ఆమె బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ నిద్ర లేచింది. అలవాటయిన శయ్యలా అనిపించలేదు. ఒళ్ళు విరుచుకుంటూ మంచం మీద నుండి కిందికి దిగింది.విందు భోజనంతో పాటు తాగిన మాదక పానీయపు మోతాదు ఒక పెగ్గు ఎక్కువయిందో ఏమో బుర్రంతా దిమ్ముగా ఉంది. కాసింత కాఫీ కలుపుకు తాగితే కాని పూర్తిగా మెలకువ వచ్చేటట్లు లేదు.చుట్టూ కలయజూసింది. పరిచయమైన గదిలా లేదు. అలాగని హోటలు గదిలానూ లేదు. ఎవరిదో ఇల్లు. మంచం వైపు చూసింది. అతను ఇంకా పడుకునే ఉన్నాడు. సాధారణంగా వారాంతంలో బయటికి వెళ్ళి వచ్చిన తరువాత- వారిరువురూ ఎవరి గదులలో వారే పడుకుంటారు. రాత్రి ఏమి జరిగిందో ఏమో అతను కూడా అదే మంచం మీద ఉన్నాడు.రాత్రి కారు తోలడం అతని వంతు కనుక అతను మందు పుచ్చుకోనే లేదు. విందు వాటిక నుండి వారింటికి కారులో మహా అయితే పదిహేను నిమిషాల దూరం. తనకి తన పరుపు మీద తప్ప మరెక్కడా పడుకోవడం ఇష్టం ఉండదని అతనికి తెలుసే! మరి ఇలా మధ్యంతరంగా ఆగవలసిన అవసరం ఏమిటి? ఇది ఎవరిల్లబ్బా! మైకం కమ్మిన తనని తీసుకొచ్చి ఎవరో స్నేహితుల ఇంట్లో రాత్రి పడుకుందుకి ఆగి ఉంటాడా!బుర్ర పనిచెయ్యడం లేదు. కప్పు కాఫీ తాగాలి ముందు.అతన్ని కుదిపి నిద్ర లేపింది.‘‘ఎక్కడ ఉన్నాం?’’ చెవిలో గుసగుసలాడింది.అతను లేచి మంచం మీదే కూర్చుని చుట్టూ కలయజూశాడు. 

ఎక్కడున్నాడో అతనికీ అర్థం కాలేదు.‘‘మంచి ప్రశ్నే. రూం సర్వీస్‌ని పిలిచి కాఫీ తెప్పిస్తానుండు’’ అంటూ మగతగానే మంచం పక్కనున్న బల్లమీద టెలిఫోను కోసం చూశాడు. అక్కడ ఏమీ కనిపించలేదు. లేచి కాళ్ళీడ్చుకుంటూ పక్క గదిలోకి వెళ్ళాడు.‘‘ఇది హోటలులా లేదు. ఇక్కడొక వంట గది ఉంది. కాఫీ పెడతానుండు’’ అంటూ కాఫీ కాచుకునే సరంజామా కోసం వెతికాడు. అలమారలు, సొరుగులు, బీరువాలు అన్నీ ఖాళీ. రెఫ్రిజిరేటర్‌ తెరిచి చూసేడు. పాలు కానీ, పళ్ళు కానీ, గుడ్లు కానీ ఏవీ కనబడలేదు. ఎండిపోయిన రెండు రొట్టెముక్కలు తప్ప అంతా ఖాళీయే!నిస్పృహతో చుట్టూ చూశాడు. గోడకి తగిలించిన టెలిఫోను కనిపించింది. దానిని చేతిలోకి తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని ‘హలో’ అన్నాడు.ఎవ్వరూ పలకలేదు. అసలు ఏవిధమైన శబ్దమూ వినబడలేదు. దాని నుండి ఏ తీగా బయటికి వస్తూన్న దాఖలాలు కూడా కనబడలేదు. లోపల కనెక్షన్‌ వదులుగా ఉందేమోనని అటూయిటూ కుదిపాడు. ఆ కుదుపుకి అది కాస్తా ఊడి అతని చేతిలోకి వచ్చేసింది. అది ఒక అయస్కాంతపు ముక్కతో గోడకు అతికించబడి ఉంది.