ఉదయం ఎనిమిదిన్నర గంటలు. స్వరాజ్‌ మాజ్దా క్యాబ్‌ ఎలెకా్ట్రనిక్‌ సిటీలో ఉన్న క్లియో సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ బెంగుళూరు హెడ్‌క్వార్టర్స్‌ వైపు పరుగులు తీస్తోంది. సిటీ స్టాపులన్నిట్లో ఒకరిద్దర్ని ఎక్కించుకున్న బస్‌ నిండిపోయింది. నగరం హద్దులు దాటిన తర్వాత ఇంక బస్సెక్కడా నిలవదు. అందులో ప్రయాణిస్తున్న వారంతా ఇరవయి ఐదు నుంచీ ముప్పయి వరకూ వయసున్న యువతీయువకులే! కొందరు వాళ్ళ ఆలోచనలు, ఒత్తిడులలో వాళ్ళుంటే, మిగతా వాళ్ళు పక్కన, ఎదురుగా ఉన్న వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నారు. వెయ్యిమంది పైనే పనిచేసే ఆ కంపెనీలో ఎన్నో ప్రాజెక్టులు. వాటివే వేరే మైల్‌స్టోన్లు, డెడ్‌లైన్లు. అందుకని ఎప్పుడూ కొందరు ప్రాజెక్టు టెన్షన్లలో ఉంటారు. కానీ చాలామటుకు యువతీ యువకులు కాబట్టి లోపలెంత కష్టం ఉన్నా, పైకి మజా చేస్తున్నట్లే ఉంటారు. సాధారణంగా క్యాబ్‌లో వాళ్ళ మేనేజర్లు ప్రయాణించరు. అందుకని జాలీగా వాళ్ళమీద ఫిర్యాదులు, జోకులు, తిట్లు బస్సులో ఆ చివరినుంచీ ఈ చివరి వరకూ సంచరిస్తున్నాయి.రెండో వరుస కిటికీ సీట్లో కూర్చుని ఉన్న దుర్గ మౌనంగా తన ఆలోచనల్లో మునిగి ఉంది. తన భర్త రాజేష్‌ గురించే ఆమె ఆలోచనలు. ఎకనామిక్స్‌ మరియు మ్యాథ్స్‌లో డబుల్‌ మాస్టర్స్‌ పదవులున్న రాజేష్‌ ఇంకొక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఫైనాన్స్‌ ఎక్జిక్యూటివ్‌గా ఉన్నాడు. అతడూ మునుపు క్లియోలోనే పనిచేసేవాడు.

అప్పుడే వీళ్ళిద్దరి పరిచయమయింది.మొదటిసారి లిఫ్ట్‌లో కనిపించాడు రాజేష్‌ దుర్గకు. తల ఒంచుకుని ఏదీ పట్టించుకోకుండా వెళ్ళే రాజేష్‌ను కొత్తగా చేరిన ఉద్యోగి దుర్గ కళ్ళలోని వెలుగు, పెదవుల మీద చెరగని చిరునవ్వు, ఎప్పుడూ పక్కనున్న సహోద్యోగులతో గలగల మని ఏదో మాట్లాడే తీరు చాలా ఆకర్షించాయి. తర్వాత ధైర్యం చేసి కొన్నిరోజులు ఆమె వెళ్ళే క్యాబ్‌లో సాయంత్రాలు తనూ ఎక్కి దుర్గ పక్కనో, దగ్గర్లోనో సీటు సంపాదించేవాడు. ఆ పరిచయమే ప్రేమగా మారడానికి ఎక్కువరోజులు పట్టలేదు. తరువాత ప్రతీ రోజూ సాయంత్రం ఇద్దరి పనులయ్యాక కలిసి, ఆఫీసు పక్కనే ఉన్న చిన్నపూవుల తోటలో దట్టంగా పెంచిన లాన్స్‌లో పచార్లు చేస్తూనో, అక్కడే ఉన్న ఒక సిమెంటు బెంచీ మీద కూర్చునో కబర్లు చెప్తూ కాస్సేపయినా గడిపేవారు. తరువాత ఇద్దరూ ఎనిమిది గంటలకు బయలుదేరే రెండో క్యాబ్‌లో వెళ్ళేవాళ్ళు. ఏదయినా ఒక రోజు రాజేష్‌ తన బైక్‌ తీసుకొస్తే, ఇద్దరూ త్వరగా సిటీలోకి వెళ్ళి ఏ ‘కాఫీ డే’ లోనో ‘బరిస్టా’ లోనో కూచుని గడిపేవారు.కానీ దుర్గ మాత్రం ఒక సంవత్సరమయినా ఉద్యోగానుభవం అయ్యేదాకా రాజేష్‌ విషయం ఇంట్లో దాచింది. ఇద్దరూ తల్లిదండ్రులకు ఒకే సంతానం కావడం వల్ల వాళ్లే దగ్గరుండి పెళ్ళి జరిపించారు. బెంగుళూర్లో మునుపే తమకు స్వంతంగా ఉన్న అపార్ట్‌మెంటులోనే రాజేష్‌ అప్పటికే ఉంటున్నాడు. అందుకని పెళ్ళయ్యాక ఇంకొక ఇల్లు చూడవలసిన అవసరం రాలేదు.