?’’ అంది విప్లవజ్యోతి.‘‘తాతంటే తంతాడే తల్లీ! తాత అనమాకే!’’ఒక పెద్దాయన ప్రతిరోజూ మాతో పాటే మేం ఎక్కే కేబ్‌లో ఎక్కుతుంటాడు. ఆయన అల్వాల్‌ సత్యా పెట్రోల్‌ బంక్‌ దగ్గర దిగిపోతాడు. మేం ఇంకా పైకి బాలాజీ నగర్‌ వైపు పోతాం.ఒక సారి నోరు జారి మా విప్లవ ఈ పెద్దాయన్త్తో, ‘ఈ రోజు మన అల్వాల్‌ కేబ్‌లు వచ్చేటట్లు లేవు తాతగారూ!’’ అంది.ఆ మాటకు ఆయన సీరియస్సుగా మొహం పెట్టి, ‘‘ఇక్కడ నో తాతలు, వోన్లీ అంకుల్స్‌!’’ అని కట్‌గా అన్నారు. ముందయితే మేం బిత్తరబోయి, ఆనక చాటుగా నవ్వుకున్నాం.మనిషి చాలా టిపికట్‌గా వుంటాడు. ఢై చేసిన గిరజాల జుట్టూ. వత్తుగా పెంచిన సైడ్‌ బరన్స్‌. ఎపడూ యాక్షన్‌ షూ వేస్తారు.

ఫుల్‌ టక్‌లో టెక్‌గా వుంటాడు. త్రాడు కట్టిన సెల్‌ఫోన్‌ మెళ్లో వ్రేలాడేసు కుంటాడు. త్రాళ్లు కట్టిన కళ్లద్దాలు పెట్టుకుంటాడు. కాలేజీ కుర్రాళ్ల టైప్‌లో ఆఫీసు బ్యాగ్‌ను క్రాస్‌గా సైడ్‌కు వ్రేలాడేసుకుంటాడు.రోజూ దాదాపు ఇదే టైంకు బషీర్‌బాగ్‌ వైపు నుంచి ఆటోలో వస్తారు. ఈ వయస్సులో కూడా ఏదో ఆఫీసులో పనిచేస్తూండాలి.ఆటోచార్జీలు ఇవ్వటానికి పాపం ఆ ఆటోవాడ్ని ముప్పతిప్పలు పెడుతూవుంటాడు. పెరిగిన ఆటో చార్జీల చార్టునూ, మీటర్నూ మార్చి మార్చి చూచి చూచీ, గీచి గీచి మరి ఇస్తారు. చిల్లర పైసల దగ్గర పేచీ.ఈ ముస్సలోడ్ని ఎందుకు ఎక్కించుకున్నామా అని ఆటో వాళ్లు నెత్తికొట్టుకుంటారు.