మొదటి రోజు కళాశాలలోకి అడుగుపెట్టాను...చదువుకోడానికి కాదు. చదువు చెప్పడానికి.పీజీ అయిన వెంటనే వచ్చిన మొట్టమొదటి చిరు ఉద్యోగం. ఒక ఏడాది ఉద్యోగం చేశాక పై చదువులకి వెళ్ళాలని నా కోరిక.ఉత్కంఠగా ఉత్సాహంగా కారు దిగి ప్రిన్సిపల్‌ని కలిసి డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళాను. హెడ్‌ని కలిస్తే లీనా మేడంని పరిచయం చేశారు. ఆవిడ నాకు సీట్‌ చూపించి టైం టేబుల్‌ ఇచ్చి కొలీగ్స్‌ అందరినీ పరిచయం చేశారు. అంతగా కలివిడితనం లేని మనిషనుకుంటా, మొహంలో ఏ భావం లేకుండా అందరి పేర్లు చెప్పి వెళ్ళిపోయింది.డిపార్ట్‌మెంట్‌ పెద్దది. పన్నెండు మంది ఉపాధ్యాయులు ఉన్నారు నాతో సహా. అంతా కొత్తగా కాస్త బెరుగ్గా ఉంది నాకు. అందర్లో నేనే చిన్నదాన్నని తెలుస్తోంది. కొత్త చూపులు, కొత్త పిలుపులు, కొత్త పరిచయాలు, కొత్త వాతావరణం.మొహమాటంగా వారం రోజులు గడిచిపోయాయి.ఫఫఫఇంజనీరింగ్‌ కాలేజి అవడం వల్ల కొన్నిసార్లు ఆదివారాలు కూడా క్లాసులు జరుగుతుంటాయి. ఈ ఆదివారం లీనా మేడం రాలేదు.

 బహుశా చర్చికి వెళ్ళుంటారు.బ్రేక్‌ టైంలో బెల్‌ కొట్టగానే క్లాసు నుంచి వచ్చి నీరసంగా కుర్చీలో కూలబడ్డాను. నా ఎదురు సీట్లో ఉన్న రవి సర్‌ చేతిలో ఇంగ్లీష్‌ మేడం ఏదో పెట్టడం చూశాను. వరుసగా కూర్చున్న ఫాకల్టీ అందరూ అరచేతిలో ఉన్నదాన్ని కళ్ళకద్దుకుని లటుక్కున నోట్లో వేసుకున్నారు. పరీక్షగా చూస్తే తెలిసింది. తిరుపతి లడ్డూ అని.రవి సర్‌ నన్ను చూసి చిన్న నవ్వు నవ్వి‘‘మీరూ తీసుకుంటారా ప్రసాదం?’’ అనడిగారు.నేను నవ్వి ‘‘ఎందుకు తీస్కోను? నాకు పెట్టట్లేదేంటా అని చూస్తున్నాను’’ అన్నాను.

అందరూ నోళ్ళు తెరిచి ఒకేసారి నా వైపు చూశారు. నేనేమన్నా తప్పు మాట్లాడానేమో అని ఒక్క క్షణం కంగారుపడ్డాను.‘‘అరెరే! మీరు తీసుకుంటారని అస్సలు అనుకోలేదు మేడం. సాధారణంగా క్రిస్టియన్స్‌ తీసుకోరు కదా! మొహం మీదే చెప్పేస్తారు ‘మేం తినం’ అని. మాకు ఎంతగా మనసు చివుక్కుమంటుందో! ఇంద పట్టండి’’ సంతోషంగా నా అరచేతిలో మిగిలిన లడ్డూ పొడి వేసింది ఇంగ్లీష్‌ మేడం.