శ్రీరామ్‌గారు పది సంవత్సరాల కింద అమెరికా సన్‌వాలీలో, భారతీయులు అధికంగా ఉండేచోట, ‘ఇండియన్‌ ప్రొవిజన్స్‌ లిమిటెడ్‌’ అన్న వ్యాపార సంస్థను ప్రారంభించారు.మంచి ఇంగువ, అప్పడాలు, ఊరగాయలు, చట్నీలు, పప్పులు మొదలైనవి భారతదేశం నుంచి తెప్పించి, బాగు చేయించి చక్కగా పాక్‌ చేసి, ఖర్చుల మీద పది శాతం వెలకు అమ్మేవారు. వేల డాలర్లలో ఆర్జించే అమెరికన్‌ భారతీయులకు ఆ ధరలు హెచ్చుగా తోచలేదు. సరకు దొరుకుతున్నందుకు సంతోషించారు.‘ఇండియన్‌ ప్రొవిజన్స్‌’ పది సంవత్సరాలలో లాసేంజిలీస్‌, న్యూజెర్సీ, న్యూయార్కు, వాషింగ్‌టన్‌, చికాగో, అట్లాంటా వంటి పది నగరాలలో బ్రాంచిలు నెలకొల్పి, పెద్ద వ్యాపారం చేసింది. లాభాలు తొలుత మిలియన్ల మీద వచ్చి, క్రమంగా బిలియన్లు చేరుకున్నాయి. ఆయన ఒక జెట్‌ప్లేను కొనుక్కొని బ్రాంచీలకు వెళ్లివస్తూ ఉండేవారు.శ్రీరామ్‌గారి ధర్మపత్ని జానకీదేవీగారు. ఆమె చాల ఉత్తమురాలు. పూజలు, నోములు చేసేవారు. సాధ్యమయినంత వరకు నియమ నిష్ఠలు పాటించేవారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు, కూతుళ్లకు పెళ్లి చేశారు. అల్లుళ్లు చాలా మంచివాళ్లు. ఉన్న ఒక్క కొడుకు బుద్ధిమంతుడు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. చేశాడు. ఏ ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక తండ్రి గారికి వ్యాపారంలో సాయం చేసేవాడు.

 

శ్రీరామ్‌గారికి న్యూయార్కు, వాషింగ్‌టన్‌ డి.సి., షికాగో, లాస్‌ఏంజలీస్‌, అట్లాంటా వంటి మహానగరాలలో బ్రాంచిలున్నాయి.శ్రీరామ్‌గారి లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. మిలియన్లు దాటి బిలియన్లలోకి వచ్చాయి. అమెరికాలోని బిలియనీర్లలో ఆయన ఒకరు.ఆయన రోజూ యోగాసనాలు వేస్తారు. ధ్యానం చేస్తారు. మద్యం వేపు చూసే వారు కారు.శ్రీరామ్‌గారు హైదరాబాద్‌లో జన్మించారు. ఇప్పుడు ఆయన బంధువు లెవరూ లేరు.తన జన్మస్థలంలో ఆయన ఒక మంచి భవనం నిర్మించాలని సంకల్పించారు. భార్యతోను, పిల్లలతోను సంప్రదించారు. అందరూ అంగీకరించిన తరువాత ఆయన రంగంలోకి దిగారు.ఒక మంచిరోజున శ్రీమతి జానకీదేవి గారితో కలిసి హైదరాబాద్‌ చేరు కున్నారు. నాంపల్లిలో ఒక అయిదు నక్షత్రాల హోటలులో బస చేశారు. భారతీయ సంస్కృతి పట్ల, కళల పట్ల ఆకర్షితులయ్యారు. పాశ్చాత్య వ్యామోహంలో పడి, ఆధ్యాత్మిక జీవనవిధానం పట్ల చిన్నచూపు చూసినందుకు విచారించారు. ఈ కారణాలన్నీ వారికి భారతదేశంలో ఒక భవనం కట్టించి, సంవత్సరంలో కొన్ని నెలలు అందులో ఉండాలని సంకల్పించారు.