అప్పుడే ఆఫీసునించి వచ్చిన వాసుతో అంది వాసంతి, ‘‘చూశారా? ప్రొద్దున్నే నేను ఆఫీసుకి వెడుతూ కూర, పచ్చడీ, అన్నం అన్నీ డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టినా, ఇప్పటిదాకా ముట్టుకోలేదు మీ అమ్మ గారు. ఇన్నాళ్ళూ ఇష్టమైన నా వంట, ఇప్పుడు కష్టమై పోయిందా? నేను ప్రొద్దున్నే లేచి ఒళ్ళు విరుచుకుని అన్నీ చేయటం, ఆవిడ ఇలా సాయంత్రం దాకా తినకపోవటం... పని మనుషుల పాలు చేయటం. మనకేమైనా డబ్బులు చెట్లకి కాస్తున్నాయా? ఎవరిని సాధిద్దామని?’’వాసు నోటికి చూపుడు వేలు అడ్డం పెట్టు కుని, ‘‘ష్‌! అమ్మకి వినపడితే బాగుండదు, నెమ్మదిగా మాట్లాడు. ఒకవేళ మరిచి పోయిం దేమో. దానికి ఇన్ని అరుపులు ఎందుకు...’’ అన్నాడు.తల్లి అనసూయమ్మ గారు తన గదిలో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్నది.కూతురు నీలిమ తన గదిలో హోంవర్క్‌ చేసుకుంటున్నది.‘‘తేరగా వచ్చింది కదా అని రోజూ మేస్తు న్నప్పుడు, ఇవాళ ఏమయింది?’’ అంది కోపంగా వాసంతి.వాసు కూడా కోపంగానే, ‘‘ఆవిడ తేరగా ఏమీ తినటం లేదు. మనం వుండే ఇల్లు ఆవిడదే. ఈ హైదరాబాదులో సెంటర్లో ఇంత పెద్ద ఇల్లు అద్దెకి కావాలంటే, నెలకి పాతిక వేలవుతుంది. తేరగా వుంటున్నది మనం, ఆవిడ కాదు’’ అన్నాడు.‘‘ఇల్లు వుంటే? ఇరవై ఏళ్ల క్రితం మీ నాన్న గారు పోయినప్పటినించీ మనం తిండి పెట్టటం లేదూ. 

మందులూ, డాక్టర్లూ ఎన్ని ఖర్చులు. మనం ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా చాలటం లేదు. పైగా మన అమ్మాయి నీలిమ చదువు. అది అప్పుడే ఏడో క్లాసుకి వచ్చేసింది... దాని కాలేజీ ఖర్చులు ఎక్కడినించీ తెస్తారు...’’‘‘దానికీ, మా అమ్మ మన దగ్గర వుండటానికి ఏమీ సంబంధం లేదు’’ అన్నాడు వాసు.‘‘సంబంధాలు వుండాలంటే వుంటాయి, వద్దనుకుంటే వుండవు’’ అంటూ వాసు పక్కనే కూర్చుంటూ అన్నది వాసంతి. ‘‘అది కాదండీ! ఒకసారి తీరిగ్గా మన జీవితాలూ, మనమ్మాయి భవిష్యత్తూ గురించి ఆలోచించండి. ఈ ఇల్లు అమ్మితే, ఇక్కడ స్థలమే రెండు కోట్ల రూపా యలు చేస్తుంది. మనం ఈ పాత ఇంట్లో వుంటు న్నందు వల్ల ఆ డబ్బు విలువ మనకి తెలియటం లేదు. మనం దాన్ని అనుభవించటమూ లేదు. ఇల్లు అమ్మేద్దాం. పెద్ద ఎపార్ట్మెంట్‌ కొనుక్కుందాం. మిగిలిన డబ్బులో కొంత దాచుకుందాం, మిగ తాది మనమున్నంత కాలం అనుభవిద్దాం... ముందుగా ఈ ఇంట్లో మీ భాగం మీరు తీసు కోండి’’.