మండల కేంద్రం నించి పల్లెబాట పట్టింది కారు. గతుకుల రోడ్డు మీద నెమ్మదిగా వెళుతూ వుంది.వెనకసీట్లో కూచుని వున్న ధనంజయ్‌ తన వొడిలోని ల్యాప్‌లాప్‌ను మూసి పక్క సీట్‌లోని బ్యాగ్‌లో సర్దాడు. అటు ఇటు పొలాలకేసి అద్దాల్లోంచి ఆసక్తిగా చూడసాగాడు.ఎండిపోయిన పత్తికొమ్మలు, కంది కొయ్యకాళ్లతో, చాళ్లలో రాలిన ఆకు పొట్టుతో ఎండా కాలాన్ని మోసేందుకు సిద్ధమైవుంది నేల.అక్కడక్కడా బోరుబావుల కింద సాగుచేసిన క్రాసింగ్‌ సజ్జ, కంకి తీసింది గాని - కనుగుడ్లలా పొడుచుకు రావాల్సిన గింజలు కాస్తా కన్ను మూసుకుపోయి పొగచూరినట్లున్నాయి. లాకలన్నీ కమిలిపోయి, కర్రంతా నల్లబారి... వైరస్‌ సోకినట్టుంది పైరుకు.ఎటుచూసినా మెట్ట పొలమే... ఎక్కడో అరకొర బోరు వ్యవసాయం తప్ప.తెలుగుగంగ కాలువ దిగువనబడిపోయింది. ఎగువన ఇదిగో - వేల ఎకరాలు వర్షాధారంతో నెట్టుకొస్తూ...చాలా యేళ్లయింది పల్లెకు రాక.అమ్మా నాన్నలు పోయినప్పుడు వచ్చాడు.మేమమామ జబ్బు పడ్డాడని తెలుసు. నడవలేని స్థితిలో ఉన్నాడనీ తెలుసు.అయినా రాలేకపోయాడు.ఇండియాకు వచ్చికూడా నెల రోజులు దాటిపోయింది. మూణ్ణెళ్ళ ముందుగా అమెరికా నుంచే ప్రారంభించిన యీ బృహత్కార్యం ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా భుజాలపై మోయాల్సి వచ్చింది. క్షణం తీరికలేదు. ఒక్కోరాత్రి నిద్ర కూడా లేదు.అక్కడికీ - మామను జాగ్రత్తగా హైదరాబాద్‌ తీసుకురమ్మని వెహికల్‌ పంపాడు. ఊరి జనం వచ్చారు గాని ఆయన రాలేకపోయాడు.

ఆయన హాజరై వుంటే, తొమ్మిది రోజుల సందడిని కళ్లారా చూసివుంటే ఎంత ఆనందించేవాడనీ! ఎంత తృప్తిపడే వాడనీ! ఎప్పుడూ మాట్లాడినా సంభాషణ పూర్తయ్యే లోపల ‘‘రైతుకు గుర్తింపు లేదు. రైతు శ్రమకు గుర్తింపులేదు. రైతు ఉత్పత్తులకు గుర్తింపులేదు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చేవాడు.రైతు గుర్తింపుకోసమే తనీ సంబరాలు చేయించాడు. రైతు వృత్తి నైపుణ్యాల్ని ప్రపంచానికి చాటేందుకే నవ దిన ఉత్సవాలు అంత ఉన్నత స్థాయిలో జరిపించాడు. ఏ క్రికెట్‌కో, పుట్‌బాల్‌కో, బాక్సింగ్‌, ఆర్చెరీ... ఏ అంతర్జాతీయ క్రీడకూ తీసిపోని నైపుణ్యాలు రైతు చేతుల్లో ఉన్నాయని చాటేందుకే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రాష్ట్ర స్థాయి రైతు వృత్తి నైపుణ్యాల పోటీల్ని నిర్వహించారు. ఇది చరిత్ర ఎరుగని సన్నివేశమంటూ పత్రికలు కొనియాడాయి. రాజకీయ నాయకులూ, పార్రిశామిక వేత్తలూ, విద్యావేత్తలూ, మేధావులూ ఎందరెందరో ఉత్సావాలకు హాజరయ్యారు. వ్యవసాయ పనిముట్లకు, ఉత్పత్తులకు సంబంధించిన ఎన్నిస్టాళ్లు ఏర్పాటయ్యాయనీ! వివిధ ప్రాంతాల పల్లెరుచులకు చెందిన ఎన్నో హోటళ్లు వెలిశాయనీ! ఓ పూట గవర్నర్‌ కూడా వచ్చి సందర్శించి వెళ్లాడంటే ఉత్సవాల ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ప్రింట్‌ మీడియా, ఎలక్ర్టానిక్‌ మీడియా మొత్తం అక్కడే తిష్టవేసింది. పదిమంది ఎన్నారైల సహకారంతో తాను చేసిన ఈ పనికి ఆంధ్రదేశం యావత్తూ ఆశ్చర్యంతో తలదిప్పి చూసింది. ఆ తొమ్మిది రోజులూ ఏ దినపత్రిక చూసినా, ఏ టీవీ ఛానల్‌ చూసినా అవే దృశ్యాలు. నాగలి చాళ్లపోటీ, గొర్రు తోలకం, అందులోనూ వెనక్కి తిరిగి కూచుని తోలటం, వామి వేయటం, విత్తనాలు విత్తటం, తాళ్లు పేనటం, గుండు ఎత్తడం, బండ లాగటం, నాటటం. చెక్కతో చేసిన బండి చక్రాన్ని ఒక్కడే విప్పి తగిలించటం, ఓ వైపు చక్రాన్ని పట్టుకొని బండి మొత్తాన్ని పైకెత్తటం, సిర్రిపట్టె, డోలు పట్టె, పులిజూదం వగైరా గ్రామీణ క్రీడలూ, ముఖ్యంగా ఆడపిల్లలకు ముగ్గులు, బారాకట్ట లాంటి క్రీడలూ - రైతు నైపుణ్యాల తోటి అచ్చమైన గ్రామీణ క్రీడల పోటీల గురించి... ఏ ఛానల్‌లో చూసినా అవే దృశ్యాలు.