సుందర్రావుకు చెవిటి సుందర్రావనే బిరుదొకటి వుంది. ఒక ప్రభుత్వ శాఖలో ముప్ఫైమూడేళ్ళు డిస్పాచ్‌ సెక్షన్‌లోపనిచేసినట్లు నటించి వారం రోజుల కిందట రిటైరయ్యాడు. ఒకాయన సుందర్రావు గురించి అతని సమక్షంలోనేఒక అవమానకరమైన వ్యాఖ్య చేశాడు. ‘‘అసలు నన్నడిగితే డిస్పాచ్‌ ఒక సెక్షనే కాదంటాను.దాంట్లో మీరు వూడబొడిచిందేముంది? మీ పేరు ఆంధ్రదేశంలో ఎవరికైనా తెలుసా? ఊహూ! లేదే.మీరు నాలాగా కవులా- ఉపన్యాసకులా? ఏదీ కాదే! ‘అంచేత మీ జీవితం దాదాపు వ్యర్థమనే చెపకోవాలి’ ఏమిటి.నా బొంద. నేనే నలుగురికి చెప్పి తీరతాను’’ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ‘‘అలా కాదులెండి. నాలాగా అంతకాలం ఒకే సెక్షన్‌లోపని చేయకుండా, చేసినట్లు తలపింపచేయడం, అల్లాటప్పా పనికాదు.అంత చాకచక్యంగా, కళాత్మకంగా, విజయవంతంగా సర్వీసు పూర్తి చేయడం.అదేదే బుక్కులోకి ఎక్కవలసిన విషయం కాదంటారా?’’ మర్మమెరిగి మెచ్చుకుంటాడని ఆశగా చెప్పాడు.‘‘ఎవరు మాత్రం పనిచేశారు? నేను చేశానా? హాయిగా కవిత్వం రాసుకునేవాణ్ణి. మీదంతాగొప్ప విషయం కాదులెండి’’ చప్పరించేశాడు. సుందర్రావుకు ఏడుపు ఎగతన్నుకు వచ్చింది.‘‘మరైతే ఈ రోజు నుంచి నేనూ కవిత్వం రాస్తాను. అదేమైనా బ్రహ్మ విద్యా? కవిత్వం గురించి నాకు ఉపయోగపడే సూచనలేమైనా ఇస్తారా?’’‘‘అలా అన్నావు. భేషైన మాట. నువ్వు రాసేదీ ఏ రకమైనా కవిత్వమైనా సరే! దాంట్లో ఉన్మలన, ప్రాసంగికత,మూడోది మరేదోవుంది. ఈ మూడు నీ కవిత్వంలో కనిపించేలా జాగ్రత్తపడు’’‘‘ఇపుడు మీరన్న మాటలకర్థం. చెబుతారా?’’‘‘అర్థం నాకూ తెలీదనుకో. అది వేరే విషయం. 

కానీ అవి నా కవితల్లో ప్రజ్వరిల్లుతూ ప్రముఖంగా కనిపిస్తాయని స్థానిక ఏకైక విమర్శకుడు ‘కాంగామొ’ గారన్నారు. ఆయనన్నారంటే అవి వుండి తీరాల్సిందే. కాంగామొ గారంటే అల్లాటప్పా మనిషనుకుంటున్నారేమో. కాంతమ్మ గారి మొగుడు. మా కాలనీలో పుణ్యం కొద్దీ స్వయంభువుగా వెలిసిన మహా విమర్శకుడు’’ భక్తితో నేత్రాలు అర్థ నిమితలయ్యాయి.‘‘కాంగామొ చెప్పినా కంగారూ చెప్పినా అవేమిటో తెలియకుండా ఎలా వుంచి చావడం. కవిత్వం నాకు అచ్చిరాదులెండి’’ సుందర్రావు విసుగ్గా చెప్పాడు. చెప్పాడే కాని నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరికను మొదలంటా అణచలేకపోయాడు. రకరకాల ఆలోచనలుఅక్వేరియంలో చేపపిల్లల్లా మెదడులో ఈదులాడుతున్నాయి. తన పెళ్ళి శుభలేఖలో తప్ప తన పేరు ఎక్కడా అచ్చు కాలేదు. ఉన్న ఒక్క కొడుకు పెళ్ళి చేస్తే వాడి శుభలేఖలో‘‘ ఆగమనాభిలాషులు’’ గా తనపేరూ భార్యపేరు అచ్చులో చూసుకోగలడు. కానీ వాడు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని, దీవించమని వస్తే దీవించాలా వద్దా? దృశ్యం కళ్ళ ముందు కట్టి గుండె ఝల్లుమంది. దీవించడమా, మానడమా? మీమాంసలో పడి భార్య అభిప్రాయం అడిగాడు.